అర్జీ ‘కష్టాలు’

ABN , First Publish Date - 2022-08-09T06:58:05+05:30 IST

కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత కలెక్టరేట్‌లు చేరువలోకి రావడంతో సోమవారం జరిగే స్పందన కార్యక్రమానికి ప్రజలు ఎక్కువగా ఫిర్యాదు లతో తరలివస్తున్నారు. అలాగే ఎస్పీ ఆఫీసుకు కూడా ఫిర్యాదులు వస్తున్నాయి. గతంలో గ్రామాల్లోనూ, మండలాల్లోనూ ఫిర్యాదులు చేసినా పరిష్కారంకాని సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఇలా కుప్పలుతెప్పలుగా అర్జీల దరఖాస్తులు అందుతున్నా, వాటి పరిష్కారం మాత్రం నెమ్మదిగా సాగుతోంది. కలెక్టరేట్‌ పరిధిలో ఆర్థికేతర సమస్యలైతే పరిష్కారానికి నోచుకుంటున్నాయి. ఆర్థికపరమైనవి, ప్రభుత్వ స్కీమ్‌లకు సంబంధించినవి మాత్రం టెక్ని

అర్జీ ‘కష్టాలు’
కలెక్టరేట్‌లో సోమవారం జిల్లా కలెక్టర్‌ మాధవీలతకు సమస్యలు చెబుతున్న అర్జీదారులు

కుప్పలుతెప్పలుగా దరఖాస్తులు.. పరిష్కారం అరకొర 

కేవలం ఆర్థికేతర సమస్యల పరిష్కారానికే రప్రాధాన్యం

సాంకేతిక, లీగల్‌ సమస్యలు ఉంటే దరఖాస్తు మూలకే

 కలెక్టరేట్‌కు అధికంగా ఇళ్ల పట్టాలు, రేషన్‌కార్డు,             

పింఛన్ల దరఖాస్తులు.. భూవివాదాల సమస్యలే ఎక్కువే


(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

 కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత  కలెక్టరేట్‌లు చేరువలోకి రావడంతో సోమవారం జరిగే స్పందన కార్యక్రమానికి ప్రజలు ఎక్కువగా ఫిర్యాదు లతో తరలివస్తున్నారు. అలాగే ఎస్పీ ఆఫీసుకు కూడా ఫిర్యాదులు వస్తున్నాయి. గతంలో గ్రామాల్లోనూ, మండలాల్లోనూ ఫిర్యాదులు చేసినా పరిష్కారంకాని సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఇలా కుప్పలుతెప్పలుగా అర్జీల దరఖాస్తులు అందుతున్నా, వాటి పరిష్కారం మాత్రం నెమ్మదిగా సాగుతోంది. కలెక్టరేట్‌ పరిధిలో ఆర్థికేతర సమస్యలైతే పరిష్కారానికి నోచుకుంటున్నాయి. ఆర్థికపరమైనవి, ప్రభుత్వ స్కీమ్‌లకు సంబంధించినవి మాత్రం టెక్నికల్‌ కారణాలతో పెండింగ్‌ పెడుతున్నారు. కలెక్టరేట్‌లో స్పందనకు సోమవారం 98 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో వారం 200 కంటే ఎక్కువే అర్జీలు వస్తున్నాయి. కలెక్టర్‌ కె.మాధవీలత ఒక్కో సోమవారం ఒక్కో మండల కేంద్రంలో గ్రీవెన్స్‌ నిర్వహిస్తున్నారు. ఎక్కువ బియ్యంకార్డులు, పింఛన్లు, ఉద్యోగాలు, డ్వాక్రా గ్రూపుల గొడవలు, వివిధ  ప్రభుత్వ శాఖల ద్వారా ఇబ్బందులు, స్థల వివాదాల వంటివి ఎక్కువ వస్తున్నాయి. కొత్త జిల్లా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకూ స్పందనకు వచ్చిన వాటిలో 545 ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయి. కొత్తగా రేషన్‌కార్డులు, పింఛన్లు, ఇళ్ల పట్టాలు వంటివి అన్నీ పెండింగ్‌లో ఉంటు న్నాయి. మళ్లీ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేవరకూ అవన్నీ పెండింగే. ఇక్క డ చేయదగినవి చేస్తున్నారు. కోరుకొండ మండలంలోని గాదరాడకు చెం దిన నాగళ్ల పెద అప్పారావు అనే వ్యక్తి  తనకు వినికిడి శక్తి తగ్గిపోయిందని, బాధపడుతున్నానని చెప్పడంతో కలెక్టర్‌ అతనికి వినికిడి యంత్రం ఇప్పించారు. సీతానగరంనకు చెందిన పలువురు రైతులు తాము మొక్కజొన్న నకిలీ విత్తనాలు పంట వేసి నష్టపోయామని, విత్తనాల వ్యాపారి మోసం చేశాడని ఆరోపించారు. దీంతో  కలెక్టర్‌ వ్యవసాయశాఖ అధికారిని పిలిచి, ఈ సమస్యను వెంటనే చూడాలని, అవసరమైతే క్రిమినల్‌ కేసులు పెట్టాలని హెచ్చరించారు. ఇక్కడ 133 మంది రైతులు సుమారు 360 ఎకరాల్లో రబీలో మొక్కజొన్న వేశారు. ప్రసాద్‌ సీడ్స్‌ నుంచి విత్తనాలు తెచ్చుకున్నారు. కానీ చేను పెరిగి పొత్తులు వేసింది. కానీ గింజలు లేవు. కేవలం కండెలు మాత్రమే మిగిలాయి. వీటితో ఒక్కో రైతుకు రూ. 50 వేలు ఇస్తానని వ్యాపారి ఒప్పుకుని, ఇప్పటికే ఇవ్వకపోవడంతో  వీరు కలెక్టరేట్‌ చుట్టూ తిరుగుతున్నారు. ఇటీవల కోరుకొండలో  కలెక్టర్‌ స్పంద న కార్యక్రమం నిర్వహించినప్పుడు అప్పుడు ఫిర్యాదు చేశారు. సోమవారం మళ్లీ వచ్చారు. ఇక ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే స్పందనకు జూన్‌ నుంచి ఇప్పటివరకూ 234 ఫిర్యాదులు వచ్చినట్టు సమాచారం. 



