ఉద్యోగుల ప్రాణాలు కాపాడాలి

ABN , First Publish Date - 2021-05-11T05:16:38+05:30 IST

ఉద్యోగుల ప్రాణాలు కాపాడాలి

ఉద్యోగుల ప్రాణాలు కాపాడాలి
పరిగి ఆర్టీసీ డిపో ఎదుట ఎర్రబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు

  • టీజేఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.హన్మంత్‌ ముదిరాజ్‌  
  • కరోనా కట్టడికి స్వచ్ఛంద లాక్‌డౌన్‌ దిశగా గ్రామాలు  
  • కొనసాగుతున్న కట్టడి చర్యలు 


పరిగి: ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగభద్రతతోపాటు, వారి పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని నిరసిస్తూ టీజేఎంయూ ఆధ్వర్యంలో సోమవారం పరిగి ఆర్టీసీ డిపో ఎదుట ఎర్రబ్యాడ్జీటీలు ధరించి  ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పాల్గొన్న టీజేఎంయూ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కె.హన్మంత్‌ముదిరాజ్‌ మాట్లాడుతూ కరోనా కాలంలో ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం విషయంలో అనేకసార్లు ప్రభుత్వం, యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 100మందికిపైగా ఆర్టీసీ కార్మికులు కరోనా సోకి మృతిచెందారని, బాధిత కుటుంబాల ను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. మృతిచెందిన ఆర్టీసీ ఉద్యోగికి రూ.50లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఏపీలో మాదిరిగా తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగుల కోసం జిల్లాకు ఒక కొవిడ్‌ సెంటర్‌ను ఏర్పాటుచేయాలని కోరారు. ఆర్టీసీ ఉద్యోగులందరికీ ఎన్‌-95మాస్కులు, శానిటైజర్లు, చేతిగ్లౌజులు, ఫేస్‌గాడ్స్‌ సరఫరా చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కరోనా పాజిటివ్‌ వచ్చినవారికి 21రోజులపాటు అటెండెన్స్‌ ఇవ్వాలని కోరారు. లాభాలు, కేఎంపీఎల్‌ల పేరుతో కండక్టర్లు, డ్రైవర్లను వేధించవద్దని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో కారక్యదర్శి బి.కృష్ణ; వెంకటయ్య, టిఐ3, డిపో చైర్మన్‌ యాదయ్య, నాయకులు నర్సింహులు, భూపాల్‌, వెంకటమ్మ, అరుణ, అనిత, రఘుపతిరెడ్డి, రాములు, కృష్ణలు పాల్గొన్నారు.

కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే

కొడంగల్‌: నియోజకవర్గంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రతిఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో కోరారు. ప్రజలు మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటించాలన్నారు. విందులు, వినోదాలు వీలైనంత వరకు వాయిదాలు వేసుకోవాలని సూచించారు. కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రభుత్వాసుపత్రులకు వెళ్లాలని కోరారు. 

వ్యాపార సముదాయాల స్వచ్ఛంద లాక్‌డౌన్‌

వికారాబాద్‌: కరోనా వ్యాప్తి అరికట్టేందుకు పట్టణంలో పాక్షిక లాక్‌డౌన్‌కు నిర్ణయించినట్లు పట్టణ కిరాణా సంఘం అధ్యక్షుడు బాలకిషన్‌ డాగా తెలిపారు. ఈనెల 14 నుంచి 31వ తేదీ వరకు స్వచ్ఛంద లాక్‌డౌన్‌కు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. 14వ తేదీ నుంచి ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంటాయని తర్వాత మూసివేయనున్నట్లు తెలిపారు. ఈనెల 10వ తేదీ నుంచి 25వ తేదీ వరకు 15రోజుల పాటు మధ్యాహ్నం 3గంటల తర్వాత జ్యువెల్లరీ షాపులను మూసివేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వికారాబాద్‌ జ్యువెల్లర్స్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ తస్వర్‌అలీ తెలిపారు.

