జిల్లాలో ఎక్కడా ఆక్సిజన్‌ కొరత లేదు.. వదంతులు నమ్మొద్దు : కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-05-07T06:49:33+05:30 IST

ప్రభుత్వ, ప్రైవేటు కొవిడ్‌ ఆసుపత్రులకు ప్రణాళిక ప్రకారం ఆక్సిజన్‌ సరఫరా చేస్తున్నామని.. జిల్లాలో ఎక్కడా ఆక్సిజన్‌ కొరత లేదని, సోషల్‌ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి కోరారు.

జిల్లాలో ఎక్కడా ఆక్సిజన్‌ కొరత లేదు.. వదంతులు నమ్మొద్దు  : కలెక్టర్‌

డెయిరీఫారమ్‌ సెంటర్‌(కాకినాడ), మే6: ప్రభుత్వ, ప్రైవేటు కొవిడ్‌ ఆసుపత్రులకు ప్రణాళిక ప్రకారం ఆక్సిజన్‌ సరఫరా చేస్తున్నామని.. జిల్లాలో ఎక్కడా ఆక్సిజన్‌ కొరత లేదని, సోషల్‌ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి కోరారు. జిల్లాలో కొవిడ్‌ పరీక్షలు, రోగులకు వైద్యసేవలు, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ తదితర అంశాలపై గురువారం సాయంత్రం కలెక్టర్‌ వర్చువల్‌ విధానంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాకు విశాఖపట్నం, ఒడిశాలోని అంగూల్‌ నుంచి ఆక్సిజన్‌ వస్తోందని, అన్‌లోడింగ్‌, ఫిల్లింగ్‌ ఆధారంగా ఆసుపత్రుల అవసరాలకు అనుగుణంగా సిలిండర్లను అందిస్తున్నామన్నారు. జిల్లాలో రోజువారీ వినియోగం 33.8 కిలోలీటర్లు కాగా, సరఫరా ద్వారా 30 కిలోలీటర్లు ట్యాంకుల్లోను, 3 కిలోలీటర్లు సిలిండర్లలోను మొత్తం మీద రోజువారీగా 33 కిలోలీటర్ల ఆక్సిజన్‌ అందుబాటులో ఉంటోందని వివరించారు. ఆక్సిజన్‌ వినియోగంలో నిబంధనలను అతిక్రమించిన కాకినాడలోని ఫౌండేషన్‌ ఆసుపత్రికి కొవిడ్‌ చికిత్స అనుమతులను రద్దు చేశామన్నారు. 78 కొవిడ్‌ నోటిఫై ఆసుపత్రులపై నిరంతర పర్యవేక్షణ ఉంటోందన్నారు. వీటిలో ఉల్లంఘనకు పాల్పడిన మరికొన్ని ఆసుపత్రులను ఇప్పటికే గుర్తించామని, వీటిని కూడా డీ నోటిఫై చేస్తామన్నారు. ఆక్సిజన్‌, రెమ్‌డెసివిర్‌ వినియోగంతో పాటు చికిత్సా ప్రమాణాలపై ఆడిటింగ్‌ నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. కొవిడ్‌ ఆసుపత్రుల నుంచి ఆరో గ్యం మెరుగుపడి గురువారం 757 మంది డిశ్చార్జి కాగా, కొత్తగా 417 మంది చేరారన్నారు. దీంతో 340 పడకలు ఖాళీ అయి అందుబాటులో ఉన్నాయన్నారు. వ్యాక్సినేషన్‌ రెండో డోస్‌ పంపిణీకి సచివాలయాల వ్యవస్థ, వలంటీర్ల ద్వారా కూపన్లు అందిస్తామని, ఈ కూపన్లను నిర్దేశిత కేంద్రాలకు తీసుకెళ్లి వ్యాక్సిన్‌ వేయించుకోవాలన్నారు. అర్హుల రిజిస్ట్రేషన్‌, వ్యాక్సిన్‌ పంపిణీ పర్యవేక్షణకు కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామని కలెక్టర్‌ తెలిపారు. జాయింట్‌ కలెక్టర్‌ లక్ష్మీశ ఆక్సిజన్‌, మందులు, ఆహారం, శానిటైజేషన్‌ అంశాలపైన,  మరో జేసీ కీర్తి శాశ్వత వ్యాక్సినేషన్‌ కేంద్రాలు, ఈ కేంద్రాల్లో సదుపాయాలపైన, జేసీ రాజకుమారి కొవిడ్‌ ఆసుపత్రులు, మృతదేహాల తరలింపు, అంతిమ సంస్కారాల నిర్వహణ అంశాలపైనా మాట్లాడారు.



Updated Date - 2021-05-07T06:49:33+05:30 IST