‘స్పందన’లో సమస్యలు.. పరిష్కారాలు

బొమ్మూరు, ఆగస్టు 8: సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో ఉదయం పది గంటల నుంచి అర్జీదారులు కలెక్టరేట్‌కు చేరుకున్నారు. కలెక్టర్‌ మాధవీలత, జిల్లా అధికారులు పలు అర్జీలు స్వీకరిం చారు. అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌ అండ్‌ ఏజంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ కలెక్టరేట్‌ బయట ఫ్లకార్డులతో నిరసన వ్యక్తంచేశారు. అసోసియేషన్‌ జి ల్లా అధ్యక్షుడు పి.శేషుకుమార్‌రెడ్డి మాట్లాడుతూ రూ.20వేలకు పైన రావాల్సిన డిపాజిట్లు, చెక్‌ బౌన్స్‌, చనిపోయిన బాధితుల ఎక్స్‌గ్రేషియా తదితర సమస్యలపై కలెక్టర్‌ మాధవీలతతో మాట్లాడి వినతి ప త్రం అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నగర సహాయక కార్యదర్సి బి.రవిచంద్ర, అగ్రిగోల్డ్‌ నాయకులు గోవిందయ్య, సత్యనారాయణ, నాగిరెడ్డి, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఏపీ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలిపారు. రాష్ట్రం లో 26 జిల్లాల్లో పనిచేస్తున్న సిబ్బందిని రెగ్యులర్‌ చేయాలని డిమాండు చేశారు. రెగ్యులర్‌ విధానంలో తమకు రావాల్సిన అన్ని ప్రభుత్వ పఽథకాలు నిలిపివేశారని ఆందోళన వ్యక్తంచేశారు. నెలకొచ్చే 13,087 జీతం పరిగణలోకి తీసుకుని పథకాలు ఆపేస్తే తమ కుటుంబాలు ఎలా బతకాలని అసోసియేషన్‌ నాయకులు ప్రశ్నించారు. సచివాలయ సిబ్బందికి సమస్య చెబితే వాళ్లు కంప్యూటర్‌లో రెగ్యులర్‌ అయి నట్టు చూపిస్తోందని, అందువల్ల ఏ పథకాలు వర్తించవని చెబుతున్నారని బాధను వ్యక్తంచేశారు. ప్రభుత్వం స్పందించి తమను రెగ్యులర్‌ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాం డు చేశారు. అంతకుముందు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. యోగాసన చాంపియన్‌ షిప్‌లో రజత పతకం సాధించిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి డి.ప్రవల్లికను కలెక్టర్‌ అభినందించారు.