పారిశుధ్య కార్మికుల పాత్ర కీలకం

కొవిడ్‌ నేపథ్యంలో పారిశుధ్య కార్మికుల పాత్ర కీలకమని వికారాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజులరమేష్‌ అన్నారు. సోమవారం వికారాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో మున్సిపల్‌లోని పారిశుధ్య కార్మికులకు చేస్తున్న సెకండ్‌ డోస్‌ వాక్సినేషన్‌ ప్రక్రియను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా బారి నుంచి పారిశుధ్య కార్మికులను కాపాడుకోవడం తమ బాధ్యత అన్నారు. ఇది వరకు మొదటి డోస్‌ వాక్సినేషన్‌ చేసినట్లు తెలిపారు.

నిరుపేద కుటుంబానికి బాసట

జిల్లాలోని నిరుపేద కుటుంబానికి చెందిన ఓ మహిళకు కరోనా సోకి ప్రాణాపాయ స్థితిలో ఉండగా బీజేపీ నాయకులు బాసటగా నిలిచారు. గిరిజనుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాఘవన్‌నాయక్‌లు, జిల్లా బీజేపీ అధ్యక్షుడు సదానందంరెడ్డిలు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లకు విషయం వివరించగా అత్యవసర పరిస్థితుల్లో ఉన్న బాధితురాలికి రెమిడెసివిర్‌ మందును సమకూర్చారు. ఆపద సమయంలో కాపాడిన వారికి నాయకులు రాఘవన్‌నాయక్‌, సురేష్‌నాయక్‌, ధరంసింగ్‌, కాశీనాథ్‌ కృతజ్ఞతలు తెలిపారు.

బార్వాద్‌లో స్వచ్ఛంద లాక్‌డౌన్‌

బంట్వారం (కోట్‌పల్లి): కొవిడ్‌ దృష్ట్యా కోట్‌పల్లి మండల పరిధిలోని బార్వాద్‌ గ్రామంలో నేటి నుంచి 25వ తేదీ వరకు దుకాణాలు మూసివేసేందుకు సర్పంచ్‌ ధర్మపురం వెంకటయ్యయాదవ్‌ ఆధ్వర్యంలో తీర్మానించినట్లు దుకాణయజమానులు తెలిపారు. నేటి నుంచి ఉదయం 5 నుంచి 10గంటల మధ్య మాత్రమే దుకాణాలను తెరిచి ఉంచాలని సూచించారు. అతిక్రమించిన వారికి రూ.5వేలు జరిమానా విధిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నరసింహారెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ రాంచంద్రారెడ్డి, ఉపసర్పంచ్‌ సంగారెడ్డి, ఎల్లయ్యగౌడ్‌, పాండు, ప్రవీణ్‌, వ్యాపార యజమానులు పాల్గొన్నారు.

కొవిడ్‌వార్డుకు వంద బెడ్లు ఏర్పాటు చేసిన మంచ్‌

తాండూరు: తాండూరు పట్టణం మార్వాడి యువమంచ్‌ ఆధ్వర్యంలో ఎంసీహెచ్‌ కొవిడ్‌ వార్డుకు వంద బెడ్లు, మాస్కులను అందజేశారు. మంచ్‌ అధ్యక్షులు సన్ని అగ్రవాల్‌, దీపక్‌ గగ్రాణి, సంజయ్‌సోని ఆధ్వర్యంలో ఆసుపత్రి సిబ్బందికి అందజేశారు. ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు శ్యామ్‌మెడికల్‌ ద్వారా మాస్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంచ్‌ జాతీయ కార్యవర్గ సభ్యులు మన్మోహన్‌ సార్డా, జాతీయ మంచ్‌ కన్వీనర్‌ కుంజ్‌బిహారీసోని పాల్గొన్నారు. 

రాత్రి కర్ఫ్యూను పటిష్టంగా అమలు చేస్తున్నాం: సీఐ

తాండూర్‌రూరల్‌: నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల్లో రాత్రి కర్ఫ్యూను పటిష్టంగా అమలు చేస్తున్నామని తాండూర్‌రూరల్‌ సీఐ జలంధర్‌రెడ్డి సోమవారం తెలిపారు. కొన్ని గ్రామాల్లో ప్రజలు స్వచ్చందంగా లాక్‌డౌన్‌ పాటిస్తుండగా,  మరి కొన్ని గ్రామాల్లో కర్ఫ్యూను పటిష్టంగా అమలు చేస్తున్నామన్నారు. యువత అనవసరంగా రాత్రివేళల్లో రోడ్లపైకి వస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పెళ్లిళ్లు, శుభకార్యాల్లో కచ్చితంగా కొవిడ్‌ నిబంధనలు పాటించాలన్నారు. లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. యువత దేశానికి ఆదర్శంగా ఉంటూ కరోనాకట్టడిలో సహకరించాలని కోరారు.  

