కొనుగోలు కేంద్రాల సిబ్బందికి సహకరించాలి

ABN , First Publish Date - 2022-05-29T05:03:19+05:30 IST

కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు, కొనుగోలు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ హన్మంతరావు అన్నారు.

కొనుగోలు కేంద్రాల సిబ్బందికి సహకరించాలి
జగదేవ్‌పూర్‌ మండలం అంగడికిష్టాపూర్‌ కొనుగోలు కేంద్రం వద్ద రైతులతో మాట్లాడుతున్న కలెక్టర్‌

జగదేవ్‌పూర్‌, మే 28: కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు, కొనుగోలు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ హన్మంతరావు అన్నారు. శనివారం మండల పరిధిలోని ఎర్రవల్లి, అంగడికిష్టాపూర్‌, మర్కుక్‌ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు లారీలు సరిగ్గా రావటం లేదని, వర్షాలకు వడ్లు తడుస్తున్నయని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. లారీల కొరత లేకుండా చూడాలని సంబంధిత ఆదికారులకు సూచించారు. మర్కుక్‌ కొనుగోలు కేంద్రానికి వడ్లు పట్టే జాలి మిషన్‌ రేపటిలోగా తీసుకురావాలని తహసీల్దార్‌ అహ్మద్‌ఖాన్‌ను ఆదేశించారు. 

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి

వర్గల్‌, మే 28: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని జిల్లా వ్యవసాయాధికారి శివప్రసాద్‌ సూచించారు. శనివారం వర్గల్‌ మండల పరిధిలోని నాచారంలో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి రమణి, ఏఈవోలు, రైతులు ఉన్నారు. 

రైస్‌ మిల్లర్లు సహకరించాలి : గజ్వేల్‌ ఆర్డీవో

వర్గల్‌, మే 28: ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని రైస్‌ మిల్లుల్లో దిగుమతి అయ్యేవిధంగా రైస్‌ మిల్లర్లు సహకరించాలని గజ్వేల్‌ ఆర్డీవో విజయేందర్‌రెడ్డి అన్నారు. శనివారం వర్గల్‌ మండల పరిధిలో ధాన్యం దిగుమతి అయ్యే పలు రైస్‌ మిల్లులను పరిశీలించి మాట్లాడారు. ఆయన వెంట ఆర్‌ఐ రాజు, పీఏసీఎస్‌ సీఈవో జితేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. 

ధాన్యం దిగుమతి చేసుకోవడం లేదని మంత్రికి ఫిర్యాదు

వర్గల్‌, మే 28: కొనుగోలు కేంద్రాల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్‌ మిల్లర్లు దిగుమతి చేసుకోవడం లేదని వర్గల్‌ పీఏసీఎస్‌ చైర్మన్‌ రామకృష్ణారెడ్డి శనివారం ములుగు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి హరీశ్‌రావుకు ఫిర్యాదు చేశారు. స్పందించిన మంత్రి గజ్వేల్‌ ఆర్డీవోకు రైస్‌ మిల్లర్లు వెంట వెంటనే ధాన్యాన్ని దిగుమతి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

తూకంలో తేడా జరిగితే చర్యలు తప్పవు

మద్దూరు, మే 28: రైతుల ధాన్యం కొనుగోళ్ల విషయంలో కాంటాలో తూకం ఎక్కువగా పెడితే చర్యలు తప్పవని దూళిమిట్ట తహసీల్దార్‌ అశోక్‌ హెచ్చరించారు. శనివారం మండల కేంద్రంతో పాటు బెక్కల్‌, తోర్నాల, బైరాన్‌పల్లి, జాలపల్లి, కొండాపూర్‌, కూటిగల్‌ గ్రామాల్లో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతుల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ అయిలయ్య, వీఆర్వోలు పాల్గొన్నారు. 



Updated Date - 2022-05-29T05:03:19+05:30 IST