అక్రమ నిర్మాణాల తనిఖీకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టీమ్‌లు

Jun 16 2021 @ 00:00AM
తూప్రాన్‌లో సమీక్ష నిర్వహిస్తున్న కలెక్టర్‌ హరీశ్‌

 తూప్రాన్‌, జూన్‌ 16: మున్సిపల్‌ పరిధిలో అక్రమ నిర్మాణాలను తనిఖీ చేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టీమ్‌లను ఏర్పాటు చేసినట్లు మెదక్‌ జిల్లా కలెక్టర్‌ హరీశ్‌ పేర్కొన్నారు. నిర్మాణాల్లో సెట్‌బ్యాక్‌ పాటించకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బుధవారం తూప్రాన్‌ రెవెన్యూ డివిజన్‌ కార్యాలయంలో గడ పరిధి అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. తహసీల్దారు, పోలీసు ఇన్‌స్పెక్టర్‌, రోడ్లు భవనాలశాఖ ఏఈ, ఫైర్‌ ఆఫీసర్‌తో టీమ్‌లను ఏర్పాటు చేశామన్నారు. మెదక్‌లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన మూడు భవనాలపై చర్యలు తీసుకున్నట్లు వివరించారు. తూప్రాన్‌ పట్టణంలోని ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ను జూలై మొదటి వారంలో, వైకుంఠధామం రెండో వారంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. మనోహరాబాద్‌ రోడ్డును 15 రోజుల్లో పూర్తి చేయాలని రోడ్లు భవనాల శాఖ అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ఇందులో గడ ప్రత్యేక అఽధికారి ముత్యంరెడ్డి, ఆర్డీవో శ్యాంప్రకాశ్‌, అధికారులు పాల్గొన్నారు. తూప్రాన్‌లో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్‌ వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్‌ పనులను కలెక్టర్‌ హరీశ్‌ పరిశీలించారు. మార్కెట్‌ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. కలెక్టర్‌ వెంట మున్సిపల్‌ చైర్మన్‌ బొంది రాఘవేందర్‌గౌడ్‌, మార్కెటింగ్‌ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరు మాధవరెడ్డి ఉన్నారు.  

Follow Us on: