బిల్లు ఎన్నాళ్లీ ఘొల్లు

Dec 8 2021 @ 01:19AM

జిల్లాలో పేరుకుపోయిన కాంట్రాక్టర్ల బిల్లుల బకాయిలు 

రూ.800 కోట్లుపైనే ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌,

డ్వామా, విద్య, వైద్య, సంక్షేమ, 

ఇంజనీరింగ్‌ శాఖలదే అధికం

రెండున్నరేళ్లుగా డబ్బులు ఇవ్వకుండా 

చుక్కలు చూపిస్తున్న ప్రభుత్వం

విసిగిపోయి వినూత్నంగా సర్కారు తీరుపై 

ఉద్యమిస్తున్న కాంట్రాక్టర్లు

ఆత్యహత్యలే గతి అంటూ ప్రభుత్వ కార్యాలయాల 

ముందు వరుసగా ఫ్లెక్సీలు

ఇన్నేళ్లలో ఏ ప్రభుత్వం ఇంతలా వేధించలేదంటూ ఆవేదన

కార్యాలయాల ముందు ఫ్లెక్సీల తాకిడితో 

తలలు పట్టుకుంటున్న అధికారులు


ప్రభుత్వ తీరుకు నిరసనగా జిల్లాలో కాంట్రాక్టర్లు ఆందోళనను క్రమేపీ తీవ్రతరం చేస్తున్నారు. తమ దీనస్థితిని వివరిస్తూ ప్రభుత్వ కార్యాలయాల ముందు ఇప్పటికే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా ఈనెల 14న భారీ ఆందోళనకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. మొత్తం అన్ని కీలక శాఖలకు సంబంధించి రూ.800 కోట్ల మేర రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కాంట్రాక్టర్లకు బకాయిపడింది. అత్యధికంగా ఆర్‌అడ్‌బీ, పీఆర్‌, ఆర్‌డబ్ల్ల్యుఎస్‌, విద్య, వైద్య, ఇతర ఇంజనీరింగ్‌ శాఖలవే ఉన్నాయి. అధికారం లోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ ప్రభుత్వం అనుమానాలతో అన్ని బిల్లుల చెల్లింపులు ఆపేసింది. గత ప్రభుత్వంలో కొందరు చిన్నాచితకా టీడీపీ నేతలు కాంట్రాక్టులు చేయడమూ ఇందుకు ఓ కారణం. దీంతో అప్పటి నుంచీ కాంట్రాక్టర్లంతా ఘొల్లు మంటున్నారు. తీరా ఈలోపు రాష్ట్రం పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోవడంతో ఇప్పుడు చిల్లిగవ్వ కూడా చెల్లించలేని స్థితికి వెళ్లిపోయింది.(ఆంధ్రజ్యోతి-కాకినాడ)

జిల్లాకు చెందిన కాంట్రాక్టర్లు, బయట వ్యక్తులు గత టీడీపీ ప్రభుత్వంలో పలు టెండర్లు దక్కించుకుని పనులు చేశారు. అయితే బిల్లులు చెల్లించే నాటికి ప్రభుత్వం మారి వైసీపీ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకు రెండున్నరేళ్లు దాటిపోయింది. అయినా ఇప్పటికీ వారి బిల్లులు చెల్లించలేదు. జిలావ్యాప్తంగా ఇలా రూ.800 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయాయి. అత్యధికంగా ఆర్‌అండ్‌బీ శాఖ పరిధిలో రూ.300 కోట్లు, పంచాయతీరాజ్‌ రూ.180, ఆర్‌డబ్ల్ల్యు ఎస్‌ రూ.100, విద్య, వైద్య, పోలీస్‌, హౌసింగ్‌ కార్పొరేషన్‌, మునిసిపల్‌ ఇంజనీరింగ్‌ శాఖల పరిధిలో బిల్లులు రూ.230కోట్ల వరకు ఉన్నాయి.  డ్వామా పరిధిలో మెటీరియల్‌ కాంపొనెంట్‌  విభాగంలో చేపట్టిన పనులకు సంబంధించిన పెండింగు బిల్లులు రూ.70కోట్లు ఉంటాయి. ఈ బిల్లులేవీ రాష్ట్ర ప్రభుత్వం బాకీపడ్డ కాంట్రాక్టర్లకు చెల్లించట్లేదు. సంబంధిత శాఖల అధికారులను కాంట్రాక్టర్లు ఎన్నిసార్లు కలిసినా తామేం చేయలే మని చేతులెత్తేస్తున్నారు. దీంతో అలసిపోయిన పలువురు కాంట్రాక్టర్లు హైకోర్టును సైతం ఆశ్రయించారు. వడ్డీతో సహా బాకీలు చెల్లించాలని ఆదేశించినా ప్రభుత్వం చెవికి ఎక్కించుకోవట్లేదు. ఈ నేపథ్యంలో డబ్బులు రావలసిన కాంట్రాక్టర్లు బిల్లుల కోసం జిల్లాలో కొన్ని నెలలుగా వినూత్నంగా ఆందోళనలు చేస్తున్నారు. ఇటీవల జిల్లా కేంద్రం కాకినాడలో ఫ్లెక్సీలతో నిరసన బాట పట్టారు. కలెక్టరేట్‌తో పాటు,    ఆర్‌అండ్‌బీ, దేవదాయ, విద్య, వైద్య, పీఆర్‌ తదితర శాఖల కార్యాలయాల ఎదుట వీటిని వేలాడదీశారు.  ’’మేం కాంట్రాక్టర్లం... మా బిల్లులు చెల్లించి మా ప్రాణాలు కాపాడండి.. నాడు పోషకులం... నేడు యాచకులం’’  అనే నినాదాలతో అందులో ఆవేదన వ్యక్తం చేశారు.  ఆ తర్వాత రాజమహేంద్రవరం, అమలాపురం,  పిఠాపురం తదితర చోట్ల కూడా ఫ్లెక్సీల నిరసన కొనసాగించారు. 


