ప్రతి నెలా పర్యటిస్తా

ABN , First Publish Date - 2022-05-22T06:15:48+05:30 IST

వెనుకబడిన జిల్లాల్లో కార్‌రేస్‌ కోసం ఇచ్చిన భూముల్లో పురోగతి కనిపించాలని శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్‌ బసంతకుమార్‌ యాజమాన్యాన్ని ఆదేశించారు.

ప్రతి  నెలా పర్యటిస్తా

‘కార్‌రేస్‌’ పనుల్లో పురోగతి కనిపించాలి: కలెక్టర్‌ బసంత కుమార్‌

తనకల్లు, మే 21: వెనుకబడిన జిల్లాల్లో కార్‌రేస్‌ కోసం ఇచ్చిన భూముల్లో పురోగతి కనిపించాలని శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్‌ బసంతకుమార్‌ యాజమాన్యాన్ని ఆదేశించారు. ప్రతి నెలా పర్యటిస్తానని, పనులు జరగకపోతే అనుమతుల రద్దుకు సిఫార్సు చేస్తానని హెచ్చరించారు. శనివారం తనకల్లు మండలంలోని కోటపల్లి వద్ద ‘మార్క్‌ టు మోటార్స్‌ కార్‌ రేస్‌’కు కేటాయించిన భూములను అక్కడ జరుగుతున్న పనులను కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన నలుగురు రైతులు తమకు నష్టపరిహారం ఇంతవరకు చెల్లించలేదని ఫిర్యాదు చేశారు. తాము సాగుచేసుకుంటున్న భూములను 2019లోనే స్వాధీనం చేసుకున్నారని కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన మార్క్‌ టు మోటార్స్‌ యజమాని చక్రవర్తి మాట్లాడుతూ నాలుగురోజుల్లో నష్టపరిహారం చెల్లిస్తామని తెలిపారు. ఈవిషయంపై టూరిజం శాఖ జిల్లా అధికారి నాగేశ్వర్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. గత ఏడు నెలలుగా ఇదే విషయం చెబుతున్నారని, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన కలెక్టర్‌ తాను ప్రతి నెల పరిశీలిస్తానని, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోతే చర్యలకు ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామన్నారు. అవసరమైతే రద్దు చేయడానికి సిఫార్సు చేయడానికి కూడా వెనుకాడేది లేదన్నారు. అనంతరం కలెక్టర్‌ బాలసముద్రం గ్రామ సచివాలయాన్ని, రైతు భరోసా కేంద్రం, తనకల్లులో ‘చెత్తతో సంపద తయారీ’ కేంద్రాలను పరిశీలించారు. తనకల్లులో నాయీబ్రాహ్మణుల శ్మశాన వాటిక స్థలాన్ని కబ్జా చేస్తున్నారని పలువురు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ వెంట కదిరి ఆర్డీఓ రాఘవేంద్రప్ప, డీపీఓ విజయకుమార్‌, ఎంపీడీఓ పూల నరసింహులు, ఈఓఆర్డీ ఆనందయ్య, డిప్యూటీ తహసీల్దార్‌ భారతి తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-05-22T06:15:48+05:30 IST