కూలీలపై.. కర్ఫ్యూ కాటు!

May 8 2021 @ 23:05PM

పనుల్లేక ఆర్థిక ఇబ్బందులు

 ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూపులు

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

కర్ఫ్యూ.. పేదల బతుకులను ఛిన్నాభిన్నం చేస్తోంది. గత ఏడాది ఆర్థికంగా నష్టపోయిన దినసరి కూలీల పరిస్థితి ఇప్పుడు మరింత దయనీయంగా మారుతోంది. కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వం 14 రోజుల పాటు కర్ఫ్యూ అమలుకు ఈ నెల 5న శ్రీకారం చుట్టింది. ప్రతిరోజూ మధ్యాహ్నం 12 నుంచి ఉదయం 6 గంటల వరకూ పకడ్బందీగా కర్ఫ్యూ అమలు చేయాలని ఆదేశించింది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు వ్యాపార లావాదేవీలకు అవకాశం కల్పించింది. కర్ఫ్యూ కారణంగా వేతనదారులు, దినసరి కూలీలకు పనులు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఆరు గంటల సమయంలో పనులు కల్పించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో కూలీలతో పాటు.. ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు చేరుకున్న లక్షలాది మంది వలసజీవులకు ఉపాధి కరువవుతోంది. ప్రభుత్వ శాఖలు, అత్యవసర విభాగాలైన తాగునీటి సరఫరా, పారిశుధ్య సిబ్బంది, వైద్య శాఖ ఉద్యోగులకు మాత్రమే కర్ఫ్యూ సమయంలో బయట పనులపై తిరిగేందుకు అవకాశం కల్పించింది. ఇక భవన నిర్మాణ పనులు, వివిధ రకాల చేతివృత్తులతో పాటు దుకాణాల్లో పని చేసే వారికి, చిన్న హోటళ్ల నిర్వాహకులు, పండ్ల వ్యాపారులు, దినసరి కూలీలకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే అనుమతి ఇచ్చింది. తాము ఉదయాన్నే 6 గంటలకు ఎలాగోలా పనులకు  వెళ్లినా.. మధ్యాహ్నం 12 గంటలకు ఇంటికి చేరుకోవడం కష్టమేనని దినసరి కూలీలు ఆవేదన చెందుతున్నారు. ఏ రోజు పనికి వెళితే.. ఆరోజే తమకు పూట గడుస్తుందని, లేకపోతే పస్తులు తప్పవని వాపోతున్నారు. కొంతమంది యజమానులు.. కర్ఫ్యూ పూర్తయ్యే వరకూ పనికిరావద్దని చెప్పడంతో.. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలాచోట్ల ఉపాధిహామీ పథకం పనులు కూడా నిలిచిపోవడంతో బతుకు భారమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది లాక్‌డౌన్‌ సమయంలో ప్రభుత్వం రేషన్‌కార్డుదారులకు నిత్యావసర సరుకులు రెండునెలల పాటు ఉచితంగా పంపిణీ చేసింది. ప్రతి పేద కుటుంబానికి ఆర్థికసాయంగా రూ.1000 చొప్పున బ్యాంకు ఖాతాలకు జమ చేసింది. ప్రస్తుతం ఆ దిశగా చర్యలు చేపట్టకుండా కర్ఫ్యూ అమలు చేస్తోంది. కర్ఫ్యూ కాలంలో దినసరి కూలీలకు కనీస భత్యం అందించేలా ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. 

  

ఉపాధి కరువైంది  

కొత్తూరు : మట్టి పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం ఎవరూ నిర్మాణాలు చేపట్టకపోవడంతో ఇళ్లకే పరిమితమయ్యాం. పనులు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. కనీసం మందులు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేక సతమతమవుతున్నాం. 

- తొగరాన లక్ష్మణరావు, వేతనదారుడు, గూనభ్రద, కొత్తూరు మండలం  


పూట గడవడం కష్టం

మెళియాపుట్టి : టెక్కలి, మెళియాపుట్టి ప్రాంతాల్లో భవన నిర్మాణ పనులకు వెళ్లేవాళ్లం. కర్ఫ్యూ కారణంగా పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం పూట గడవడం కష్టమవుతోంది. ఒకవేళ  పనులు కుదిరినా.. రవాణా కష్టాలు వెంటాడుతున్నాయి. 

- నెయ్యిల కృష్ణారావు, జంతూరు, మెళియాపుట్టి  


పనులు కొనసాగించాలి

గుజరాతీపేట : కరోనా కారణంగా ఉపాధి హామీ పనులను నిలుపుదల చేస్తే పేద రైతులు, రైతు కూలీలు ఆకలి చావులకు గురయ్యే ప్రమాదం పొంచి ఉంది. పని ప్రదేశాల్లో కఠిన నిబంధనలు అమలు చేసి ఉపాధి పనులను కొనసాగించాలి. వేతనదారులకు కనీసం 200 పని దినాలు కల్పించి రోజుకు రూ.600 చొప్పున చెల్లించాలి. కరోనా సమయంలో ప్రతి కూలీకి పది కిలోల బియ్యం, నెలకు రూ.7,500 ఆర్థిక సాయం అందించాలి.

 -గంగారపు సింహాచలం, జిల్లా ప్రధాన కార్యదర్శి, వ్యవసాయ కార్మిక సంఘం, శ్రీకాకుళం  


 తినడానికి తిండి లేదు..

రణస్థలం : రణస్థంలోని ఒక హోటల్‌లో పని చేసేదాన్ని.  రోజుకు రూ.200 ఇచ్చేవారు. కరోనా కారణంగా కర్ఫ్యూ విధించడంతో హోటల్‌ మూసేశారు. గత వారం రోజులుగా పనిలేదు.  తినడానికి తిండి కరువై బతుకు భారంగా మారింది. మాలాంటివారిని ప్రభుత్వం ఆదుకోవాలి. 

 -కె.రామలక్ష్మి, జేఆర్‌ పురం, రణస్థలం 


ఉపాధి కోల్పోయాం...

ఆమదాలవలస : విశాఖలో ఉండే నేను గత ఏడాది కరోనా ప్రభావంతో ఉపాధి కోల్పోయి గ్రామానికి వచ్చేశాను. గ్రామంలో సాయంత్రం పూట ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ నిర్వహిస్తూ ఉపాధి పొందేవాడిని. ప్రస్తుతం కర్ఫ్యూ అమలు చేయడంతో మళ్లీ ఉపాధికి దూరమయ్యాను. 

- పి.దత్తారావు, కొత్తవలస, ఆమదాలవలస మండలం 


వ్యాపారం సాగడం లేదు...

ఇచ్ఛాపురం : కరోనా వ్యాప్తి కారణంగా వ్యాపారం సాగడం లేదు. దీంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. దీనికితోడు ఇప్పుడు ప్రభుత్వం కర్ఫ్యూ విధించడంతో మరిన్ని కష్టాలు ఎదురవుతున్నాయి. అప్పులు చేసుకొని జీవనాన్ని కొనసాగిసున్నాం. 

- సింహాద్రి సాహు, పండ్ల వ్యాపారి, ఇచ్ఛాపురం 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.