సంక్షేమంలో సంక్షోభం

ABN , First Publish Date - 2021-01-13T06:49:11+05:30 IST

నవశకం పేరుతో ప్రభుత్వం పేదలను మోసం చేస్తోంది. నవశకంపై అధికారులకు అవగాహన లేకపోవడం లబ్ధిదారులకు శాపంగా మారుతోంది.

సంక్షేమంలో సంక్షోభం
4.96 ఎకరాల పొలం పాసుపుస్తకం, రేషన కార్డు

నవశకం పేరుతో సంక్షేమ పథకాలకు కత్తెర 

భూములు లేకపోయినా ఆనలైనలో చూపుతున్న వైనం 

అమ్మఒడి, రేషన, పింఛన కోల్పోతున్న పేదలు 

అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా కానరాని పరిష్కారం  

ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్న బాధితులు


కళ్యాణదుర్గం, జనవరి 12: నవశకం పేరుతో ప్రభుత్వం పేదలను మోసం చేస్తోంది. నవశకంపై అధికారులకు అవగాహన లేకపోవడం లబ్ధిదారులకు శాపంగా మారుతోంది. నిబంధనల పేరుతో రేషన, పింఛన, అమ్మఒడి పథకాల్లో భారీ కోత విధించారు. దీంతో నియోజకవర్గ వ్యాప్తంగా వేల మంది రైతులకు ప్రభుత్వ పథకాలు అందని ద్రాక్షలా మారాయి. రేషన కార్డుకు, భూములకు చిక్కుముడి వేశారు. రేషన కార్డులో ఉన్న కుటుంబ సభ్యులకు కలిసి 10 ఎకరాలకు పైబడి ఒక సెంటు భూమి ఉన్న రేషనకార్డు, పింఛనను తొలగించారు. అదేవిధంగా ఆ కుటుంబానికి అమ్మఒడి పథకం కూడా వర్తించకుండా చేశారు. ఈ ప్రక్రియ సామాజిక తనిఖీల ముసుగులో పకడ్బందీగా చేసి పేదల నోట్లో మట్టికొట్టారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. గత డిసెంబరు నెలలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో రేషన, పింఛన, అమ్మఒడి పథకాలకు వేలాది మంది లబ్ధిదారులు దూరమయ్యారు. కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలో 80896 రేషన కార్డులు ఉండగా ఇందులో 2600 అంత్యోదయ కార్డులున్నాయి.


కళ్యాణదుర్గం మండల పరిధిలో 28179 రేషన కార్డులకు గాను వివిధ నిబంధనల కారణంగా 2565 రేషన కార్డులను తొలగించారు. కంబదూరులో 12564కు గాను 1470, కుందుర్పి 13164కు గాను 1560, బ్రహ్మసముద్రం 13098కు గాను 1345, శెట్టూరు 13855కు గాను 1296 రేషన కార్డులను తొలగించినట్లు రెవెన్యూ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. గత డిసెంబరు నెలలో రేషన తీసుకునేందుకు వేలిముద్ర వేయబోగా ఆనలైనలో సంబంధిత లబ్ధిదారుల రేషన కార్డులను తొలగించినట్లు డీలర్లు వెనక్కుపంపారు. దీంతో వేలాది మంది లబ్ధిదారులు ప్రభుత్వ తీరుపై శాపనార్థాలు పె ట్టారు. 