నేటి నుంచి బొంరాస్‌పేట్‌లో స్వచ్ఛంద లాక్‌డౌన్‌

బొంరాస్‌పేట్‌: మండలంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో  వ్యాపారస్థులు, ప్రజలు స్వచ్ఛంద లాక్‌డౌన్‌కు తీర్మానించారు. కరోనా సెకండ్‌వేవ్‌ ప్రభావంతో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో సోమవారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీలో సర్పంచ్‌ కోవూరివిజయమ్మ సమక్షంలో వ్యాపారస్థులు, ప్రజలు స్వచ్ఛంద లాక్‌డౌన్‌కు తీర్మానించారు. ఈ నెల 11 నుంచి 31వరకు లాక్‌డౌన్‌ ఉంటుందని, రోజూ ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకే దుకాణ సముదాయాలను తెరిచి ఉంచాలని తీర్మానించారు. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానాలు విధిస్తామని సర్పంచ్‌ తెలిపారు. 

ఉపాధి కూలీలు భౌతిక దూరం పాటించాలి

కులకచర్ల: ఉపాధి హామీలో పాల్గొనే కూలీలు తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలని ఏపీడీ సరళ తెలిపారు. సోమవారం మండల పరిఽధిలోని బండవెల్కిచర్ల గ్రామ పరిధిలో జరుగుతున్న ఉపాధి పనులు పరిశీలించి కూలీలతో మాట్లాడారు. పనుల్లో పాల్గొనే కూలీలు తప్పనిసరిగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని తెలిపారు. ఎండలు అధికమవుతున్న నేపథ్యంలో ఉదయం, సాయంత్రం వేళల్లో పనుల్లో పాల్గొనాలని తెలిపారు. వలసలు వెల్లకుండా ప్రతికూలికి పని కల్పిస్తామని తెలిపారు. అన్ని గ్రామాల్లో కూడా పనులు ప్రారంభించి కూలీలకు పనులు కల్పించాలని తెలిపారు. అనంతరం గ్రామ పరిధిలో ఉన్న నర్సరీని పరిశీలించారు. వచ్చే వార్షాకాలంలో మొక్కలు నాటేందుకు సిద్ధం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీవో మల్లికార్జున్‌ పాల్గొన్నారు. 

45ఏళ్లు పైబడిన ప్రతిఒక్కరూ కరోనా టీకా వేసుకోవాలి 

కరోనా నిర్మూలనలో భాగంగా 45ఏళ్లు పైబడిన ప్రతిఒక్కరూ కరోనా టీకా వేసుకోవాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్‌ బి.మనోహర్‌రెడ్డి తెలిపారు. సోమవారం కులకచర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన కరోనా టీకా వేయించుకున్నారు. టీకా పట్ల అపోహలు వద్దన్నారు. మండల కేంద్రంలో పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నందున ప్రతిఒక్కరూ జాగ్రత్తలు పాటించాలన్నారు. అవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి మురళిక్రిష్ణ, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు రాంలాల్‌ పాల్గొన్నారు.

లాక్‌డౌన్‌కు ప్రతిఒక్కరూ సహకరించాలి 

కులకచర్లలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌కు ప్రతి ఒక్కరూ సహరించాలని వైద్యాధికారి మురళిక్రిష్ణ, ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపారు. సోమవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో వ రుసగా వాణిజ్య వ్యాపారులు అన్ని వర్గాల వారితో సమావేశం నిర్వహించి మాట్లాడారు. గతంలో మాదిరిగా గ్రామ పరిధిలో మధ్యాహ్నం 12 గంటల నుంచే లాక్‌డౌన్‌ కొనసాగుతుందని సూచించారు. ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు షాపులు తెరుచుకోవచ్చని తెలిపారు. ఇప్పటి వరకు కొనసాగిన మధ్యాహ్నం 2 గంటల వరకు షాపుల నిర్వాహణను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. అన్నివర్గాల ప్రజలు, వ్యాపారులు లాక్‌డౌన్‌ విజయవంతంగా కొనసాగేందుకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో వార్డుసభ్యులు, వ్యాపారులు పాల్గొన్నారు.

కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలి

కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు బీఎస్‌ ఆంజనేయులు కోరారు. సోమవారం ఆయన కులకచర్లలో మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది ప్రజలు కరోనా భారిన పడి వైద్యం చేయించుకునే స్థోమతలేక మృతిచెందుతున్నారని తెలిపారు. ప్రభుత్వం గుర్తించి వెంటనే ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్‌ చేశారు. 


లాక్‌డౌన్‌పై ఎమ్మెల్యే, అధికారి చెరోమాట

తాండూరు: తాండూరులో లాక్‌డౌన్‌ విధించే విషయమై అధికారపార్టీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఆర్డీవో అశోక్‌ కుమార్‌ తలోమాట చెప్పడంతో ఇటు ప్రజలు, వ్యాపారులు అయోమయానికి గురవుతున్నారు. ఆదివారం వ్యాపార  ప్రతినిధులతో సమావేశమైన ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి తాండూరులో ఈనెల 11వ తేదీ నుంచి మధ్యాహ్నం 12 నుంచి ఉదయం 6గంటల వరకు స్వచ్ఛంద లాక్‌డౌన్‌కు పిలుపునిచ్చారు. రంజాన్‌ను దృష్టిలో పెట్టుకుని మతపెద్దల విన్నపం మేరకు స్వచ్ఛంద లాక్‌డౌన్‌ను ఈనెల 15నుంచి 14 రోజుల పాటు అమలు కు ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి పిలుపు నిచ్చారు. ఎమ్మెల్యే లాక్‌డౌన్‌ పిలుపునిచ్చిన వెంటనే తాండూరు ఆర్డీవో అశోక్‌కుమార్‌ తాండూరులో ఎలాంటి లాక్‌డౌన్‌ లేదని రాత్రి సమయంలో యథావిఽధిగా కర్ఫ్యూ కొనసాగిస్తామని వెల్లడించారు. లాక్‌డౌన్‌ విధింపునకు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌ విధించరాదని ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఆదేశాలు ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వం సూచిస్తే లాక్‌డౌన్‌ పాటించాలని, అనవసరంగా ప్రజలను ఇబ్బందులకు గురిచేసే కార్యక్రమాలు చేయకుండా కొవిడ్‌ నిబంధనలు పాటించాలని సూచించారు. 


న్యాయవాదులకు వ్యాక్సిన్‌ ఇవ్వండి : తెలంగాణ రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సభ్యులు ఆకుల అనంతసేన్‌రెడ్డి 

(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌): రాష్ట్రంలో న్యాయవాదులకు, వారి న్యాయవాద కుటుంబ సభ్యులకు  కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సభ్యులు ఆకుల అనంతసేన్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ను కోరారు.  రాష్ట్రంలో ఉన్న జడ్జి, మెజిస్ట్రేట్లు, న్యాయవాదులు, వారి కుటుంబసభ్యులకు వ్యాక్సిన్‌ ఇచ్చే విధంగా బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ తెలంగాణ, బార్‌ అసోసియేషన్లలో ప్రత్యేక వాక్సినేషన్‌ శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆయన సోమవారం సీఎంకు రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే పలువురు న్యాయవాదులు కొవిడ్‌ బారిన పడి తమ ప్రాణాలు పోగొట్టుకున్నారని, మరెంతో మంది కొవిడ్‌ లక్షణాలతో బాధపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జడ్జిలు, న్యాయవాదులు, సిబ్బంది వారి కుటుంబసభ్యులు కరోనా బారిన పడుతున్నారని సీఎం దృష్టికి తీసుకువచ్చారు. గతేడాది కొవిడ్‌ సమయంలో న్యాయవాదులను ఆదుకునేందుకు రూ.25 కోట్లు కేటాయించడంపై కృతజ్ఞతలు తెలిపారు. 

