భగీరథ పనులపై కౌన్సిలర్ల అసంతృప్తి

ABN , First Publish Date - 2022-07-01T05:49:06+05:30 IST

మిషన్‌ భగీరథ పనుల వల్ల కాలనీల్లో తిరగలేకపోతున్నామని కౌన్సిలర్లు అసహనం వ్యక్తం చేశారు.

భగీరథ పనులపై కౌన్సిలర్ల అసంతృప్తి

 ఇంకెన్నాళ్లు గుంతలు ఉంచుతారంటూ ప్రశ్నలు

వాడివేడిగా మున్సిపల్‌ సర్వసభ్య సమావేశం


మెదక్‌ మున్సిపాలిటి, జూన్‌ 30: మిషన్‌ భగీరథ పనుల వల్ల కాలనీల్లో తిరగలేకపోతున్నామని కౌన్సిలర్లు అసహనం వ్యక్తం చేశారు. గురువారం మున్సిపల్‌ చైర్మన్‌ తొడుపునూరి చంద్రపాల్‌ అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో సభ్యులంతా భగీరథ పనులపై మండిపడ్డారు. కౌన్సిలర్‌ రాజలింగ, శంసున్నీసాబేగం మాట్లాడుతూ ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో నీరు రావడం లేదని, ఇంజనీరింగ్‌ అధికారులకు సూచించినా పరిష్కారం లభించలేదన్నారు. కౌన్సిలర్‌ భీమరి కిషోర్‌ మాట్లాడుతూ తన వార్డుకు వెళ్లే దారిలో ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేయాలని కోరినా ఇంజనీరింగ్‌ అధికారులు స్పందించడం లేదన్నారు. గతంలో నీరు సరఫరా చేసిన నల్లా గుంతలను పూడ్చివేసి నీటి వృథాను అరికట్టాలని కౌన్సిలర్‌ చోళ మేఘమాల తెలిపారు. 9వ వార్డులో మాస్టర్‌ ప్లాన్‌ గుంతలు పూడ్చాలని కౌన్సిలర్‌ మేడి కళ్యాణి కోరారు. బస్టాండ్‌ వద్ద గల మున్సిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌ భవనాల పటిష్ఠతను నిర్దారించి వేలంపాట లీజుగడువు తేదీని నిర్ణయించాలని కౌన్సిలర్‌ వంజరి జయరాజ్‌ కోరారు. రాయిన్‌పల్లి కాలువలో, ఎంఎన్‌ కెనాల్‌లో మురుగునీరు వచ్చి చేరుతుందని కౌన్సిలర్లు సమియొద్దీన్‌, రాజలింగం చైర్మన్‌ దృష్టికి తీసుకొచ్చారు. నిర్మాణంలో ఉన్న బీఫ్‌ మార్కెట్‌ను జూలై 20వ తేదీ లోపు పూర్తిచేసి అందించాలని వైస్‌ చైర్మన్‌ మల్లికార్జున్‌గౌడ్‌ అధికారులను ఆదేశించారు. ఇంజనీరింగ్‌ అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయకపోవడం వల్ల నీటి పంపిణీ వ్యవస్థలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వైస్‌చైర్మన్‌ మల్లికార్జున్‌గౌడ్‌ మండిపడ్డారు. మూడు రోజులుగా మున్సిపల్‌ కార్యాలయంలోనే నీటి సరఫరా లేదంటే అధికారుల చిత్తశుద్ధి కనిపిస్తున్నారు. మిషన్‌ భగీరథ పైపులైన్ల తవ్వకాల వల్ల ఏర్పడిన గుంతలు పూడ్చడానికి రూ. పది లక్షలు కేటాయిస్తున్నట్లు మున్సిపల్‌ చైర్మన్‌ చంద్రపాల్‌ తెలిపారు. సమావేశంలో కమిషనర్‌ శ్రీహరి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-01T05:49:06+05:30 IST