బడిపంతుళ్లపై కరోనా మృత్యుపంజా

May 9 2021 @ 01:32AM

బాధితులైన 462మంది టీచర్లు,  185 మంది విద్యార్థులు


? కరోనాతో జిల్లాలో ఎంతమంది ప్రభుత్వ టీచర్లు చనిపోయారు.

! ఇంకా అప్‌డేట్‌ చేయలేదు. సమాచారం సేకరిస్తున్నాం.  

జిల్లా విద్యాశాఖాధికారుల సమాధానం ఇది. ఈ అత్యాధునిక సాంకేతిక కాలంలోనూ కరోనా విపత్తులో కన్నుమూస్తున్న తమ టీచర్ల సమాచారమే వారి వద్ద లేదు. లేదన్నది నిజమో..లేక నిజాన్ని దాయడమో తెలియడం లేదు. అందుకే ఆంధ్రజ్యోతి ఆ పనికి పూనుకున్నది. వాస్తవ సమాచారం సేకరించి నివేదిస్తోంది. ఇది బెదరగొట్టడానికి కాదు. అధికారులను ఇరుకున పెట్టడానికీ కాదు.కరోనా రెండో అల సృష్టిస్తున్న మారణహోమం తీవ్రత తెలిస్తే అయినా తగిన జాగ్రత్తలు తీసుకుంటారని. నిబంధనల పేరుతో అధికారులు టీచర్లను ఒత్తిడికి గురిచేయకుండా ఉంటారని. 

శ్రీకాళహస్తి, మే 8: ఆంధ్రజ్యోతి క్షేత్రస్థాయిలో సేకరించిన సమాచారం మేరకు కరోనా సోకిన టీచర్లలో 32 మంది జిల్లాలో ఇప్పటిదాకా మరణించారు.  వీరిలో 28 మంది కరోనా రెండో అలలోనే బలయ్యారు. ఏప్రిల్‌ నుంచే అత్యధిక మరణాలు సంభవించాయి. ఏప్రిల్‌ 20 నుంచీ కేవలం 16 రోజుల వ్యవధిలోనే 25 మంది టీచర్లు కన్నుమూశారు. బుధవారం ఒక్కరోజే జిల్లాలో ఐదుగురు టీచర్లు మృత్యువాత పడ్డారు.  సగటున రోజూ ఒక్క టీచరైనా కరోనాతో చనిపోతున్నారు. ఈ తీవ్రత పెరుగుతూనే ఉంది. ఉపాధ్యాయ వర్గాలను ఈ పరిణామాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. వారి కుటుంబాలు భయాందోళనల్లో కూరుకుపోయాయి. ఆస్పత్రుల్లో పడకలు దొరక్కపోవడం, ఆక్సిజన్‌ కొరత, ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యసేవలు సక్రమంగా అందకపోవడం వంటివి కుంగదీస్తున్నాయి. నిజానికి ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ జాబితాలో టీచర్లు లేరు. కానీ వందలాదిమంది వైరస్‌ బారిన పడుతున్నారు.వారంతా వృద్ధులు కారు. అయినా పదుల సంఖ్యలో మరణిస్తున్నారు.ఎందుకు? ప్రధాన కారణం ఎన్నికలు. వరుసగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు, తిరుపతి ఉప ఎన్నికల విధులకు హాజరైన టీచర్లలో ఎక్కువమంది కొవిడ్‌ బారిన పడ్డా రు. హైకోర్టు జోక్యం చేసుకోబట్టి సరిపోయింది కానీ, లేకపోతే బడులు, కాలేజీలు బలవంతంగా నడిపి పుండేవారని, అదే జరిగి ఉంటే పరిస్థితి మరింత భయానకంగా మారి ఉండేదని అంటున్నారు. ఇప్పటికీ పదోతరగతి పరీక్షలను రద్దు చేయడం గానీ, వాయిదా వేయడం మీద గానీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడం ఉపాధ్యాయ వర్గాలను కలవర పెడుతూనే ఉంది. అధికారిక లెక్కల ప్రకారమే జిల్లాలో ఇప్పటిదాకా 462 మంది ప్రభుత్వ టీచర్లు కొవిడ్‌ బారిన పడ్డారు. 185 మంది విద్యార్ధులకు వైరస్‌ సోకింది. అయినా మరణాల వివరాలను మాత్రం విద్యాశాఖ నమోదు చేయడం లేదు. ఆంధ్రజ్యోతి సేకరించిన సమాచారం ప్రకారం జిల్లాలో కరోనాతో మరణించిన టీచర్ల వివరాలు పైన ఇస్తున్నాం...

జిల్లాలో కొవిడ్‌తో మృతి చెందిన ఉపాధ్యాయుల వివరాలివీ...

