కొబ్బరి రైతు కుదేలు!

ABN , First Publish Date - 2021-05-17T03:18:43+05:30 IST

కరోనా వేళ.. కొబ్బరి రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొబ్బరిని శ్రీఫలంగా పేర్కొంటారు. అన్ని శుభకార్యాల్లో కొబ్బరికాయదే అగ్రతాంబూలం.

కొబ్బరి రైతు కుదేలు!
జగతి కొబ్బరి తోటలో నిల్వ ఉన్న కొబ్బరికాయలు

తోటల్లో రోజుల తరబడి నిల్వలు

కాయలు పాడవుతాయన్న ఆందోళనలో రైతులు

కొనుగోలుకు ముందుకురాని వ్యాపారులు

ఉత్తరాధి రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షలే కారణం

(కవిటి)

తితలీ తుపాను తరువాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కొబ్బరి రైతుపై కరోనా పంజా విసురుతోంది. ఉత్తరాధి రాష్ట్రాలకు రవాణా నిలిచిపోవడంతో వ్యాపారులు కొనుగోలుకు ఆసక్తి కనబరచడం లేదు. ఫలితంగా తోటల్లో కొబ్బరి నిల్వలు పేరుకుపోతున్నాయి. కళ్లెదుటే పంట ఉన్నా విక్రయించుకోలేని స్థితిలో రైతులు ఉన్నారు. ఎక్కువ రోజులు నిల్వ ఉంటే కాయలు పాడైపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. కొబ్బరి రవాణాకు మినహాయింపులు ఇవ్వాలని కోరుతున్నారు. 


కరోనా వేళ.. కొబ్బరి రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొబ్బరిని శ్రీఫలంగా పేర్కొంటారు. అన్ని శుభకార్యాల్లో కొబ్బరికాయదే అగ్రతాంబూలం. ఈ కాయలేని పండుగ లేదు. అందుకే అన్ని సీజన్లలో కొబ్బరికి విపరీతమైన డిమాండ్‌. అటువంటి కొబ్బరి సాగు జిల్లాలో అధికం. దేశంలోని అనేక ప్రాంతాలకు మన జిల్లా నుంచే కొబ్బరి ఎగుమతి అవుతోంది. కంచిలి, కవిటి, ఇచ్ఛాపురం, సోంపేట, మందస, పలాస, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి తదితర మండలాల్లో 24 వేల హెక్టారుల్లో పంట సాగవుతోంది. కానీ ప్రస్తుతం కరోనా కేసులు, లాక్‌డౌన్‌ అమలుతో రవాణా నిలిచిపోయింది. వ్యాపారులు కొనుగోలుకు ముందుకు రావడం లేదు. అందుకే తోటల్లో రోజుల తరబడి కొబ్బరి కాయలు నిల్వ ఉండిపోతున్నాయి. సాధారణంగా కొబ్బరిని ప్రతీ రెండు నెలలకు ఒకసారి సేకరిస్తారు. స్థానిక వ్యాపారులు కొనుగోలు చేసి బిహార్‌, ఢిల్లీ, చత్తీస్‌గడ్‌, మధ్యప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, పాట్నా, ఒడిశాల తదితర రాష్ట్రాలకు తరలిస్తుంటారు. కొబ్బరి సేకరణ సమయంలో రోజుకు సగటున జిల్లా నుంచి మూడు లక్షల కొబ్బరికాయలు ఎగుమతయ్యేవి. కానీ వరుస విపత్తులతో కొబ్బరి పంటకు అపార నష్టం కలిగింది. ఉత్పత్తి క్రమేపీ తగ్గుముఖం పడుతోంది. ఇప్పుడు కరోనా రూపంలో పెద్ద కష్టమే ఎదురైంది. ఉత్తరాధి రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షలు ఉండడం, మన రాష్ట్రంలో మధ్యాహ్నం 12 గంటల తరువాత లాక్‌డౌన్‌ అమల్లో ఉండడంతో రవాణాపై ప్రభావం చూపుతోంది. ఇదే అదునుగా కొందరు దళారులు, చిరు వ్యాపారులు తక్కువ ధరకు అడుగుతున్నారు. ప్రత్యామ్నాయం లేక రైతులు విక్రయిస్తున్నారు. మొన్నటి వరకూ వెయ్యి కాయలు రూ.17వేల వరకూ పలికేవి. ఇప్పుడు కొబ్బరి కాయలకు డిమాండ్‌ ఉన్నా ధర తక్కువ చేసి అడుగుతున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. 


కాయలు పాడవుతాయి

తోటల్లో నిల్వలు పేరుకుపోతున్నాయి. కాయల సేకరణ తరువాత పదిరోజుల్లో విక్రయించాలి. లేకుంటే కాయలు పాడయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం కరోనాతో రవాణా నిలిచిపోవడంతో వ్యాపారులు ముందుకు రావడంలేదు. అందుకే చిరువ్యాపారులు నచ్చిన ధరకు అడుగుతున్నారు. వేరే మార్గం లేక విక్రయిస్తున్నాం. 

- బావన నూకరాజు, కొబ్బరి రైతు, జగతి


గిట్టుబాటు ధర కల్పించాలి

కొబ్బరికి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలి. ఉద్దానంలో కొబ్బరి ఆధారిత పరిశ్రమ ఏర్పాటు చేయాలి. గతంలో కొబ్బరి పార్కు నిర్మాణానికి ప్రభుత్వం ప్రకటన చేసినా కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టిసారించాలి. లాక్‌డౌన్‌లో కొబ్బరి రవాణాకు మినహాయింపు ఇవ్వాలి. 

- బల్లెడ కృష్ణారావు, కొబ్బరి రైతు, ప్రగడపుట్టుగ

 

Updated Date - 2021-05-17T03:18:43+05:30 IST