మంచి పథకానికి సీఎం నాంది

ABN , First Publish Date - 2021-01-22T06:43:29+05:30 IST

జిల్లాలో పేదలకు ఇంటింటికీ రేషన్‌ సరుకులను అందజేయడానికి జిల్లాకు 1,076 వాహనాలు ఇచ్చి మంచి పథకానికి సీఎం జగన్‌ నాంది పలికారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సీహెచ్‌ వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు.

మంచి పథకానికి సీఎం నాంది
ఇంటింటికి రేషన్‌ పంపిణీలో అందించే బియ్యం సంచులను ప్రారంభిస్తున్న మంత్రి వేణు తదితరులు..

ఇంటింటికీ రేషన్‌ సరుకుల  పంపిణీ వాహనాల ప్రారంభోత్సవంలో మంత్రి వేణుగోపాలకృష్ణ 

కాకినాడ, జనవరి21(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పేదలకు ఇంటింటికీ రేషన్‌ సరుకులను అందజేయడానికి జిల్లాకు 1,076 వాహనాలు ఇచ్చి మంచి పథకానికి సీఎం జగన్‌ నాంది పలికారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సీహెచ్‌ వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. గురువారం కాకినాడ ఆర్‌ఎంసీ ఆవరణలో సంచార పౌరసరఫరా సరుకుల పంపిణీ వాహనాలను ఆయన ప్రారంభించారు. అనం తరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. 20 నెలల్లో పరిపాలనా విశిష్టత చాటేలా సీఎం ఎన్నో కార్యక్రమాలు అమలుచేసి చేతల్లో చూపారని కొనియాడారు. రాజకీయం అంటే దర్పం ప్రదర్శించడానికి కాదని, ప్రజలకు చేరువవ్వడమని ఆయన నిరూపించారన్నారు. డిపోలకు వెళ్లి రేషన్‌ తెచ్చుకోడానికి ఇబ్బందులు పడుతున్న లబ్ధిదారులను ఆయన పాదయాత్రలో చూశారని, అప్పుడే ఆయన ఈ వాహనాల నిర్ణయం తీసుకున్నారన్నారు. గతంలో రేషన్‌ కార్డు కావాలంటే ఏళ్లు పట్టేదని, ఇప్పుడు నిజమైన అర్హులు దరఖాస్తు చేస్తే పది రోజుల్లో బియ్యం కార్డు ఇస్తున్నామన్నారు. లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో సంక్షేమ ఫలాలు అందేలా సీఎం కృషి చేస్తున్నారని ఎంపీ వంగా గీత పేర్కొన్నారు. గతంలో ఎప్పుడూ చూడని విధంగా, భవిష్యత్తులో ఎవరూ చేయని రీతిలో ప్రభుత్వం ప్రజల కోసం గొప్ప కార్యక్రమాలు అమలు చేస్తోందని కలెక్టర్‌ డి మురళీధర్‌ రెడ్డి అన్నారు. ఆరోగ్యశ్రీ విస్తరణ, వలంటీర్‌ వ్యవస్థ, ఇప్పుడు ఇంటింటికీ రేషన్‌ పంపిణీ నిదర్శనమన్నారు. వచ్చే నెల ఒకటి నుంచి ఇంటింటికీ రేషన్‌ సరుకుల పంపిణీ ప్రారంభిస్తామన్నారు. దీనికోసం మండల స్థాయిలో వాహన లబ్ధిదారులకు శిక్షణ ఇస్తామన్నారు. ప్రస్తు తం వలంటీర్లను ప్రజలు తమ సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకుంటున్నారని, ఇదేవిధంగా వాహన లబ్ధిదారులను చూసుకోవాలన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమంలో భాగస్వాములైనందుకు చాలా సంతోషంగా ఉందని ఎస్పీ అస్మి పేర్కొన్నారు. ఈ సందర్భంగా జేసీ లక్ష్మిశ మాట్లాడుతూ ఓ యూనిట్‌ విలువ రూ.5,81,190 కాగా, ఇందులో ప్రభుత్వం 60 శాతం అంటే రూ.3,48,614 మొత్తాన్ని సబ్సిడీగా భరిస్తోందన్నారు. సుమారు 16.24 లక్షల బియ్యం కార్డుదారులకు పారదర్శకంగా సరుకులను ఇంటింటికీ పంపిణీ చేస్తామన్నారు. సేవలందిస్తున్న వాహన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో ప్రతీ నెలా రూ.16 వేలు జమ అవుతుందన్నారు. సభలో ఎమ్మెల్సీ డాక్టర్‌ పండుల రవీంద్రబాబు, ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, రాపాక వరప్రసాద్‌, జక్కంపూడి రాజా, కొండేటి చిట్టిబాబు, మాల కార్పొరేషన్‌ చైర్మన్‌ అమ్మాజీ, కమిషనర్‌ స్వప్నిల్‌, అదనపు ఎస్పీ కరణం కుమార్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-01-22T06:43:29+05:30 IST