కూలీలకు ఉపాధి భరోసా

ABN , First Publish Date - 2020-12-03T05:44:55+05:30 IST

గ్రామీణ ప్రాంతాల్లో వలసలను నివారించి కూలీలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించింది.

కూలీలకు ఉపాధి భరోసా

 మెదక్‌ జిల్లాలో 2 లక్షల మంది కూలీలకు లబ్ధి

  లాక్‌డౌన్‌తో పెరిగిన సంఖ్య

  2021-22కి గాను గ్రామసభల ద్వారా పనుల ఎంపిక


మెదక్‌ రూరల్‌, డిసెంబరు 2: గ్రామీణ ప్రాంతాల్లో వలసలను నివారించి కూలీలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించింది. కరోనా వైరస్‌ కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో పట్టణాల్లో ఉన్న కూలీలు గ్రామాలకు తరలి వచ్చారు. వారికి ఈ పథకం ద్వారా పని దొరకడంతో భరోసాగా ఉన్నారు. ఉపాధి పథకం ద్వారా గ్రామాల్లో వలసల నివారణతో పాటు పల్లెలను అభివృద్ధి చేసుకునే వీలుంది. ఎలాంటి పనులు చేస్తే గ్రామం అభివృద్ధి చెందుతుందో తెలుసుకుని ప్రజలను భాగస్వాములుగా చేసి గ్రామసభల్లో ప్రణాళికలను రూపొందిస్తున్నారు. గ్రామంలో ఏవిధమైన పనులు చేయాలో ప్రజల అభిప్రాయాలు తీసుకొని తీర్మానం చేసే విధానం గతేడాది నుంచి అమలులోకి వచ్చింది. 


జిల్లాలో 1,68,000 జాబ్‌ కార్డులు


జిల్లాలోని 20 మండలాల్లో 469 పంచాయతీల పరిధిలో 2021-22 సంవత్సరానికి గాను ఉపాధి హామీ పనుల గుర్తింపు, ఎంపిక కోసం గ్రామసభలను నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 1,68,000 జాబ్‌ కార్డులు ఉండగా 3,98,000 మంది ఉపాధి కూలీలు ఉన్నారు. వీరి కోసం గ్రామాల్లో పనుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతున్నది. ఆయా పంచాయతీల్లో సర్పంచ్‌, వార్డు సభ్యులు, కార్యదర్శి, రైతులు, ప్రజలు, ఉపాధి హామీ సిబ్బందితో గ్రామసభలు నిర్వహిస్తారు. జిల్లాలో గత నెలలో ఎన్నికల కోడ్‌ ఉన్నందున గ్రామసభల నిర్వహణ ఆలస్యమైంది. దీంతో ఇప్పటి వరకు జిల్లా స్థాయికి చేరాల్సిన పనుల తీర్మానాలు పూర్తి కాలేదు. జిల్లాలోని సగం గ్రామ పంచాయతీల్లో పనుల ఎంపిక పూర్తి కాగా మిగిలిన గ్రామాల్లో ఎంపిక కొనసాగుతోంది. గ్రామాభివృద్ధికి అవసరమైన పనులకే ఉపాధి హామీ పథకంలో అధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఇందులో శ్మశానవాటిక, ఇంకుడు గుంతలు, పశువుల షెడ్లు, నీటి తొట్ల ఏర్పాటు, పంట కల్లాలు, నర్సరీల ఏర్పాటుతో పాటు చెడ్‌ డ్యాంలు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, ప్రకృతి వనాల ఏర్పాటు, నీటి నిల్వ కుంటలు, కాలువల పూడికతీత, రైతు పొలాల చదును వంటి పనులను గుర్తిస్తున్నారు. పనుల గుర్తింపు ప్రకారం కావాల్సిన బడ్జెట్‌ను మండల, జిల్లా వ్యాప్తంగా తయారు చేసి నిధుల మంజూరుకు ప్రభుత్వానికి నివేదిస్తారు. 


కూలీలకు రూ.85 కోట్ల చెల్లింపు


కరోనా వైరస్‌ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో పట్టణాల్లో ఉన్న కూలీలు గ్రామాలకు తరలి వచ్చారు. దీంతో జాతీయ ఉపాధి హామీ కూలీల సంఖ్య భారీగా పెరిగింది. 2019లో జిల్లాలో 1.42 వేల  మంది కూలీలు ఉండగా వారి సంఖ్య ఈ ఏడాదికి జిల్లాలో 3 లక్షలకు చేరింది. అందులో రెండు లక్షల మంది ప్రస్తుతం ఉపాధి హామీ పనులు చేస్తున్నారు. గతేడాది ప్రారంభంలో 50 వేల మంది వరకు నిత్యం ఉపాధి హామీలో పనులు చేస్తే లాక్‌డౌన్‌తో ఆ సంఖ్య జిల్లాలోని 469 గ్రామాల్లో 80 వేలకు చేరింది. 2019-20లో రూ.53 కోట్లు కూలీ డబ్బులు చెల్లించగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.85 కోట్ల చెల్లించారు.  ఈ సారి ఇంకా పెరగనున్న నేపథ్యంలో అదే విధానంలో పనులు ఎంపిక చేపడుతున్నారు. 


Updated Date - 2020-12-03T05:44:55+05:30 IST