కారు పార్కింగ్‌పై వివాదం

ABN , First Publish Date - 2021-07-23T05:45:14+05:30 IST

సోంపేట బజారు వీధిలో పార్కింగ్‌ చేసిన టీడీపీ నేత, మాజీ ఎంపీపీ చిత్రాడ శ్రీనివాసరావుకు చెందిన కారును అధికారులు గురువారం తొలగించారు.

కారు పార్కింగ్‌పై వివాదం
ఈవో వాణీకుమారితో మాట్లాడుతున్న ఎమ్మెల్యే అశోక్‌

 సోంపేట ఈవోని నిలదీసిన ఎమ్మెల్యే అశోక్‌

 అడ్డుతగిలిన అధికారపక్ష నేతలు 

సోంపేట: సోంపేట బజారు వీధిలో పార్కింగ్‌ చేసిన టీడీపీ నేత, మాజీ ఎంపీపీ చిత్రాడ శ్రీనివాసరావుకు చెందిన కారును అధికారులు గురువారం తొలగించారు. ఈ వ్యవహారం వాగ్వాదానికి దారితీసింది. కారు తొల గింపు విషయంపై ఈవో వాణీకుమారిబెహరాను ప్రశ్నించేం దుకు ఎమ్మెల్యే అశోక్‌ ఆమె కార్యాలయానికి వెళ్లారు. బజారు వీధిలోని రోడ్డును ఆర్‌అండ్‌బీకి అప్పగించారని, అక్కడ ఉన్న శ్రీనివాసరావు కారును తొలగించేటప్పుడు ఆయనకు నోటీసులు ఇచ్చారా? అని ఈవోను అడిగారు. కారు తొలగించే సమ యంలో పోలీసులు ఉన్నారా? పంచాయతీకి తొలగించే హక్కు ఎక్కడుందో తనకు చూపాలని ఎమ్మెల్యే ప్రశ్నించారు.  పంచాయతీకి చెందిన స్థలం కావడంతో కారును తొలగించినట్లు ఆమె చెప్పారు. ప్రజాప్రయోజనం కోసం ఇలా చేశామని ఈవో అనడంపై ఎమ్మెల్యే అశోక్‌ అసంతృప్తి వ్యక్తంచేశారు. ఇది ప్రజాప్రయోజనంగా లేదని, కక్షసాధింపు చర్యలా ఉందని ఆయన మండిపడ్డారు. ఇంతలో ఉపసర్పంచ్‌ మల్లా వెంకటరమణ, వార్డు సభ్యుడు మల్లా యుగంధర్‌, పట్టణానికి చెందిన తోట ఢిల్లీలు కలుగజేసుకొన్నారు.  గతంలో  పల్లివీధిలో 40 అడుగులు, గాంధీ మండపం వద్ద 30 అడుగుల మేర రోడ్డును విస్తరించారని, అప్పుడు కనీసం స్పందించని మీరు.. ఇప్పుడు శ్రీను కారు కోసం రావడం ఏమటని వారు ఎమ్మెల్యేను ప్రశ్నించారు. ఢిల్లీ అతిగా ప్రవర్తించడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఈవోతో మాట్లాడేందుకు వస్తే మీరేందుకు మధ్యలో కలుగజేసుకుంటున్నారని ఆయన అన్నారు. తాను పాలకవర్గ సభ్యుడునని ఢిల్లీ చెప్పడంతో.. సభ్యుడైతే పాలకవర్గ సమావేశంలో మాట్లాడాలి కానీ ఇక్కడ మాట్లాడే హక్కులేదని ఎమ్మెల్యే అన్నారు. ఇంతలో ఈవో కలుగజేసుకొని సర్దిచెప్పారు. అధికార పక్షం  దౌర్జన్యాలకు దిగుతోందని, ఇంత దౌర్జన్యం ఎక్కడా చూడలేదని, బయట వ్యక్తుల ప్రమేయం ఏమిటని ఎమ్మెల్యే ప్రశ్నించారు. శ్రీను కారు తొలగించే ముందు ఆయన ఇంటిముందు చెత్తవేయడం ఎంతవరకు సమంజసమన్నారు.  చెత్తవిషయంలో తప్పు జరిగిందని.. వెంటనే దాన్ని తొలగించినట్లు ఈవో తెలిపారు.  ఆర్‌అండ్‌బీకి రోడ్డు అప్పగించిన తర్వాత కక్షసాధించడం తగదన్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మాజీ  సభ్యుడు సూరాడ చంద్రమోహన్‌, టీడీపీ  మండలాధ్యక్షుడు మద్దిల నాగేశ్‌, నాయకులు చిత్రాడ శేఖర్‌, దూసి మదుసూధన్‌, గోవిందరెడ్డి, బెల్లాన శ్రీకాంత్‌  పాల్గొన్నారు. 


 

Updated Date - 2021-07-23T05:45:14+05:30 IST