పోచారంలో పచ్చందాలు

ABN , First Publish Date - 2022-06-24T05:30:00+05:30 IST

పోచారంలో పచ్చందాలు

పోచారంలో పచ్చందాలు
అన్నోజిగూడలో రోడ్డుకిరువైపులా పెంచిన చెట్లు

  • పోచారం మున్సిపాలిటీలో అలరిస్తున్న పచ్చదనం
  • హరితహారంలో ఇప్పటికే రాష్ట్రస్థాయిలో మొదటి బహుమతి 
  • పార్కులు, రోడ్లకిరువైపులా చెట్లు
  • అధికారుల, పాలకవర్గం కృషితో భారీగా పెరిగిన హరితహారం మొక్కలు

ఘట్‌కేసర్‌, జూన్‌ 24: మేడ్చల్‌ జిల్లా పోచారం మున్సిపాలిటీ పచ్చదనంతో కళకళలాడుతోంది. మున్సిపాలిటీ పరిధిలో హరితహారం మొక్కలు ఏపుగా పెరిగి ఎక్కడ చూసినా పరిసరాలు పచ్చగా కనిపిస్తున్నాయి. 2018 ఆగస్టు 2న మున్సిపాలిటీ ఏర్పాటైంది. అప్పటి నుంచి పచ్చదనంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ఆ ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. మున్సిపాలిటీ ఏర్పడిన కేవలం రెండున్నరేళ్లలోనే 25వేల జనాభా గల మున్సిపాలిటీ హరితహారం విభాగంలో రాష్ట్రంలోనే మొదటి బహుమతి సాధించింది. మున్సిపాలిటీ పరిధిలోని సంస్కృతి టౌన్‌షి్‌పలో విస్తరించి ఉన్న పచ్చదనం మాధిరిగానే అన్ని కాలనీలను తీర్చిదిద్దాలనే సంకల్పంతో చేపట్టిన పనులు మంచి ఫలితాలనిస్తున్నాయి. సాయినగర్‌, దివ్యాంగుల కాలనీతో పాటు పలు కాలనీల్లోని రోడ్లు రెండువైపులా పచ్చటి మొక్కలతో ఆకర్షణీయంగా మారాయి. 

  • అందరికీ అనుకూలంగా ఆక్సిజన్‌ పార్కులు 

మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 18 వార్డులలో పట్టణ ప్రకృతి వనాలతో పాటు 9 సాధారణ పార్కులు ఏర్పాటు చేశారు. ఇందులో సాయినగర్‌, గాంధీనగర్‌లలో ఎకరం స్థలంలో యాదాద్రి ఆక్సిజన్‌ పార్కును నెలకొల్పారు. ఇక్కడ సాయినగర్‌లో గల యాదాద్రి ఆక్సిజన్‌ పార్కులో 3,800 మొక్కలు, గాంధీనగర్‌లోని ఆక్సిజన్‌ పార్కులో 5వేల మొక్కలు పెంచుతున్నారు. ప్రస్తుతం ఇవి ఏపుగా పెరిగాయి. 

మిగతా 16 పార్కులలో 500నుండి రెండువేల వరకు మొక్కలను పెంచుతున్నారు, ఇవికాక గత రెండు సంవత్సరాలుగా వివిధ కాలనీల్లో రోడ్లకిరువైపులా 46,600మొక్కలు పెంచారు. 

  • పార్కుల్లో నడకదారులు

మున్సిపాలిటీ పార్కుల్లో పాదచారులు నడిచేలా ప్రత్యేక దారులు ఏర్పాటు చేశారు, పచ్చటి వనాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు కల్పించారు. సాయినగర్‌కాలనీ అక్సిజన్‌ పార్కులో యోగా కేం ద్రాన్నీ ఏర్పాటు చేశారు. పచ్చటిచెట్ల మధ్య నడక, యోగా చేసుకునే వెసులుబాటు ఇక్కడ కల్పించారు.

  • మరో 2.94లక్షల మొక్కలు సిద్ధం 

ప్రస్తుత సీజన్‌లో నాటేందుకు 6 నర్సరీలలో 2.94లక్షల మొక్కలను సిద్ధం చేశారు. ఇక్కడ 28రకాల మొక్కలను పెంచుతున్నారు. ఎండకాలంలో మొక్కలు ఎండిపోకుండా గ్రీన్‌ పరదాలు ఏర్పాటు చేసి వాటిని కాపాడుతున్నారు. ఇవి ప్రస్తుతం నాలుగు అడుగుల ఎత్తు వరకు పెరిగాయి.

  • వాకింగ్‌ చేసేందుకు అనుకూలంగా ఉంది 

అన్నోజిగూడ సాయినగర్‌ కాలనీలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్‌ పార్కు వాకింగ్‌ చేసేందుకు ఎంతో అనుకూలంగా ఉంది, గతంలో రోడ్లపై వాకింగ్‌ చేసేవాడిని. రెండు సంవత్సరాల నుండి పార్కులోనే తిరుగుతున్నాను. స్వచ్ఛమైన గాలి, వాహనాల రద్దీ లేకుండా ప్రశాంతంగా ఉంది, చెట్లకింద కూర్చోని వ్యాయామం చేసుకోవడానికి అనుకూలంగా ఉంది.

  • - జితేందర్‌ నాయక్‌ అన్నోజిగూడ

  • మున్సిపాలిటీ అభివృద్ధే లక్ష్యం

మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నిరంతరం పాలకవర్గంతో కలిసి శ్రమిస్తున్నాం. ప్రధానంగా హరితహారం, పార్కుల అభివృద్ధితో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నాం. తడి,పొడి చెత్తపై అవగాహన, ప్లాస్టిక్‌ వివియోగంతో సంభవించే ముప్పుపై ప్రజలకు ఆవగాహన కల్పిస్తూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నాం.

  •  -సురేష్‌, కమిషనర్‌ పోచారం మున్సిపాలిటీ

  • జాతీయస్థాయి గుర్తింపునకు కృషి 

పోచారం మున్సిపాలిటీకి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకు రావడానికి కృషి చేస్తున్నాం. ఇటీవల ఉత్తర భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో పాల్గొన్న స్టడీ టూర్‌తో అనేక విషయాలు తెలసుకున్నాం, కౌన్సిల్‌ సభ్యుల సహకారంతో ప్రత్యేక గుర్తింపు పొందేందుకు పని చేస్తాం. మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేసేందుకు శక్తి వంచన లేకుండా శ్రమిస్తాం.

  • - బోయపల్లి కొండల్‌రెడ్డి, చైర్మన్‌, పోచారం మున్సిపాలిటీ

Updated Date - 2022-06-24T05:30:00+05:30 IST