‘చేయూత’నిచ్చేనా?

ABN , First Publish Date - 2021-06-20T05:45:17+05:30 IST

మహిళలకు ఆర్థిక తోడ్పాటు అందించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ చేయూత పథకాన్ని అమలు చేస్తోంది. అర్హులైన మహిళకు నాలుగు విడతల్లో రూ.75 వేలు సాయం అందించాలని సంకల్పించింది. అందులో భాగంగా గత ఏడాది ఆగస్టులో తొలి విడత రూ.18,750 చొప్పున మహిళల ఖాతాల్లో జమ చేశారు. తాజాగా రెండో విడత నగదు జమ చేసే ప్రక్రియ మొదలైంది. గత ఏడాది జాబితా రెన్యువల్‌, కొత్తగా అర్హుల పేర్ల నమోదుకు అధికారులు శ్రీకారం చుట్టారు. పేర్ల నమోదుకు ఆదివారంతో గడువు ముగియనుంది. ఈ ప్రక్రియలో రాజకీయ నేతల జోక్యం పెరిగింది.

‘చేయూత’నిచ్చేనా?
‘చేయూత’పై ఇంటింటా సర్వే చేస్తున్న వలంటీరు

రెన్యువల్‌, నమోదులో రాజకీయ జోక్యం

 లబ్ధిదారుల పేర్లు గల్లంతు

(ఇచ్ఛాపురం రూరల్‌)

మహిళలకు ఆర్థిక తోడ్పాటు అందించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ చేయూత పథకాన్ని అమలు చేస్తోంది. అర్హులైన మహిళకు నాలుగు విడతల్లో రూ.75 వేలు సాయం అందించాలని సంకల్పించింది. అందులో భాగంగా గత ఏడాది ఆగస్టులో తొలి విడత రూ.18,750 చొప్పున మహిళల ఖాతాల్లో జమ చేశారు. తాజాగా రెండో విడత నగదు జమ చేసే ప్రక్రియ మొదలైంది. గత ఏడాది జాబితా రెన్యువల్‌, కొత్తగా అర్హుల పేర్ల నమోదుకు అధికారులు శ్రీకారం చుట్టారు. పేర్ల నమోదుకు ఆదివారంతో గడువు ముగియనుంది. ఈ ప్రక్రియలో రాజకీయ నేతల జోక్యం పెరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు వేయలేదన్న కారణంగా కొందరి పేర్లు నమోదు చేయడం లేదన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికే తొలి జాబితాలోని వేలాది మంది పేర్లు గల్లంతయ్యాయి. తొలి విడత నిర్థేశిత మొత్తాన్ని తీసుకున్నాం. రెండో విడత ఎందుకు రెన్యువల్‌ చేయడం లేదంటూ మహిళలు నిలదీస్తున్నా.. క్షేత్రస్థాయిలో ఎవరూ సమాధానం చెప్పడం లేదు. సామాజిక తనిఖీ కోసం సచివాలయాల్లో జాబితాలను ప్రదర్శించలేదు. దీంతో చేయూత పథకం అస్తవ్యస్తంగా మారింది.


షెడ్యూల్‌ ఇదే.. 

చేయూత పథకం లబ్ధిదారుల ఎంపిక రెన్యువల్‌ ప్రక్రియను గ్రామ, వార్డు వలంటీర్లకు అప్పగించారు. ఈ నెల 3 నుంచి ప్రక్రియ మొదలైంది. 8వ తేదీ వరకు వలంటీర్లు ఇంటింటా తిరిగి తొలి విడత రెన్యువల్‌, కొత్తవారిని ఎంపిక చేశారు. అర్హుల జాబితాలను అప్‌లోడ్‌ చేశారు. వలంటీర్లు ఆమోదించిన జాబితాలపై గ్రామ, వార్డు సచివాలయ సంక్షేమ సహాయకులు పరిశీలిస్తున్నారు. అనర్హుల తొలగింపు, కొత్త జాబితా తయారీ, 60 ఏళ్లు పైబడిన వారిని తొలగించడం వంటివి చేస్తున్నారు. 15వ తేదీ నాటికి సంబంధిత ఎంపీడీవో, మున్సిపల్‌ కమిషనర్‌ ఈ జాబితాలను ఆమోదించి, కార్పొరేషన్లకు పంపించాలి. 17న కార్పొరేషన్ల నుంచి కలెక్టర్‌ ఆమోదానికి వెళ్లాలి. కానీ ఇంతవరకు సచివాలయాల్లోనే ప్రక్రియ కొనసాగుతోంది.  


అర్హులకు చోటు దక్కేనా? 

తొలి విడత 1,91,417 మంది అర్హులను గుర్తించారు. తాజాగా వారిలో 60 ఏళ్లు వయసు దాటిందని 26,417 మంది పేర్లను తొలగించారు. మిగిలిన 1,65,000 మందిని ఎంపిక చేశారు. మరోవైపు ఈ ఏడాది 45 ఏళ్లు నిండిన మహిళలు 32,500 మంది ఉన్నట్లు గుర్తించారు. దరఖాస్తు చేసుకునేందుకు వారికి అవకాశం కల్పించారు. జిల్లాలో చాలామంది అర్హుల పేర్లను జాబితాలో నమోదు చేయలేదని తెలుస్తోంది. రాజకీయ నేతల సూచన మేరకే చాలా మంది పేర్లను తొలగించినట్లు విమర్శలు వస్తున్నాయి. గత ఏడాది అన్ని విధాలా అర్హత ఉన్నప్పటికీ సాంకేతిక లోపంతో పథకానికి దూరమైన మహిళలకు ఈసారి కూడా రిక్తహస్తమే ఎదురవుతోంది. వలంటీర్లకు అందజేసిన యాప్‌లో గతంలో చేయూత పథకం వర్తించిన లబ్ధిదారుల పేర్లు రానివారు.. ఈ ఏడాది నగదు జమ అవుతుందో లేదోననే డోలాయమానంలో ఉన్నారు.


అర్హులందరికీ వర్తింపజేస్తాం

జిల్లాలో అర్హత కలిగిన లబ్ధిదారులందరికీ వైఎస్సార్‌ చేయూత పథకం వర్తింపజేస్తాం. సచివాలయాల్లో, ఎంపీడీవో కార్యాలయాల్లో లబ్ధిదారుల ఎంపిక ఇంకా పూర్తికాలేదు. అర్హత ఉండి పథకానికి దూరమైన లబ్ధిదారులు స్పందనలో అర్జీ చేసుకోవచ్చు. వారి అర్హతను పరిశీలించి లబ్ధి చేకూరుస్తాం. 

- బి.శాంతిశ్రీ, పీడీ, డీఆర్‌డీఏ, శ్రీకాకుళం

Updated Date - 2021-06-20T05:45:17+05:30 IST