పది రోజుల పాటు ఆసరా నిధుల జమ

ABN , First Publish Date - 2021-10-01T04:53:24+05:30 IST

సక్రమంగా రుణాలు చెల్లించే డ్వాక్రా సంఘాల అప్పును ఆసరా పేరుతో ప్రభుత్వం నాలుగు విడతల్లో మాఫీ చేస్తోంది. గతేడాది ఆయా డ్వాక్రా గ్రూపుల ఖాతాల్లో ఒకేరోజు తొలి విడత మాఫీ సొమ్ములు జమ చేయగా.. ఈసారి భిన్నంగా ప్రచార ప్రణాళిక రూపొందించారు.

పది రోజుల పాటు ఆసరా నిధుల జమ

ఈసారి ప్రచారానికి ప్రాధాన్యం

అక్టోబరు 8 నుంచి గ్రామాల్లో ఎమ్మెల్యేల పర్యటన

రెండో విడతలో 60,440 డ్వాక్రా గ్రూపులకు లబ్ధి


చిత్తూరు, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): సక్రమంగా రుణాలు చెల్లించే డ్వాక్రా సంఘాల అప్పును ఆసరా పేరుతో ప్రభుత్వం నాలుగు విడతల్లో మాఫీ చేస్తోంది. గతేడాది ఆయా డ్వాక్రా గ్రూపుల ఖాతాల్లో ఒకేరోజు తొలి విడత మాఫీ సొమ్ములు జమ చేయగా.. ఈసారి భిన్నంగా ప్రచార ప్రణాళిక రూపొందించారు. జిల్లాలో ఆసరా పథకం కింద డ్వాక్రా సంఘాలకు రెండో విడత రుణమాఫీ అమలుకు లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. 2019, ఏప్రిల్‌ 11 నాటికి బ్యాంకు అప్పు తీసుకుని క్రమం తప్పకుండా తిరిగి చెల్లిస్తున్న గ్రూపులకు ఆ రోజునాటికి అప్పు ఎంత నిల్వ ఉందో, ఆ మొత్తాన్ని నాలుగు విడతలుగా డ్వాక్రా సంఘాలకు చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2020-21 సంవత్సరంలో తొలి విడత రుణమాఫీగా 60,153 సంఘాలకు రూ.578 కోట్లను అందించారు. గ్రూపుల బ్యాంకు ఖాతాలకు ఈ సొమ్ము జమ చేయగా.. సభ్యులు వీటిని పంచుకున్నారు. తాజాగా ఈ ఏడాది రెండో విడత కింద 60,440 డ్వాక్రా గ్రూపులకు రూ.582 కోట్లను పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈసారి సొమ్మును సభ్యుల వ్యక్తిగత ఖాతాలకు జమ చేస్తున్నారు. 240 సంఘాలకు రెండో విడతలో సొమ్ము జమ చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రచారం చేసుకోవాలని నిర్ణయించారు. అక్టోబరు 7న సీఎం నిధులను విడుదల చేయగానే,  8 నుంచి 17 వరకు పది రోజుల పాటు ఎమ్మెల్యేలు అన్ని గ్రామాల్లో పర్యటిస్తారు. వారు వెళ్లే రోజుకు గ్రామంలోని డ్వాక్రా గ్రూపులకు రుణమాఫీ సొమ్ము బ్యాంకు ఖాతాలకు జమయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - 2021-10-01T04:53:24+05:30 IST