ఉచితంగా వినికిడి యంత్రం అందజేత

కోరుకొండ మండలం గాదరాడకు చెందిన నాగిళ్ళ పెద అప్పారావు బండ్లపై పళ్ల వ్యాపారం చేసేవాడు. కొంతకాలంగా వినికిడి కోల్పోయాడు. దానివల్ల వ్యాపారంలో నష్టం వస్తోందని, తనకు సహాయం చేయాలని కోరుతూ గత వారం స్పందనలో వినతిపత్రం అందజేశాడు. వారం తర్వాత కలెక్టరేట్‌ నుంచి అధికారి ఫోన్‌ చేశారు. మీకు హీరింగ్‌ మిషన్‌ వచ్చిందని చెప్పడంతో స్పందనలో కలెక్టర్‌ మాధవీలత చేతుల మీదుగా రూ.6 వేల విలువ చేసే మిషన్‌ అందుకున్నాడు.


ఎస్పీ ఆఫీసులోనూ ఫిర్యాదుల వెల్లువ

రాజమహేంద్రవరం సిటీ, ఆగస్టు 8: సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన స్పందనలో వివిద మండలాల నుంచి ప్రజలు వచ్చి వారి సమస్యలను పోలీసు ఉన్నతాధికారులకు ఏకరువు పెట్టుకున్నారు. అయితే ఎస్పీ ఐశ్వర్యరస్తోగి వివిధ పనుల నిమిత్తం స్పందనకు హాజరుకాలేదు. దాంతో అడిషనల్‌ ఎస్పీ ప్రజల నుంచి ఫిర్యాదు స్వీకరించారు. గోపాలపురం మండలం భీమోలు గ్రామానికి చెందిన 30 మంది రైతులు స్పందనలో ఫిర్యాదు ఇచ్చారు. తమకు 1976లో భూములను ఒక రైతు నుంచి కౌలుకు తీసుకున్నామని, వాటిని ఆ రైతు 99 ఏళ్లకు లీజుకు ఇచ్చారని, ఆ గడువు పూర్తి కాకుండానే కొంతమంది ఆయా భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తే కోర్టుకు వెళ్లామని, సుప్రీంకోర్టు తీర్పు తమకు అనుకూలంగా వచ్చినప్పటికి ఆయా కోర్టు ఆదేశాలు అమలు కావ డంలేదని పోలీస్‌ ఉన్నతాధికారులకు వివరించారు. కొవ్వూరులో చీటీల పేరుతో లక్షల్లో దోపిడీ చేసిన ఒక కుటుంబం డబ్బుతో ఉడాయించారని బాధితురాలు రిజ్వానా ఏఎస్పీకి ఫిర్యాదుచేశారు. ఇక వేధింపుల కేసులు, భూతగాదాలు, చీటింగ్‌ వంటి కేసులకు సంబంధించిన ఫిర్యాదులు రాగా, పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్టు పోలీసులు చెబుతున్నారు. 



కలెక్టరేట్‌ చుట్టూ తిరుగుతున్నాం

నా భర్త చనిపోయాడు. పుట్టింటి నుంచి నాకు స్థలం, డబ్బు ఇస్తానని నా తల్లి, తమ్ముడు, మరదలు మోసం చేశారు. నా  మీద నా కూతురు మీద పోలీసు కేసు పెట్టి నష్టపరిచారు. మాకు న్యాయం చేయాలని కలెక్టరేట్‌కు వచ్చాం. గతంలో ఏలూరు కలెక్టరేట్‌లో కూడా ఫిర్యాదు చేశాం. ఎటవంటి పరిష్కారం దొరకలేదు. నాకు ఎటువంటి ఆధారం లేదు.

  - పెనుబోతుల వెంకటలక్ష్మి, ఎస్‌.ముప్పవరం (చాగల్లు)



పింఛను ఇప్పించండి

నా భర్త చనిపోయినప్పటి నుంచి పింఛను పొందుతున్నాను. మా అబ్బాయి కారు కొన్న కారణంగా నా పింఛను ఆగిపోయింది. నాకు ఫించనే ఆధారం. తెల్లకార్డు కూడా పోయింది. తగిన ఆధారాలు సచివాలయం అధికారులకు చూపించాను. నాకు పింఛను మంజూరు చేయాలని కోరుతున్నాను.   - ఉమాదేవి, బొమ్మూరు

Updated Date - 2022-08-09T06:58:05+05:30 IST