వాస్తవానికి రాష్ట్రం మొత్తం మీద అత్యధిక కాంట్రాక్టర్లు జిల్లాలోనే ఉన్నారు. వీరంతా ఇతర జిల్లాల్లోనూ టెండర్‌ వర్కులు దక్కించుకుని పనులు చేశారు. ఇప్పుడు రెండున్నరేళ్లుగా బిల్లులు రాక, చేసిన అప్పులు కట్టలేక కొందరైతే ఆత్మహత్యలు చేసుకున్నారు. అయినా ప్రభుత్వం వీరి ఆందోళనను ఖాతరు చేయలేదు. బిల్లుల కోసం కాంట్రాక్టర్లు ఆందోళన చేయడం, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, వేధింపులకు గురవడం గతంలో ఏ సర్కారు హయాంలోనూ జరగలేదు.  కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం వేధింపులతో వేటాడుతోందని కాంట్రాక్టర్ల అసోసియేషన్‌  ఆవేదన వ్యక్తం చేసింది. 


మరోపక్క గత టీడీపీ ప్రభుత్వంలో నామినేషన్‌ విభాగంలో చిన్నచిన్న కాంట్రాక్టు పనులు అనేకమంది చోటా నేతలు అప్పులు తెచ్చి చేశారు. ఇప్పుడు బిల్లులు రాక వీరంతా రోడ్డునపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ నెల 14న రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే కాంట్రాక్టర్లతో కలిపి కాకినాడలో జిల్లా స్థాయి ఆందోళన చేపట్టనున్నారు. బిల్లుల కోసం కాంట్రాక్టర్లు ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ఫ్లెక్సీలు కడుతుండడంతో ఆ శాఖ ఉన్నతాధికారులు, ఉద్యోగులు తలలు పట్టుకుంటున్నారు. రోజూ కార్యాలయానికి వెళ్తూవస్తూ వీటిని చూడడంతో పరువు పోతోందని ఆందోళన చెందుతున్నారు. ఫ్లెక్సీలు తొలగించాలంటూ కొన్ని శాఖలు కాంట్రాక్టర్లను కోరాయి. ప్రభుత్వానికి బిల్లుల బాకీల గురించి విజ్ఞప్తులు పంపామని, సర్కారు ఆర్థికంగా పీకల్లోతు కష్టాల్లో ఉండడంతో ఇప్పట్లో ఇవి రాకపోవచ్చని కాంట్రాక్టర్లకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.  కాగా ప్రభుత్వం ఇటీవల అనేక అత్యవసర పనులకు కొత్తగా టెండర్లు పిలిచింది. కానీ వేటికీ కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేయట్లేదు. దీంతో ఆ పనులన్నీ ఆగిపోతున్నాయి. ముఖ్యంగా జిల్లాలో రూ.205 కోట్లతో వందలాది రహదారుల మరమ్మతులకు ఇప్పటికే పలుసార్లు టెండర్లు పిలిచినా ఒక్కటంటే ఒక్క టెండరు కూడా దాఖలు కాలేదు. విద్య, వైద్య, మార్కెటింగ్‌శాఖలకు సంబంధించిన పనులకు సైతం ఇదే పరిస్థితి తలెత్తుతోంది. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.