వెబ్‌ల్యాండ్‌ మాయ

 వెబ్‌ల్యాండ్‌ మాయాజాలంతో పేదలు తీవ్రంగా నష్టపోవాల్సిన దుస్థితి నెలకొంది. భూమి కొంచం ఉంటే వెబ్‌ల్యాండ్‌లో బారుడు ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో పథకాలు అందక, రెవెన్యూ శాఖలో సమస్య పరిష్కారం కాక జిల్లా నుంచి గ్రామ సచివాలయాల వరకు ప్రదక్షిణలు చేస్తున్నా సమస్యకు పరిష్కారం దొరకటంలేదని పలువురు లబ్ధిదారులు వాపోతున్నారు. ఉదాహరణకు కళ్యాణదుర్గం మం డలం దొడఘట్ట గ్రామానికి చెందిన రైతు గోపాల్‌కు గోళ్ల రెవెన్యూ పొలంలో సర్వే నెంబరు 422-3లో 4.96 ఎకరాల భూమి ఉంది. కాని ఆనలైనలో మాత్రం 23 ఎకరాలు ఉ న్నట్లు చూపుతోంది. ఈకారణంగా ఆ కుటుంబానికి రేషన కార్డును తొలగించడంతో పాటు అమ్మ ఒడి నగదు కూడా పడలేదు. రెండేళ్లుగా అందరి అధికారుల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కాలేదు. ఈయన కుమారుడు రఘు ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. భూమి ఎక్కువగా ఉందనే నెపంతో అమ్మఒడి అందలేదు. అదేవిధంగా పట్టణానికి చెందిన వికలాంగుడైన రాఘవేంద్రకు 20 సెంట్లు మాత్రమే భూమి ఉంది. కాని ఆనలైనలో మాత్రం 22 ఎకరాలు ఉన్నట్లు కనిపిస్తోంది. ఈకారణంగా ఆయన కుటుంబానికి రేషన, పింఛన, అమ్మఒడి పథకాలకు దూరం చేశారు. రాజధాని సీఈఓ కార్యాలయంలో నవశకం వెబ్‌ల్యాండ్‌ను ఇనస్టాల్‌ చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహించడంతో కొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు రె వెన్యూ అధికారులు స్పష్టం చేస్తున్నారు. 


సరికొత్త నిబంధనలతో సంక్షేమంలో కోత 

 కుటుంబ వార్షిక ఆదాయం మున్సిపాలిటీ పరిధిలో రూ.75 వేలు, రూరల్‌ పరిధిలో రూ.65 వేలు ఉంటే వారికి ఇకపై రేషన, పింఛనకు అనర్హులుగా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోనుంది. ఇదే అంశం ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా వర్తిస్తుందనే నిబంధనలు ఉన్నాయి. కాగా కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉన్నా, కారు కలిగి ఉన్నా, ఐదు ఎకరాలకు పైబడి భూమి ఉన్నా, మిద్దె ఉన్నా, ఆదాయపు పన్ను చెల్లిస్తున్నట్లు ఆధార్‌తో అనుసంధానం ఉన్నట్లైతే ఇకపై సంక్షేమ పథకాలకు ఆకుటుంబాలు దూరం కానున్నాయి. అంతేగాక పింఛనదారులు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు వెచ్చించే వారికి, కరెంటు బిల్లు రూ.750 (300 యూనిట్లు) పైబడి చెల్లించే వారికి, సొంత ఇల్లు ఉన్నవారికి ఈ షరతులు వర్తించనున్నాయి. ఈ ప్రక్రియ తాజాగా ఈనెల ఒకటో తేదీ నుంచి  అమలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఇదివరకే మీసేవలో ఆప్షన్లను తొలగించారు. ప్రస్తుతం రేషనకార్డు పొందాలంటే 1902 టోల్‌ఫ్రీ నెంబరుకు ఫోన చేసి ఆధార్‌కార్డు నెంబరు తెలియజేయాల్సి ఉంది. టోల్‌ఫ్రీ కేంద్రం అధికారులు లబ్ధిదారుల ఆధార్‌కార్డును ప్రత్యేక పరిశీలన కౌంటర్‌కు సిఫార్సు చేయనున్నారు. లబ్ధిదారుడి ఆధార్‌కార్డు ఆరు అంచెలుగా పరిశీలించి అర్హతను గుర్తించనున్నారు. దీంతో ఇకపై దారిద్ర రేఖకు దిగువ ఉన్న లబ్ధిదారులకు సైతం పింఛన, రేషన అందడం కలగా మిగలనుంది. ఇదివరకే అంగనవాడీ, ఆశ, గ్రామ నౌకర్లకు సంబంధించిన రేషనకార్డులను ఆనలైనలో తొలగించిన విషయం విదితమే. దీంతో సామాన్య ప్రజలు లబోదిబోమంటున్నారు. 


