జీ‘డీలా’..

ABN , First Publish Date - 2022-10-04T04:48:03+05:30 IST

దసరా సీజన్‌లో జీడిపప్పు ధరలు పెరుగుతాయని ఆశించిన వ్యాపారులకు నిరాశే ఎదురైంది. మొన్న వినాయక చవితికి సరైన ధరలు లేక నష్టపోయిన వ్యాపారులు ఈ దసరాకైనా సొమ్ము చేసుకోవాలకున్నారు. ముందస్తుగా జీడి పిక్కలు కొనుగోలు చేసి నిల్వ పెట్టుకున్నారు. కానీ, ఈ సీజన్‌లో కూడా వారికి గడ్డు పరిస్థితిని మిగిల్చింది.

జీ‘డీలా’..
జీడి పప్పును ప్యాకింగ్‌ చేస్తున్న కార్మికులు

- కలిసిరాని దసరా సీజన్‌
- ఇంకా తగ్గుముఖంలోనే  జీడిపప్పు ధరలు
- నిరాశలో వ్యాపారులు
(పలాస)

దసరా సీజన్‌లో జీడిపప్పు ధరలు పెరుగుతాయని ఆశించిన వ్యాపారులకు  నిరాశే ఎదురైంది. మొన్న వినాయక చవితికి సరైన ధరలు లేక నష్టపోయిన వ్యాపారులు ఈ దసరాకైనా సొమ్ము చేసుకోవాలకున్నారు.  ముందస్తుగా జీడి పిక్కలు కొనుగోలు చేసి నిల్వ పెట్టుకున్నారు. కానీ, ఈ సీజన్‌లో కూడా వారికి గడ్డు పరిస్థితిని మిగిల్చింది.

..............................

సాధారణంగా ఆగస్టు నెల నుంచి జనవరి నెల వరకు జీడి సీజన్‌. ఈ సమయంలోనే వినాయక చవితి నుంచి సంక్రాంతి వరకు వివిధ హిందూ పండగలు వస్తుంటాయి. ఈ సీజన్‌లోనే ఏడాది జీడిపప్పు అంతా వివిధ రాష్ట్రాలు, దేశాలకు తరలించి వ్యాపారులు సొమ్ము చేసుకుంటుంటారు. ఈ ఏడాది అనూహ్యంగా జీడి పప్పు ధరలు తగ్గుముఖం పట్టడంతో వ్యాపారులు దిగులు చెందుతున్నారు. జిల్లాలో 350కుపైగా జీడి పరిశ్రమలు ఉండగా.. ఒక్క పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లోనే 240కుపైగా ఉన్నాయి. ఈ ప్రాంతం నుంచి ఏటా సరాసరి ఒక్కో పరిశ్రమ 1,200 బస్తాల జీడి పిక్కలు పీలింగ్‌ చేసి ఇతర రాష్ట్రాలకు పంపిస్తుంది. వినాయక చవితి సమయంలో హైదరాబాద్‌, ముంబాయి, పూణె వంటి ప్రాంతాల్లో మన జీడిపప్పు ఎక్కువగా అమ్ముడవుతుంటుంది. విజయదశమికి బెంగాల్‌, బీహర్‌, అసోం, ఒడిసా వంటి ప్రాంతాలకు సరఫరా అవుతుంది. దీపావళికి గుజరాత్‌, గోవా, మధ్యప్రదేశ్‌, ఢిల్లీ, పంజాబ్‌ వంటి ప్రాంతాలకు ఎక్కువగా వెళ్తుంది. అందుకు తగిన ఆర్డర్లు వస్తున్నా ధర లేని కారణంగా ఉన్న నిల్వలు చెల్లించుకుంటున్నారే తప్ప.. అందుకు తగిన ఫలితం పొందలేకపోతున్నారు. గత ఏడాది ఈ సీజనులో కిలో జీడిపప్పు ధర రూ.900 వరకు ఉంటే ప్రస్తుతం రూ.650కు మించి వెళ్లడం లేదు. జీడి పిక్కలు బస్తా(80)కిలోలు రూ.9,600 పలుకుతోంది. అధిక ధరలకు అమ్ముకోవచ్చని అనేకమంది వ్యాపారులు ముందస్తుగా జీడి పిక్కలు కొనుగోలు చేసి నిల్వ పెట్టుకున్నారు. ఒకే సంవత్సరంలో కొనుగోలు చేసిన పిక్కలు ఆ ఏడాదిలోనే పీలింగ్‌ చేయాల్సి ఉంది. భారీ నిల్వలు పీలింగ్‌ చేస్తే బస్తాకు రూ.1200 వరకు తిరిగి నష్టాలు వస్తున్నాయని వ్యాపారులు వాపోతున్నారు. భారీ నిల్వలు ఏదో ఒక ధరకు అమ్ముకోవడం తప్ప.. గత్యంతరం లేదని వ్యాపారులు చెబుతున్నారు.

జీడిపప్పు ధరలు
రకం       కిలో  
180      రూ.750
230      రూ.640
270      రూ.600
320      రూ.570
400      రూ.540

నష్టపోతున్నాం
కరోనా తరువాత నుంచి జీడి పరిశ్రమల గతి మారిపోయింది. అప్పటి నుంచి నష్టాలు వస్తూనే ఉన్నాయి. దీనికి తోడు జీడిపప్పు ఉత్పత్తి విధానం మారిపోయింది. తక్కువ ధరలకు కూడా ఉత్పత్తి చేసే దేశాలు ఉన్నాయి. దీనివల్ల పలాస జీడి పరిశ్రమ కుదేలవుతుంది. ప్రత్యామ్నాయం మార్గం లేక దీన్నే నమ్ముకొని ఉన్నాం. ప్రభుత్వం కూడా చిన్నతరహా పరిశ్రమలైన జీడిని ప్రోత్సహించాల్సి ఉంది.  
-మల్లా సురేష్‌కుమార్‌, జీడి పప్పు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు, పలాస.

 ప్రభుత్వమే గట్టెక్కించాలి
రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని నష్టాల్లో ఉన్న జీడి పరిశ్రమలను గట్టెక్కించాలి. కనీస ధర, మార్కెట్‌ కల్పించడం, మన రాష్ట్రంలో ఉన్న ప్రధాన ఆలయాలకు జీడి పప్పు పంపించడం వంటివి చేస్తే కొంత వరకు నష్టాల నుంచి గట్టెక్కవచ్చు.
-కేవీ శివకృష్ణ, ప్రధాన కార్యదర్శి, పీసీఎంఏ.

 

Updated Date - 2022-10-04T04:48:03+05:30 IST