నత్తనడకన రైతువేదికల నిర్మాణాలు

ABN , First Publish Date - 2020-12-03T05:48:29+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతువేదికల నిర్మాణాలు నర్సాపూర్‌ మండలంలో నత్తనడకన సాగుతున్నాయి.

నత్తనడకన రైతువేదికల నిర్మాణాలు
లింగాపూర్‌లో కొనసాగుతున్న రైతువేదిక భవన నిర్మాణం

 మంత్రి, కలెక్టర్‌ ఆదేశాలూ బేఖాతరు

 ఐదింటిలో ఒక్కటే నిర్మాణం పూర్తి 



నర్సాపూర్‌, డిసెంబరు 2: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతువేదికల నిర్మాణాలు నర్సాపూర్‌ మండలంలో నత్తనడకన సాగుతున్నాయి. మండలంలో ఐదు క్లస్టర్‌ కేంద్రాలైన నర్సాపూర్‌, ఆవంచ, లింగాపూర్‌, ఇబ్రహీంబాద్‌, అహ్మద్‌నగర్‌ గ్రామాల్లో రూ.22 లక్షలతో ఒక్కో రైతువేదికను నిర్మిస్తున్నారు. ఎప్పుడో పూర్తి కావాల్సి ఉన్నా వివిధ కారణాలతో పనులు కొనసాగుతూనే ఉన్నాయి. జూన్‌లో మంత్రి హరీశ్‌రావు నర్సాపూర్‌ బీవీఆర్‌ఐటీ కళాశాలలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించి రైతువేదికలను మూడు నెలల్లో పూర్తి చేయాలని అప్పట్లో అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం కూడా తీసుకోవాలని సూచించారు. నిర్మాణ విషయంలో అలసత్వం చేయకూడదని మండల, నుంచి జిల్లా స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించారు. కానీ నిర్మాణాలు మాత్ర కాలేదు. ఇన్‌చార్జి కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి గత నెల జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి నవంబరు నెలాఖరులోగా జిల్లాలో రైతువేదికలను పూర్తి చేయాలని ఆదేశించారు. అందుకు ప్రతి రైతువేదికకు ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు మండలానికి జిల్లా స్థాయి అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించారు. నర్సాపూర్‌ మండలానికి జడ్పీ సీఈవో లక్ష్మీబాయిని ప్రత్యేక అధికారిగా నియమించారు. ఆమె కూడా తరచూ మండలంలో రైతువేదికల నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పూర్తి చేయాలని సదురు కాంట్రాక్టర్‌కు సూచించారు. స్థానిక అధికారులకు సూచించినా ఫలితం లేకుండా పోయింది. నర్సాపూర్‌ మండలంలో ఐదు రైతు వేదికల్లో నర్సాపూర్‌ పట్టణంలో మండల పరిషత్‌ కార్యాలయ సమీపంలో నిర్మించిన రైతు వేదిక మాత్రమే పూర్తి అయింది. మిగిలిన క్లస్టర్‌ కేంద్రాల్లో నిర్మాణ పనులు సాగుతూనే ఉన్నాయి. 


Updated Date - 2020-12-03T05:48:29+05:30 IST