ltrScrptTheme3

కరోనాను కనుగొన్నది ఈమే!

Apr 21 2020 @ 11:30AM

ఆంధ్రజ్యోతి(21-04-2020)

కంటికి కనిపించకపోయినా ప్రపంచ మానవాళిని వణికిస్తోంది కరోనా జాతికి చెందిన కొత్త వైరస్‌ ‘కొవిడ్‌-19’. అయితే మనుషులకు సోకే కరోనా జాతి వైర్‌సను మొట్టమొదట కనుగొన్నది ఎవరో తెలుసా..? డాక్టర్‌ జూన్‌ అల్మీడా. 1964లో లండన్‌లోని సెయింట్‌ థామస్‌ హాస్పిటల్‌ లేబరేటరీలో ఆమె ఈ వైర్‌సను గుర్తించారు. 


పదహారేళ్ల వయసులోనే బడి మానేసిన అల్మీడా... స్కాట్లాండ్‌కు చెందిన బస్‌ డ్రైవర్‌ కూతురు. 1930లో పుట్టిన ఆమె గ్లాస్గోలో పెరిగారు. మధ్యలోనే బడి మానేయడంతో సాధారణ విద్య పెద్దగా అబ్బలేదు. కానీ ఆ తరువాత ‘గ్లాస్గో రాయల్‌ ఇన్‌ఫర్మరీ’లో హిస్టోపేథాలజీ ల్యాబ్‌ టెక్నీషియన్‌గా ఉద్యోగం తెచ్చుకున్నారు. కెరీర్‌లో భాగంగా లండన్‌కు మకాం మార్చారు. వెనిజులాకు చెందిన ఆర్టిస్ట్‌ ఎన్నకెస్‌ అల్మీడాను పెళ్లాడారు. అయితే కుమార్తె పుట్టిన తరువాత అల్మీడా కుటుంబం కెనడాలోని టొరొంటోకు మారింది. అక్కడి ‘ఒంటారియో కేన్సర్‌ ఇనిస్టిట్యూట్‌’లో ఎలక్ర్టాన్‌ మైక్రోస్కోప్‌ వినియోగంలో మంచి నైపుణ్యం సంపాదించారు. యాంటీబాడీలను ఉపయోగించి వైర్‌సలను మరింత పెద్దవిగా, మెరుగ్గా చూసే విధానాన్ని ఆమె అభివృద్ధి చేశారు. డాక్టరేట్‌ పొందారు. అల్మీడా ప్రతిభను గుర్తించిన బ్రిటన్‌... ఆమెను తిరిగి తమ దేశానికి రప్పించుకుంది. ఈ క్రమంలో అల్మీడా... లండన్‌లోని ‘సెయింట్‌ థామస్‌ హాస్పిటల్‌’ మెడికల్‌ స్కూల్‌లో విధులు నిర్వర్తించారు. ఇటీవల బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌కు ‘కొవిడ్‌-19’ సోకినప్పుడు చికిత్స అందించింది ఈ ఆసుపత్రిలోనే! 


డాక్టర్‌ డేవిడ్‌ టిరెల్‌తో కలిసి సాధారణ జలుబుకు కారకమయ్యే కొన్ని వైర్‌సలపై అధ్యయనం చేశారు అల్మీడా. ఇందు కోసం వలంటీర్ల నుంచి నమూనాలు సేకరించారు. వాటిల్లో ఒక విద్యార్థికి చెందిన ‘బీ814’ నమూనాలోని వైరస్‌ గురించి టిరెల్‌కు అంతుచిక్కలేదు. వీటిని పరిశీలించిన అల్మీడా... దీని లక్షణాలు ఇన్‌ఫ్లుయెన్జా వైరస్‌ తరహాలో ఉన్నాయని గుర్తించారు. అలా ఆమె గుర్తించిన వైర్‌సకే ‘కరోనా’ అని పేరు పెట్టారు. మానవులకు సోకిన మొట్టమొదటి కరోనా వైరస్‌ అదే! ఇటువంటి వైరస్‌ కణాలను ఎలుకల్లో హెపటైటిస్‌, కోళ్లలో బ్రోంకైటి్‌సలపై పరిశోధన చేస్తున్నప్పుడే అల్మీడా గమనించారు. జీ814 నమూనాలో కొత్తగా గుర్తించిన వైరస్‌ వివరాలను 1965లో బ్రిటీష్‌ మెడికల్‌ జర్నల్‌లో ప్రచురించారు. ఆ కరోనా జాతికి చెందినదే ఇప్పుడు కొత్త జన్యుక్రమంతో వచ్చి, ప్రపంచం అంతటినీ వణికిస్తున్న ‘నావెల్‌ కరోనా వైరస్‌’!

Follow Us on:

Health Latest newsమరిన్ని...

ప్రత్యేకంమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.