పేరు                పని చేసే ప్రాంతం, మండలం              మృతి 

చెందిన తేదీ

1. వరప్రసాద్‌ (47) ఉప్పరపల్లె, తిరుపతి రూరల్‌ 16-9-20

2. కృష్ణవేణు(39) తిరుపతి రూరల్‌        19-10-20

3. దినేష్‌ (47) జీఎన్‌కండ్రిగ, బుచ్చినాయుడుకండ్రిగ 05-11-20

4.. టి.శివకుమార్‌(57) కేసీపల్లె, రామసముద్రం  29-11-20

5. మునిరత్నం (50) చిత్తూరు అర్బన్‌ 01-2-21

6. సీహెచ్‌ నాగమల్లు(58) రాగిమాకులపల్లె, రామసముద్రం      25-2-21

7. లోకనాథరాజు(50) మంగళం, తిరుపతి రూరల్‌        20-3-21

8. జయబాబు(52) దుర్గసముద్రం, తిరుపతి రూరల్‌      20-4-21

9. అజయ్‌కుమార్‌(57) పాదిరేడు, వడమాలపేట  20-4-21

10. శాంతకుమారి (59) అన్నాస్వామిపల్లె, రేణిగుంట 21-4-21

11. కోదండపాణి(52)  పి.కొత్తకోట, పూతలపట్టు 22-4-21

12. టి.యుగంధర్‌రెడ్డి(52) ఎంఎంసీ ఉన్నతపాఠశాల, తిరుపతి 23-4-21

13. ఎన్‌.సుభా్‌షచంద్రబో్‌స(55) పెరుమాళ్లపల్లె, తిరుపతి రూరల్‌      24-4-21

14. మురళీకృష్ణ(40) మేకలవారిపల్లె, వాల్మీకిపురం 27-4-21

15. సి.అనురాధ(57) మున్సిపల్‌స్కూల్‌, కొత్తపేట, శ్రీకాళహస్తి 28-4-21

16. సయ్యద్‌ముస్తాఫా హుసేన్‌(55) ఉర్దూస్కూల్‌, వాల్మీకిపురం 29-4-21

17. చంద్రశేఖరయ్య(50) గంగవరం    29-4-21

18. కుమారస్వామి నాయుడు(57) ఓబులశెట్టివారి పల్లె, పాకాల  29-4-21

19. నాగేంద్ర(52) భాపూజీ బాలభవన్‌, తిరుపతి 01-5-21

20. గుమ్మడి గంగాధరం(42) ఊరందూరు, శ్రీకాళహస్తి                   02-5-21

21. అబిద్‌ అలీ బండ్లపల్లె, పుంగనూరు    02-5-21

22. రమాఫ్రభ(49) బాలగంగనపల్లె, గంగాధరనెల్లూరు    03-5-21

23. ధనలక్ష్మి(46) ఎంపీపీ స్పెషల్‌ స్కూల్‌, వాల్మీకిపురం 04-5-21

24. మురళీమోహన్‌కృష్ణారెడ్డి(55) తంగేళ్ళపాళెం, తొట్టంబేడు 05-5-21

25. మనోహర్‌ (57) చంద్రగిరి    05-5-21

26. టి.శ్రీనివాసులు(50) జడ్పీహైస్కూల్‌, మదనపల్లె 05-5-21

27. ఆర్‌. సురేష్‌(50) బాలుర ఉన్నత పాఠశాల, శ్రీకాళహస్తి 05-5-21

28. మోహనయ్య(59) గోవిందాపురం, వి.కోట    05-5-21

29. బి.విజయకుమార్‌(41) పుల్లారెడ్డికండ్రిగ, శ్రీకాళహస్తి 07-5-21

30. వి.వెంకటనారాయణరెడ్డి(50) పడమటిపల్లె, కేవీపల్లె    07-5-21

31. కె.కృష్ణవేణి(35) ఓల్డ్‌పేట పాఠశాల, చంద్రగిరి 08-5-21

32. ఓ.శంకరయ్య(52) చెర్లోపల్లె, తిరుపతి రూరల్‌ 08-5-21
యువశ్రీ మురళి

ఎన్నికల విధులే కారణం


ఉపాధ్యాయులు ఎక్కువమంది కొవిడ్‌ బారిన పడి మృతి చెందడానికి కారణం ఎన్నికల విధులే. పంచాయతీ, మండల పరిషత్‌, పురపాలక, తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలకు వరుసగా విధులు కేటాయించడం వలన ఉపాధ్యాయులు, ఉద్యోగులు కొవిడ్‌ బారిన పడ్డారు. కొవిడ్‌తో మృతి చెందిన ఉద్యోగ, ఉపాధ్యాయ కుటుంబాల సభ్యులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగం ఇవ్వాలి. కొవిడ్‌ విధుల నుంచి ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలి.

- యువశ్రీ మురళి, ఎస్టీయూ నేత


గంటా మోహన్‌

ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా గుర్తించండి


ఉపాధ్యాయులను ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా గుర్తించాలి. కొవిడ్‌తో మృతి చెందిన ఉపాధ్యాయుల కుటుంబాలకు రూ.50లక్షల వంతున పరిహారం అందజేయాలి.వయస్సుతో నిమిత్తం లేకుండా ఉపాధ్యాయులందరికీ వ్యాక్సిన్‌ ఇవ్వాలి. మెడికల్‌ రీయింబర్స్‌మెంటు నిబంధనలు సడలించి... కొవిడ్‌ ఆస్పత్రుల్లో వైద్యానికి అయిన మొత్తం ఖర్చు చెల్లించాలి. అత్యవసరం అయితే తప్ప ఉపాధ్యాయులకు ఈ పరిస్థితుల్లో ఏ విధులూ అప్పగించకూడదు.

  - గంటా మోహన్‌, ఎస్టీయూ రాష్ట్ర నేత

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.