అర్హతను కోల్పోనున్న చిన్న, సన్నకారు రైతులు 

ప్రభుత్వ నూతన విధానంతో చిన్న, సన్నకారు రైతులు సైతం పథకాలు పొందే అర్హతను కోల్పోనున్నారు. కళ్యాణదుర్గం ని యోజకవర్గ పరిధిలో 71,717 మంది రైతులు ఉన్నారు. వీరిలో సగానికి సగం ఐదు ఎకరాల పైబడి భూములున్న రైతులు ఉన్నారు. ప్రస్తుతం వీరందరికి బియ్యం కార్డులున్నాయి. ఫిబ్రవరి ఒకటి నుంచి సుమారు 25 వేల మందికి పైబడిన రైతులకు రేషనకార్డులు రద్దు కానున్నట్లు స్పష్టమవుతోంది. నియోజకవర్గవ్యాప్తంగా 35,374 మందికి పింఛన అందుతోంది. నిబంధనలు కఠినంగా అమలైతే వీటిలో కూడా సగానికి సగం పింఛన్లలో కోత పడనుంది.


సామాజిక తనిఖీ పేరుతో పింఛన, రేషన తొలగింపు  

 వైఎ్‌సఆర్‌ పింఛన కానుక పథకంలో భాగంగా ప్రభుత్వం సామాజిక తనిఖీ చేపట్టి పింఛన్లను తొలగించింది. నియోజకవర్గ పరిధిలో వేలాదిమంది లబ్ధిదారులకు వివిధ కారణాలతో పింఛన, రేషన కార్డులను రద్దు చేస్తున్నట్లు సామాజిక తనిఖీల సర్వే నివేదికలు బహిర్గతం చేశాయి. విషయం తెలుసుకున్న అనేక మంది లబ్ధిదారులు రెవెన్యూ, మండల పరిషత కార్యాలయాల వద్దకు పరుగులు తీస్తున్నారు. కుటుంబ యజమానుల పేర్లు, వయస్సు, విద్య, ఉద్యోగం, ఇల్లు, ఆస్తి, వాహనం ఉన్నట్లైతే ప్రభుత్వ పథకాలకు అర్హులు కారని తనిఖీ అంశాల్లో పొందుపరిచారు. ఉదాహరణకు గోళ్ల గ్రామ పంచాయతీ పరిధిలో బగిరప్పగారి తిప్పమ్మ రేషనకార్డులో ఇద్దరికి పింఛన వస్తుందని, పది ఎకరాల వ్యవసాయ భూమి ఉండడంతో పిం ఛన్లు తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. శీబావి గ్రామానికి చెందిన పెద్ద వెంకటప్పకు పది ఎకరాల మెట్ట, మూడు ఎకరాల మాగాణి ఉన్నట్లు, బోయ చిన్నప్ప, బోయ లక్ష్మన్న తదితరులకు సైతం ఇవే అంశాలను పొందుపరిచి పింఛన్లను తొలగిస్తు న్నట్లు గ్రామ సచివాలయాల్లో జాబితాను ప్రకటించారు. ఇదే తరహాలో గోళ్ల గ్రామ పంచాయతీ పరిధిలో సుమారు 184 మందికి కారణాలు పొందుపరిచి పింఛన్ల తొలగింపునకు సర్వం సిద్ధం చేశారు. ఒక్కో గ్రామ పంచాయతీలో సుమారు 75 నుంచి 125 వరకు పింఛన్లు తొలగిస్తే నియోజకవర్గవ్యాప్తంగా 8,500 మంది లబ్ధిదారులకు సంబంధించిన పింఛన్లు తొలగిస్తున్నట్లు అధికారవర్గాల ద్వారా తెలిసింది. 25వేల మంది లబ్ధిదారులకు చెందిన రేషనకార్డులు కూడా తొలగించారు. దీంతో పింఛన్లు, రేషన కార్డులు కోల్పోయిన వారు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు.



సమస్యను పరిష్కరించే నాథులే లేరు

- వరలక్షి, దొడగట్ట, కళ్యాణదుర్గం మండలం


మా కుటుంబానికి ఐదెకరాల పొలం ఉంది. ఆనలైనలో 23 ఎకరాలు భూమి ఉన్నట్లు చూపిస్తోంది. దీంతో రెండేళ్లుగా రేషన బియ్యం, అమ్మఒడి అందడం లేదు. సమస్య పరిష్కరించాలని తహసీల్దార్‌ నుంచి  కలెక్టర్‌ వరకు ప్రాధేయపడినా పట్టించుకోలేదు. దీంతో ప్రతి ఏటా సంక్షేమ పథకాలకు దూరమవుతున్నాం. 


Updated Date - 2021-01-13T06:49:11+05:30 IST