పరిషత్‌ ఎన్నికలు సమాప్తం

ABN , First Publish Date - 2021-11-19T08:18:29+05:30 IST

పెండింగులో వుండిన ఒక జడ్పీటీసీ, 8ఎంపీటీసీ స్థానాల్లో గురువారం కౌంటింగు ముగియడంతో పరిషత్‌ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యింది.

పరిషత్‌ ఎన్నికలు సమాప్తం
తిమ్మాపురం ఎంపీటీసీగా డిక్లరేషన్‌ అందుకుంటున్న టీడీపీ అభ్యర్థి గాలి రెడ్డిలక్ష్మమ్మ

8ఎంపీటీసీల్లో 5 చోట్ల వైసీపీ,3 చోట్ల టీడీపీ అభ్యర్థుల గెలుపు

బంగారుపాళ్యం జడ్పీటీసీ వైసీపీ కైవసం


చిత్తూరు, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): పెండింగులో వుండిన ఒక జడ్పీటీసీ, 8ఎంపీటీసీ స్థానాల్లో గురువారం కౌంటింగు ముగియడంతో పరిషత్‌ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యింది.తొలిదశలో అన్నిరకాల అస్త్రాలను ఉపయోగించిన వైసీపీ మలి విడత ఎన్నికల జోలికి పెద్దగా వెళ్లలేదు.ఎన్నికకు ముందే వీలైనన్ని స్థానాలను ఏకగ్రీవం చేసుకోగా.. మిగిలినవాటికి మంగళవారం పోలింగు జరిగింది. గురువారం ఓట్లను లెక్కించగా.. 3 ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ, 5 చోట్ల వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. గతంలో పరిషత్‌ ఎన్నికలు జరిగిన సమయంలో పలు కారణాలతో కొన్ని చోట్ల పోలింగ్‌ను నిర్వహించలేదు. ఇలాంటి స్థానాలను గుర్తించి ఎస్‌ఈసీ ఇటీవల నోటిఫికేషన్‌ విడుదల చేసింది.బంగారుపాళ్యం, కలకడ జడ్పీటీసీ స్థానాలతో పాటు 39 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు నిర్వహించారు. కలకడ, బంగారుపాళ్యం మండలాల్లో నామినేషన్‌ వేసిన టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించడంతో కలకడ వైసీపీకి ఏకగ్రీవమైంది. బంగారుపాళ్యంలో మాత్రం బీజేపీ, బీఎస్పీ అభ్యర్థులు బరిలో ఉండడంతో ఎన్నిక అనివార్యమైంది.ఇక్కడ టీడీపీ అభ్యర్థి గిరి నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. దీంతో ఇక్కడ వైసీపీ,బీజేపీ, బీఎస్పీ అభ్యర్థులు మాత్రమే పోటీ చేశారు.వైసీపీ అభ్యర్థి సోమశేఖర్‌ 15156 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అలాగే 39 ఎంపీటీసీ స్థానాలకుగానూ 2 చోట్ల నామినేషన్లు దాఖలు కాలేదు. 8 మినహా మిగిలినవన్నీ ఏకగ్రీవమాయ్యయి. ఏకగ్రీవం తర్వాత మిగిలిన బంగారుపాళ్యం జడ్పీటీసీ, 8 ఎంపీటీసీ స్థానాలకు మంగళవారం పోలింగ్‌ జరిగింది.ఈఓట్లను ఆయా మండల కేంద్రాల్లో గురువారం లెక్కించి ఫలితాలను విడుదల చేశారు. బంగారుపాళ్యం జడ్పీటీసీతో పాటు 5 ఎంపీటీసీ స్థానాలు వైసీపీ ఖాతాలో పడ్డాయి.3 చోట్ల టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు.


కుప్పంలో అసలైన విజయం

కుప్పం మండలంలోని దాసేగౌనూరు ఎంపీటీసీ సెగ్మెంట్‌ అత్యధిక మెజార్టీతో టీడీపీ ఖాతాలో పడింది. ఇక్కడ ఎంపీటీసీ ఎన్నికకు ముందు జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో వైసీపీ రకరకాల మాయోపాయాలతో గెలుపు సాధించిందన్న విమర్శలు మూటగట్టుకుంది. ప్రలోభాలు, అరాచకాలు జరగని ఎంపీటీసీ సెగ్మెంట్‌లో మాత్రం ప్రజలు టీడీపీ వైపు మొగ్గు చూపారు. ఇదే అసలైన విజయమని టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


మండలం ఎంపీటీసీ విజేత   పార్టీ మెజార్టీ

కుప్పం         దాసేగౌనూరు అముద   టీడీపీ 568

గుడిపాల వసంతాపురం విజయలక్ష్మి     టీడీపీ 15

కేవీపల్లె         తిమ్మాపురం      రెడ్డిలక్ష్మమ్మ   టీడీపీ 188

కేవీపల్లె     తీతవగుంటపల్లె సుబ్రమణ్యం వైసీపీ 320

గుడుపల్లె కనమనపల్లె వరలక్ష్మి     వైసీపీ 494

నగరి     నంబాకం గుణశేఖర్‌రెడ్డి వైసీపీ 63

ఎస్‌ఆర్‌పురం వీవీపురం ఆదిలక్ష్మి     వైసీపీ 268

శాంతిపురం 64 పెద్దూరు యువకుమార్‌ వైసీపీ 121


జడ్పీటీసీ ఫలితాలు

మండలం విజేత      పార్టీ  మెజార్టీ

బంగారుపాళ్యం      సోమశేఖర్‌ వైసీపీ      15156 


Updated Date - 2021-11-19T08:18:29+05:30 IST