గంగమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు

ABN , First Publish Date - 2022-05-23T06:59:05+05:30 IST

తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికీ భక్తులు పోటెత్తారు. గంగజాతర ముగిసిన తొలి ఆదివారం కావడం, సెలవులు కలసిరావడంతో ఉదయం నుంచే భక్తులు ఆలయానికి తరలివచ్చారు.

గంగమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు

తిరుపతి(కొర్లగుంట), మే 22: తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికీ భక్తులు పోటెత్తారు. గంగజాతర ముగిసిన తొలి ఆదివారం కావడం, సెలవులు కలసిరావడంతో ఉదయం నుంచే భక్తులు ఆలయానికి తరలివచ్చారు. జాతర పర్వదినాల్లో రాలేకపోయిన వారంతా ఒక్కసారిగా విచ్చేయడంతో రద్దీ నెలకొందని అధికారులు తెలిపారు. వందలాది మంది అమ్మవారిని దర్శించుకున్నారని చెప్పారు. సంప్రదాయ దుస్తులను ధరించిన యువతీ యువకులు వెయ్యికళ్ల దుత్తలతో రాగా.. మహిళలు పొంగళ్లను తలపై పెట్టుకుని ఆలయ ప్రదక్షిణ చేశారు. ప్రధాన గోపురం వద్ద కొందరు జీవాలను బలులిచ్చి, కొబ్బరికాయలు సమర్పించారు. రద్దీని ముందుగానే ఊహించిన ఆలయ అధికారులు తోపులాటలు జరగకుండా గర్భాలయం వద్ద మూడు వరుసలు ఏర్పాటు చేశారు. దీనివల్ల భక్తులు ఎక్కువసేపు నిరీక్షించకుండా ప్రత్యే క అలంకరణలోని అమ్మవారిని దర్శించుకుని సంతృప్తిగా వెనుతిరిగారు. రూ.150 టికెట్లు పొందిన భక్తులకు ప్రత్యేక దర్శనంతోపాటు ప్రసాదాలు అందజేశారు. ఆలయ ప్రాంగణం, పరిసరాలు జాతరను తలపించాయి. పోలీసు సిబ్బంది కూడా ముందు జాగ్రత్త చర్యగా ట్రాఫిక్‌ను మళ్లించారు. వైఎస్‌ కూడలి నుంచి కేవలం ద్విచక్రవాహనాలను మాత్రమే అనుమతించారు.



Updated Date - 2022-05-23T06:59:05+05:30 IST