అందని యంత్రం.. సాగని సేద్యం!

ABN , First Publish Date - 2021-05-15T04:10:46+05:30 IST

రైతుభరోసా కేంద్రాల్లో కస్టమర్‌ హైర్‌ కేంద్రాల(సీహెచ్‌సీ) ఏర్పాటు ముందుకు సాగడం లేదు. రైతులకు రాయితీపై యాంత్రీకరణ పరికరాలు అందడం లేదు. సాగు పెట్టుబడి తగ్గించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రైతులకు రాయితీపై యంత్ర పరికరాలు అందజేయాలని నిర్ణయించింది. రైతుభరోసా కేంద్రాల్లో కస్టమర్‌ హైర్‌ కేంద్రాలు(సీహెచ్‌సీ) ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. రైతు సంఘాలకు రాయితీపై రూ.15 లక్షల లువ చేసే యంత్రాలు మంజూరు చేసి.. వాటిని స్థానిక రైతులకు అద్దెకు ఇస్తే.. సాగు భారం తగ్గుతుందని భావించింది.

అందని యంత్రం.. సాగని సేద్యం!
ట్రాక్టర్‌తో దుక్కి చేస్తున్న దృశ్యం


- ప్రతిపాదనలకే పరిమితమైన కస్టమర్‌ హైర్‌ కేంద్రాలు

- రైతు గ్రూపులకు చేరని పరికరాలు

(మెళియాపుట్టి/ఇచ్ఛాపురం రూరల్‌) 

రైతుభరోసా కేంద్రాల్లో కస్టమర్‌ హైర్‌ కేంద్రాల(సీహెచ్‌సీ) ఏర్పాటు ముందుకు సాగడం లేదు. రైతులకు రాయితీపై యాంత్రీకరణ పరికరాలు అందడం లేదు. సాగు పెట్టుబడి తగ్గించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రైతులకు రాయితీపై యంత్ర పరికరాలు అందజేయాలని నిర్ణయించింది. రైతుభరోసా కేంద్రాల్లో కస్టమర్‌ హైర్‌ కేంద్రాలు(సీహెచ్‌సీ) ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. రైతు సంఘాలకు రాయితీపై రూ.15 లక్షల లువ చేసే యంత్రాలు మంజూరు చేసి.. వాటిని స్థానిక రైతులకు అద్దెకు ఇస్తే.. సాగు భారం తగ్గుతుందని భావించింది. కానీ ఈ ప్రక్రియ రెండేళ్లుగా ప్రతిపాదనలకే పరిమితమవుతోంది. జిల్లాలో 820 రైతు భరోసా కేంద్రాల ద్వారా 808 రైతు సంఘాలను అధికారులు గుర్తించారు. అందులో 790  రైతు  గ్రూపులకు కస్టమ్‌ హైర్‌ సెంటర్లు మంజూరు చేశారు. ఒక్కో గ్రూపునకు రూ.15లక్షల విలువైన పరికరాలు అప్పగించేలా ప్రణాళికలకు రూపకల్పన చేశారు. ఇందుకు రైతు గ్రూపులు 10 శాతం భాగస్వామ్యం చెల్లిస్తే రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా 50 శాతం రుణం సమకూరుస్తుంది. మిగిలిన 40 శాతం ప్రభుత్వం రాయితీగా అందిస్తుంది. ఈ లెక్కన రూ.లక్షన్నర వరకు సభ్యులు పెట్టుబడిగా అందించాలి. 50 శాతం రుణం జిల్లాలో డీసీసీబీ ద్వారా రైతులకు ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. బ్యాంకులో రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ కూడా పూర్తయింది. సంఘాలకు అవసరమైన రుణాలను అందజేసేందుకు ప్రభుత్వం నాబార్డుతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. కానీ, 10 శాతం వాటా ఏ గ్రూపు కూడా చెల్లించలేదు. దీంతో యంత్రాలు అందని పరిస్థితి నెలకొంది. 


 ముందుకురాని కంపెనీలు 

రైతులకు కావాల్సిన యంత్రాలను సంబంధిత కంపెనీలు సరఫరా చేసేందుకు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా ట్రాక్టర్లు సరఫరా చేయలేమని చెబుతున్నట్లు సమాచారం. వ్యవసాయ పనుల్లో వీటి పాత్ర కీలకం. వీటికే డిమాండ్‌ ఎక్కువగా ఉంది. ఇదిలా ఉండగా ఖరీఫ్‌ ప్రారంభం నుంచే వ్యవసాయ శాఖ రైతులకు రాయితీపై యంత్ర పరికరాలను అందించాలి. 2019 నుంచి ఇవ్వలేదు. 2020లో దరఖాస్తు చేసుకున్న వారికి లేదు. ఇప్పటికే రెండు ఖరీఫ్‌ సీజన్లు, రెండు రబీ సీజన్‌లు యంత్రాలు లేకుండానే గడిచిపోయాయి. ప్రస్తుతం మూడో ఏటా ఖరీఫ్‌ కాలం త్వరలో ప్రారంభం కానుంది. నేటికీ రాయితీ అద్దె యంత్రాల పథకం జాడే లేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఖరీఫ్‌ నాటికి కూడా యంత్రాలు అందే అవకాశం లేదని రైతులు వాపోతున్నారు. తమకు అవసరమైన యంత్రాలు మంజూరు చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. 


అనుమతి వచ్చిన తరువాతే.. 

రాయితీ పరికరాలు అందజేసేందుకు కసరత్తు ప్రారంభించాం. ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన తరువాత సీహెచ్‌సీలు ఏర్పాటు చేసి 10 శాతం వాటా నగదు చెల్లిస్తాం. కంపెనీల ధరలు పరిశీలించి ప్రభుత్వం ఖరారు చేస్తుంది. యంత్ర పరికరాలకు సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. 

- కె.శ్రీధర్‌, వ్యవసాయ శాఖ జేడీ.


ఆన్‌లైన్‌లో నమోదు చేశాం 

ఈ ఏడాది ఖరిఫ్‌ నాటికి యంత్రాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే గ్రూపులకు సంబంధించిన జాబితా ఆన్‌లైన్‌లో పొందుపరిచాం. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే పరికరాలు అందజేసేందుకు చర్యలు చేపడతాం. 

- దానకర్ణుడు, మండల వ్యవసాయాధికారి, మెళియాపుట్టి



Updated Date - 2021-05-15T04:10:46+05:30 IST