కరోనా మృతులనూ వదలని సైబర్‌ నేరగాళ్లు

ABN , First Publish Date - 2022-09-24T05:07:23+05:30 IST

సైబర్‌ మోస గాళ్లు కొత్త ఎత్తుగడలతో జనాన్ని మోసం చేస్తున్నారు. తాజాగా ఉన్నతాధికారుల పేరుతో కొత్త తరహాలో మోసం చేశారు. గుర్తు తెలియని ఆగంతుకుడు రుద్రంపేటలోని సచివాలయం-2లో పనిచేస్తున్న ఏఎనఎం, వలంటీర్‌లకు ఇటీవల ఫోన చేశాడు.

కరోనా మృతులనూ వదలని సైబర్‌ నేరగాళ్లు

బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్న వైనం

అనంతపురం క్రైం,సెప్టెంబరు 23: సైబర్‌ మోస గాళ్లు కొత్త ఎత్తుగడలతో జనాన్ని మోసం చేస్తున్నారు. తాజాగా ఉన్నతాధికారుల పేరుతో కొత్త తరహాలో మోసం చేశారు. గుర్తు తెలియని ఆగంతుకుడు రుద్రంపేటలోని సచివాలయం-2లో పనిచేస్తున్న ఏఎనఎం, వలంటీర్‌లకు ఇటీవల ఫోన చేశాడు. తాను కలెక్టర్‌ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నానని పరిచయం చేసుకున్నాడు. కరోనాతో చనిపోయిన బాధిత కుటుంబసభ్యులకు అందించే పరి హారం విషయంలో ఫోన చేశానని, వారి వివరాలు, ఫోన నెంబర్లు ఇవ్వాలని కోరాడు. అది నిజమని భావించిన ఆ ఏఎనఎం, వలంటీర్‌ ఆ ఆగంతుకుడు అడిగిన సమాచా రం ఇచ్చారు. ఇదే విషయం బాధిత కుటుంబసభ్యులకు తెలిపి కలెక్టరేట్‌ నుంచి ఫోన చేస్తే అడిగిన వివరాలు  చెప్పండి అని చెప్పాడు. అది వారు నిజమని నమ్మారు.  సచివాలయ సిబ్బంది చెప్పినట్లే పామిడి ఓబుళమ్మ మనవరాలు భారతికి ఫోన కాల్‌ వచ్చింది. ఆమె అవతలి వ్యక్తి అడిగిన వివరాలు అందించారు. కాసేపటికి ఆమె బ్యాంక్‌ ఖాతాలోని రూ.58వేలు మాయం అయ్యాయి. అలాగే కరోనాతో మృతి చెందిన లక్ష్మీనరసమ్మ కుమారుడు మాధవ్‌ ఖాతాలో రూ.46వేలు కాజేశారు. ఇదంతా సైబర్‌ నేరస్థుడి పనిగా పోలీసులు తేల్చారు. 

జాగ్రత్తగా ఉండండి: ఎస్పీ

సైబర్‌ నేరగాళ్లు మానవత్వం లేకుండా మోసాలకు పాల్పడుతున్నారని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. కరోనాతో చనిపోయిన కుటుంబాలను సైతం టార్గెట్‌ చేస్తున్నార న్నారు. పరిహారం పేరు చెప్పి అకౌంట్‌లోని మొత్తం ఖాళీ చేస్తున్నారన్నారు. ఇలాంటి ఫోన కాల్స్‌ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తెలియని వ్యక్తులకు వ్యక్తిగత విషయాలను చెప్పొద్దని తెలిపారు. 


Updated Date - 2022-09-24T05:07:23+05:30 IST