కల్యాణాలకు కరోనా గండం

ABN , First Publish Date - 2021-05-06T05:56:31+05:30 IST

వివాహ వేడుకలను కరోనా గండం వెంటాడుతోంది. రెండోదశ విజృంభణ కారణంగా కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో వివాహాల నిర్వహణపై సందిగ్ధం నెలకొంది.

కల్యాణాలకు కరోనా గండం

  • పెరుగుతున్న వైరస్‌ ఉధృతి
  • ప్రారంభమైన వివాహాల సందడి
  • మండపాలు, ఈవెంట్లకు అడ్వాన్స్‌ చెల్లింపు 
  • వేడుకల ఏర్పాట్లపై కరోనా ప్రభావం
  • చాలావరకు వాయిదా పడుతున్న పెళ్లిళ్లు
  • నిరాడంబరంగా నిర్వహణకు ఏర్పాట్లు 

 (ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : కరోనా మహమ్మారి వివాహాది శుభకార్యాలపై మరోసారి తీవ్ర ప్రభావం చూపుతోంది. 70 రోజుల పాటు శుక్రమూడమి కొనసాగి మే 1వ తేదీ నుంచి ముహూర్తాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ వేడుకలపై కరోనా ప్రభావం చూపుతోంది. ఇప్పటికే కల్యాణ మండపాలు, విందు వినోదాలతో పాటు అనేక ఈవెంట్ల నిర్వహణకు లక్షల్లో అడ్వాన్సులు చెల్లించినవారు ఇప్పుడు ఆగండి, కాస్త వేచి చూద్దాం అంటూ సందేశాలు ఇచ్చుకోవాల్సిన పరస్థితి ఏర్పడింది. సరిగ్గా గత ఏడాది మార్చి మూడో వారం నుంచి కరోనా ఎఫెక్ట్‌తో 6నెలలకు పైగా పెళ్లిళ్లకు బ్రేక్‌ పడింది. తర్వాత ముహుర్తాలు కూడా నామమాత్రంగానే ఉన్నాయి. 2021 జనవరి 3వవారం నుంచి శుక్రమూఢమి కారణంగా పెళ్లిళ్లు, శంకుస్థాపనలు, గృహప్రవేశాలకు ముహుర్తాలు లేవు. ఇప్పుడు వైశాఖ మాసంలో మే 1వ తేదీ నుంచి మంచి ముముర్తాలు ఉండటంతో ముందస్తుగానే వధూవరుల తల్లిదండ్రులు భారీగా ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు. ఉమ్మడి జిల్లాలోని కల్యాణ మండపాలు, ఫంక్షన్‌హాళ్లు, హోటళ్లతో పాటు టెంట్‌హౌ్‌సలు, పూలడెకరేషన్లు, వంటపనివారు, అనేకరకాల వారికి అడ్వాన్స్‌లు చెల్లించి ఖరారు చేసుకున్నారు. మే, జూన్‌ నెలలో పెద్ద సంఖ్యలో ముహూర్తాలు ఉండటంతో వేలాది పెళ్లిళ్లకు నిర్ణయాలు జరిగాయి. గతంలో కరోనా కారణంగా వాయిదా పడ్డ వివాహాలు సైతం ఈ ముహూర్తాల్లో ఘనంగా జరపాలని నిర్ణయంచుకున్నప్పటికీ కరోనా మహమ్మారి మళ్లీ వారికి ఇబ్బందిగా మారింది. 


  • పెళ్లిళ్లపై ఆధారపడిన వారికి గడ్డు పరిస్థితి


కరోనా ప్రభావంతో పెళ్లిళ్లు, శుభ ముహుర్తాలపై ఆధారపడిన కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయి. ఈసారి కూడా గతేడాది పరిస్థితే కనిపిస్తోంది. కరోనా విజృంభిస్తుండటంతో పెళ్లిళ్లు సాదాసీదాగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుండటంతో వాటిద్వారా ఉపాధి పొందే వంటవాళ్లు, డెకరేషన్‌, బాజాభజంత్రీలు, పనివాళ్లు, ఇలా అనేకమంది ఇబ్బంది పడక తప్పడం లేదు. దీంతో ఇప్పటికే అనేకమంది ఇతర పనుల్లోకి వెళ్తున్నారు. 


  • నిరాడంబరంగా నిర్వహణకు ఏర్పాట్లు  

కరోనా కారణంగా పంక్షన్‌ హాళ్లలో పెళ్లిళ్లు చేసేందుకు వెనుకంజ వేస్తున్నారు. రూ.లక్షలు పెట్టి పంక్షన్‌హాల్లో పెళ్లి చేయడం కంటే.. ఇంటిముందు పచ్చని పందిరి వేసి బంధుమిత్రుల మధ్య నిరాడంబరంగా  వివాహాలు జరిపేందుకు ఏర్పాటు చేస్తున్నారు. పెళ్లిళ్లకు బంధువులు కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో పాటు కరోనా ఎప్పుడు తగ్గుతుందో తెలియనందున సాదాసీదాగా పెళ్లి తంతును పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నారు. 


  • సాదాసీదాగానే వివాహం 

వికారాబాద్‌కు చెందిన యువతితో నా వివాహం చేసేందుకు ఈ నెల 9న పెద్దలు నిశ్చయించారు. ఎంతో ఘనంగా వివాహం చేసుకోవాలనుకున్నాను. ఇందుకోసం ఫంక్షన్‌హాల్‌ కూడా బుక్‌ చేశాం. అయితే, కొవిడ్‌ కారణంగా నిరాడంబరంగా వివాహం చేసుకుంటున్నాం. ముఖ్యమైన వారికి వాట్సా్‌పలో శుభలేఖలు పోస్టు చేశాను. కరోనా విజృంభిస్తుండడంతో డిన్నర్‌ను రద్దు చేసుకున్నాం.

- నిరంజన్‌గౌడ్‌, మొయినాబాద్‌ మండలం నక్కలపల్లి గ్రామం


  • అడ్వాన్సులు తిరిగి అడుగుతున్నారు

మేలో మంచి ముహుర్తాలు ఉండటంతో నాలుగు నెలల ముందుగానే ఫంక్షన్‌హాల్‌ బుక్‌ చేసుకున్నారు. కరోనాతో కొందరు పెళ్లిళ్లు వాయుదా వేసుకుంటున్నారు. వారిచ్చిన అడ్డాన్స్‌ డబ్బులు తిరిగి ఇవ్వమంటున్నారు. గత ఏడాది కూడా చాలా నష్టపోయాము. ఈసారి కూడా అదే పరిస్థితి నెలకొంది. కొవిడ్‌ నిబంధనల ప్రకారం వివాహాలు చేసుకోవాలని వధూవరుల పెద్దలకు ముందుగానే చెబుతున్నాము. 

- రజనీశ్రీనివాస్‌, ఫంక్షన్‌హాల్‌ యజమాని, శంకర్‌పల్లి 


  • మే, జూన్‌ నెలలో మంచి ముహూర్తాలు

మే, జూన్‌లలో మంచి ముహూర్తాలున్నాయి. మే నెలలో 6, 7, 9, 13, 14, 16, 17, 20, 21, 22, 23, 26, 28, 30 తేదిల్లో దివ్యమైన ముహూర్తాలున్నాయి. వేలాది వివాహాలు 13,14 తేదీల్లో ఉన్నాయి. వచ్చేనెల (జూన్‌)లో 2, 4, 5, 6, 13, 16, 18, 19,20, 23, 24 ,26, 27 తేదీల్లో ముహూర్తాలున్నాయి. జూలై 10 నుంచి ఆషాఢమాసం ప్రారంభమవుతుంది. ఆషాఢంలో వివాహాలు లేవు. కరోనాతో ధనవంతులు చాలావరకు పెళ్లిళ్లు వాయిదా వేసుకుంటున్నారు. 

- పురోహితుడు శ్రీపాదచార్యులు, చేవెళ్ల

Updated Date - 2021-05-06T05:56:31+05:30 IST