ఎటుచూసినా కిటకిట!

ABN , First Publish Date - 2021-01-13T06:28:23+05:30 IST

ఓవైపు అమ్మఒడి పథకం కింద లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమవుతున్న వేళ... మరోవైపు ముంగిటకొస్తున్న సంక్రాంతి పండుగ కళ.... ఇంకోవైపు యువజనోత్సవాల హేల... వెరసి మంగళవారం జిల్లావ్యాప్తంగా పలు ప్రదేశాలు జనంతో కిటకిటలాడాయి.

ఎటుచూసినా కిటకిట!
తిరుపతి శిల్పారామంలో భోగిమంటలు




బస్‌స్టేషన్లు, బ్యాంకులు, బజార్లలో రద్దీ


తిరుపతి, జనవరి 12 (ఆంధ్రజ్యోతి):  ఓవైపు అమ్మఒడి పథకం కింద లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమవుతున్న వేళ... మరోవైపు ముంగిటకొస్తున్న సంక్రాంతి పండుగ కళ.... ఇంకోవైపు యువజనోత్సవాల హేల... వెరసి మంగళవారం జిల్లావ్యాప్తంగా పలు ప్రదేశాలు జనంతో కిటకిటలాడాయి. బ్యాంకుల వద్ద అమ్మఒడి నగదు కోసం మహిళలు బారులు తీరగా సంక్రాంతికి స్వస్థలాలకు వెళ్ళే జనంతో బస్‌స్టేషన్లు రద్దీగా కనిపించాయి. ఇక బట్టల దుకాణాలు, సంక్రాంతి సంబంధ సరంజామా విక్రయించే దుకాణాలున్న బజార్లు సైతం జన సమ్మర్ధంగా మారాయి. ఇక వివేకానందుడి జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన యువజనోత్సవాలతో పలు విద్యాసంస్థలు, ఇతర సంస్థల ప్రాంగణాలు యువజనంతో కళకళలాడాయి.


జిల్లాలోని 3,51,330మంది మహిళలకు అమ్మఒడి పఽథకం కింద రూ.491.86కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో నగదు తమ ఖాతాల్లో జమయిందా లేదా తెలుసుకునేందుకు, అవసరం వున్నవారు విత్‌ డ్రా చేసుకునేందుకు మంగళవారం బ్యాంకుల ముందు క్యూ కట్టారు. జిల్లావ్యాప్తంగా దాదాపు ప్రతి బ్యాంకు శాఖ ఎదుటా మహిళలు గుమిగూడి వుండడం కనిపించింది.సంక్రాంతి పండుగ కోసం ఎక్కడెక్కడి వారూ స్వస్థలాలకు వెళుతుండడంతో  ప్రధాన బస్‌ స్టేషన్లన్నీ  రద్దీగా కన్పించాయి. ఇతర రాష్ట్రాల నుంచీ, జిల్లాల నుంచీ వచ్చేవారే కాకుండా ఉద్యోగ, వ్యాపార అవసరాల రీత్యా జిల్లాలోనే ఇతర చోట్ల నివాసముంటున్న వారు కూడా పండుగ సందర్భంగా స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ప్రధానంగా తిరుపతి ఆర్టీసీ బస్‌స్టేషన్‌లో పండుగ రద్దీ కొట్టొచ్చినట్టు కనిపించింది.చిత్తూరు, మదనపల్లె, శ్రీకాళహస్తి, పుత్తూరు, నగరి, పలమనేరు, పుంగనూరు, కుప్పం, పీలేరు వంటి ప్రధాన పట్టణాలలోని బస్‌ స్టేషన్లతో పాటు కలికిరి, వాల్మీకిపురం, సత్యవేడు, బి.కొత్తకోట, వి.కోట, చంద్రగిరి వంటి చిన్నస్థాయి పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి. ఇంటిల్లిపాదితో సొంతవూళ్ళకు బయల్దేరిన ప్రయాణికులతో బస్‌స్టేషన్లు కోలాహలంగా మారాయి.


తెలుగు వారి సంస్కృతిలో ప్రధాన పండుగ కావడంతో సంక్రాంతి సందర్భంగా జనం కొనుగోళ్ళతో తిరుపతి, చిత్తూరు వంటి నగరాలు, ఇతర మున్సిపల్‌ పట్టణాలే కాకుండా చివరికి సాధారణ మండల కేంద్రాల్లో కూడా బజార్లన్నీ జన సమ్మర్ధంగా మారాయి. ముఖ్యంగా బట్టల దుకాణాలలో సాధారణ రోజులకు భిన్నంగా పండుగ రద్దీ స్పష్టంగా కనిపించింది. మరోవైపు ఇళ్ళ ముంగిట వేసే సంక్రాంతి ముగ్గుల కోసం రంగులు కొనేందుకు సంబంధిత షాపుల వద్ద మహిళలు, యువతులు ఎక్కువగా కనిపించారు. అలాగే పాడి పశువులు కలిగిఉన్న రైతు కుటుంబాలు పశువులకు అవసరమైన సామగ్రి కొనుగోలు చేయడం కూడా అగుపించింది. దీంతో వస్త్ర దుకాణాలు, సంక్రాంతి సంబంధిత సరంజామా విక్రయించే దుకాణాలున్న బజార్లు, వీధులు జనంతో నిండిపోయాయి.తిరుపతి శివార్లలోని శిల్పారామంలో మంగళవారం ముందస్తు భోగి మంటలు నిర్వహించగా పుంగనూరులో ముగ్గుల పోటీలు, వంటల పోటీలు జరిపారు. ఇక శ్రీకాళహస్తిలో ఏకంగా ముక్కంటి దేవస్థానమే స్వయంగా బుధవారం సంక్రాంతి సంబరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.  పలుచోట్ల ఈ తరహా పోటీలను సోమ, మంగళవారాల్లోనే నిర్వహించడంతో జిల్లాలో ముందస్తుగానే సంక్రాంతి సంబరం నెలకొంది.






Updated Date - 2021-01-13T06:28:23+05:30 IST