Advertisement

కరోనా దోపిడీ!

Apr 22 2021 @ 23:39PM

  • అనుమతులు లేకున్నా ట్రీట్‌మెంట్‌
  • అరకొర వసతులతో హరీమంటున్న ప్రాణాలు
  • వైద్య అధికారుల పర్యవేక్షణ కరువు


మేడ్చల్‌ : కరోనా వైరస్‌ తీవ్రంగా వ్యాపిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. ఇదే అదునుగా చూసుకొని ప్రైవేట్‌ ఆసుపత్రులు దోపిడీకి దిగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నా కరోనా వైద్యం కోసం ఇబ్బడిముబ్బడిగా డబ్బులు వసూలు చేస్తున్నాయి. కరోనా వైద్యం చేయడానికి అనుమతులు లేకున్నా గుట్టుచప్పుడు కాకుండా మేడ్చల్‌లోని ప్రయివేటు ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఒక రోజు ప్యాకేజీ చొప్పున రూ. 60 వేలు, బెడ్‌కు మాత్రమే అయితే రూ.35 వేలు, పరీక్షలకు, మందులకు అదనంగా వసూలు చేస్తున్నారు. జ్వరం, జలుబు వంటి లక్షణాలతో వచ్చే వారిని భయబ్రాంతులకు గురి చేస్తూ కరోనా పరీక్షలు నిర్వహిస్తూ జేబులు గుల్ల చేస్తున్నారు.

వారంరోజులుగా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో మేడ్చల్‌లోని ప్రయివేటు ఆసుపత్రుల వారు అనధికారికంగా కరోనా వైద్యం అందిస్తున్నారు. చిన్న ల్యాబ్‌ల నుంచి మెడికల్‌ షాప్‌ల వారు కూడా కరోనా వైద్యం పేరుతో దండుకుంటున్నారు. ల్యాబ్‌లో కరోనా పరీక్ష కోసం రూ.1300 వసూలు చేస్తున్నారు. కొంత మంది ప్రయివేటు ల్యాబ్‌ల్లో పరీక్షలు నిర్వహించుకుని మెడికల్‌ షాపులకు వెళ్లి మందులు తీసుకుని ఇంటి వద్దే హోం క్వారెంటైన్‌ ఉంటున్నారు. కాస్త ఇబ్బందిగా అనిపించగానే ప్రైవేట్‌ ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. ఇదే అదనుగా భావించి ప్రయివేటు ఆసుపత్రులవారు భారీగా డబ్బులు లాగుతున్నారు. కనీస వసతులు లేకుండా చికిత్స అందిస్తున్నారు. కేసు తీవ్రతను బట్టి పైసలు వసూలు చేస్తున్నారు.  వైద్య పరీక్షలకు కూడా బయట ల్యాబ్‌లకు తీసుకువెళ్తున్నారు. 2, 3 రోజులు తమ ఆసుపత్రుల్లో చికిత్సలు నిర్వహించి బాధితుడి ఆరోగ్యం క్రిటికల్‌గా మారితే నగరంలోని పెద్దాసుపత్రికి వెళ్లాలని తెలుపుతూ చేతులు దులిపేసుకుంటున్నారు. అప్పటికే కరోనా ముదిరి రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. 

కాగా కరోనాతో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు మండల సుబ్బారావు మేడ్చల్‌లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. దీంతో ప్రైవేట్‌ ఆస్పత్రుల వైద్యంపై ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటాం..

ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సను ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే అందించాలి. ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమకు ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటాం. అనుమతులు లేకుం డా చికిత్స అందిస్తే సీజ్‌ చేస్తాం. 

- మల్లిఖార్జునరావు, జిల్లా వైద్యాధికారి


అధికారులు పర్యవేక్షించాలి

     కరోనా చికిత్స కోసం ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేస్తున్న ప్రయివేటు ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రజల భయాందోళనలను ఆసరగా చేసుకుని  ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రయివేటు ఆసుపత్రుల దూకుడుకు కళ్లెం వేయాలి. 

- బాల్‌రెడ్డి, మేడ్చల్‌.


Follow Us on:
Advertisement