రేషన్‌ డీలర్లను ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా గుర్తించాలి : జిల్లా రేషన్‌ డీలర్ల సంఘం అధ్యక్షుడు జూకారెడ్డి 

రేషన్‌ డీలర్లను ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా ప్రభుత్వం గుర్తించాలని జిల్లా రేషన్‌ డీలర్ల సంఘం అధ్యక్షుడు జూకారెడ్డి విజ్ఞప్తి చేశారు. కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్న ఈ సమయంలో బియ్యం పంపిణీ చేయడంలో తాము చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బియ్యం తీసుకునేందుకు వచ్చేవారిలో ఎవరికి ఏలక్షణాలు ఉన్నాయో తెలియక తాము ఆందోళన చెందుతున్నామన్నారు. కొవిడ్‌బారిన పడకుండా రేషన్‌ దుకాణాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నా, తమను భయం వెంటాడుతోందని వాపోయారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తాము బియ్యం పంపిణీ చేస్తున్నామని, అయితే ప్రభుత్వం తమ సేవలు గుర్తించి తమను ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా ప్రకటించాలని, ప్రతి రేషన్‌ డీలర్‌కు, వారి కుటుంబసభ్యులందరికీ వ్యాక్సిన్‌ ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. 


పరిగి సబ్‌డివిజన్‌లో 114మందికి కరోనా పాజిటివ్‌

పరిగి: పరిగి సబ్‌ డివిజన్‌లో సోమవారం 311 మందికి పరీక్షలు నిర్వహించగా 114మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. పరిగిలో 93మందిలో 35మందికి పాజిటివ్‌ రాగా పూడూరులో వందమందిలో 25 మందికి, కులకచర్లలో 62 మందికి 31, దోమలో 56 మందిలో 23 మందికి పాజిటివ్‌ వచ్చింది. 

31మందికి కరోనా పాజిటివ్‌

కులకచర్ల: కులకచర్ల ఆసుపత్రిలో 62మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 31మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు వైద్యాధికారి మురళీక్రిష్ణ తెలిపారు. పాజిటివ్‌ నిర్ధారణ అయినవారు మందులు అందించి 14రోజుల పాటు హోంఐసోలేషన్‌లో ఉండాలన్నారు. 

మండలంలో 21 కరోనా కేసులు 

ధారూరు: మండలంలోని ధారూరు, నాగసమందర్‌ పీహెచ్‌సీల పరిధిలో 21 కరోనా కేసులు వచ్చాయి. ధారూరు పీహెచ్‌సీలో సోమవారం 75మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా 16మందికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారి రాజు తెలిపారు. ధారూరులో ముగ్గురికి, ఎబ్బనూర్‌లో నలుగురికి, మైలారంలో ఇద్దరికి, పీసీఎం తాండా, బచారం, అంపల్లి, శేరిగడ్డతండా, చింతకుంట, మోమిన్‌కలాన్‌, అవుసుపల్లిలో ఒక్కొక్కరి చొప్పున పాజిటివ్‌ వచ్చినట్లు తెలిపారు. నాగసమందర్‌ పీహెచ్‌సీలో 32మందికి కరోనా పరీక్షలు చేయగా ఐదుగురికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారి రమేశ్‌ బాబు తెలిపారు. నాగసమందర్‌, కేరెల్లి, నర్సాపూర్‌లో ఒక్కొక్కరి చొప్పున, పెద్దేముల్‌ మండలం ఇందోల్‌లో ఇద్దరికి పాజిటివ్‌ వచ్చినట్లు తెలిపారు. 

కొడంగల్‌లో పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు 

కొడంగల్‌: కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావంతో నియోజకవర్గంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. సోమవారం కొడంగల్‌ ప్రభుత్వాసుపత్రిలో నిర్వహించిన కోవిడ్‌ పరీక్షల్లో మండలంలో 15, మున్సిపాలిటిలో 6, బొంరాస్‌పేట్‌ మండలంలో 51 మందికి పరీక్షలు నిర్వహించగా 26, దౌల్తాబాద్‌ మండలంలో 90 మందికి పరీక్షలు నిర్వహించగా 44 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు వివరించారు.


Updated Date - 2021-05-11T05:16:38+05:30 IST