కర్ఫ్యూ సడలించినా.. జాగ్రత్తలు పాటించాల్సిందే

ABN , First Publish Date - 2021-06-20T05:51:23+05:30 IST

కర్ఫ్యూ సడలింపులతో మళ్లీ కరోనా తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా కట్టడిలో భాగంగా గత నెల ఐదు నుంచి కర్ఫ్యూ అమలవుతోంది. ప్రభుత్వం అంచెలంచెలుగా కర్ఫ్యూ వేళలు సడలించడంతో ప్రజలు సాధారణ జీవనానికి అలవాటు పడ్డారు. ప్రజాప్రతినిధులు కూడా మొక్కుబడిగా కొవిడ్‌ నిబంధనలు అమలు చేస్తూ, జనసమీకరణతో ప్రభుత్వ కార్యక్రమాలు యథావిధిగా కానిచ్చేస్తున్నారు.

కర్ఫ్యూ సడలించినా..  జాగ్రత్తలు పాటించాల్సిందే

- లేకుంటే ముప్పు తప్పదు

- వైద్య నిపుణుల హెచ్చరిక

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

కర్ఫ్యూ సడలింపులతో మళ్లీ కరోనా తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా కట్టడిలో భాగంగా గత నెల ఐదు నుంచి కర్ఫ్యూ అమలవుతోంది. ప్రభుత్వం అంచెలంచెలుగా కర్ఫ్యూ వేళలు సడలించడంతో ప్రజలు సాధారణ జీవనానికి అలవాటు పడ్డారు. ప్రజాప్రతినిధులు కూడా మొక్కుబడిగా కొవిడ్‌ నిబంధనలు అమలు చేస్తూ, జనసమీకరణతో ప్రభుత్వ కార్యక్రమాలు యథావిధిగా కానిచ్చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వం సోమవారం నుంచి కేవలం రాత్రి వేళల్లోనే కర్ఫ్యూ అమలు చేయనున్నట్టు ప్రకటించింది. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వెసులుబాటు కల్పించింది. దీంతో కరోనా పాజిటివ్‌ కేసులు మళ్లీ పెరిగిపోయే అవకాశం ఉందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. జాగ్రత్తలు పాటించకపోతే ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. కర్ఫ్యూ ప్రభావంతో జిల్లాలో ప్రస్తుతం కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయి. వారం రోజులుగా రోజుకి 500 లోపే పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. కానీ, మరణాల సంఖ్య మాత్రం రోజుకి 5 నుంచి 9లోపు ఉన్నట్టు అధికారికంగా వెల్లడిస్తున్నారు. వాస్తవ పరిస్థితిని పరిశీలిస్తే మరణాల సంఖ్య ఇంకా రెట్టింపు ఉంటుంది. ఈ నేపథ్యంలో కర్ఫ్యూ వేళలు సడలిస్తే.. కరోనా ముప్పు తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి. 

 

బ్లాక్‌ ఫంగస్‌తో వణుకు...

జిల్లాలో బ్లాక్‌ ఫంగస్‌ కేసులు విజృంభిస్తున్నాయి. కరోనా బారిన పడి స్టెరాయిడ్‌లు, ఇతరత్రా యాంటీబయాటిక్స్‌ వాడకం వల్ల బ్లాక్‌ ఫంగస్‌ వ్యాపిస్తోంది. జిల్లాలో ఇప్పటి వరకు 28 మంది బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రిమ్స్‌లో వీరందరికీ ప్రత్యేక విభాగంలో చికిత్సలు అందజేస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో బ్లాక్‌ ఫంగస్‌ కేసులు కాస్త ఎక్కువగానే ఉన్నా... ఆ వివరాలు వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు చేరడం లేదని తెలిసింది. కన్ను, ముక్కు, నోటిలో ఇన్ఫెక్షన్‌ రూపంలో కరోనా నుంచి కోలుకున్న అనేక మందిపై బ్లాక్‌ఫంగస్‌ దాడి చేస్తోంది. దీంతో పాటు పోస్టు కొవిడ్‌ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. కరోనా సోకి కోలుకున్న అనేకమంది నీరసించిపోయి శ్వాసకోస, గుండె జబ్జులు, షుగర్‌, బీపీ, మూత్రపిండాల వ్యాధులతో మళ్లీ ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యవర్గాలు, అధికారులు సూచిస్తున్నారు. కర్ఫ్యూ వేళలు సడలించినా.. జాగ్రత్తలు పాటిస్తూనే ఉండాలని స్పష్టం చేస్తున్నారు.  

 

కరోనాతో మరో ముగ్గురి మృతి

జిల్లాలో కరోనా లక్షణాలతో శనివారం మరో ముగ్గురు మృతిచెందారు. మృతుల సంఖ్య 690కి చేరింది. శనివారం 5,659 మందికి కరోనా పరీక్షలు చేయగా, 245 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. పాజిటివ్‌ బాధితుల సంఖ్య 1,16,706కి చేరింది. వీరిలో చాలామంది కోలుకున్నారు. తాజాగా శనివారం 277మంది బాధితులు డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 4,509 ఉన్నాయి. హోం ఐసోలేషన్‌లో 3,761 మంది, కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో 263 మంది, కొవిడ్‌ ఆస్పత్రుల్లో 485 మంది చికిత్స పొందుతున్నారు. 


 నేడు మెగా వ్యాక్సినేషన్‌

జిల్లాలో ఆదివారం మెగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ తెలిపారు. మండల స్థాయి అధికారులు, మునిసిపల్‌ కమిషనర్లు, ప్రత్యేకాధికారులు, వైద్యాధికారులతో  శనివారం టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకు వ్యాక్సినేషన్‌ కొనసాగుతుందన్నారు. 252 గ్రామ సచివాలయాలు, 48వార్డు సచివాయాల పరిధిలో 90వేల మందికి కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ వేసేందుకు లక్ష్యంగా నిర్ణయించామని చెప్పారు. దీనికోసం అధికారులు, సిబ్బందిని ఏర్పాటు చేశామని తెలిపారు. 45 ఏళ్లు దాటిన వారికి, ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులకు మొదటి డోస్‌, హెల్త్‌ వర్కర్లు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, ఇతరులకు రెండో డోస్‌ వేయాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. విదేశాలకు వెళ్లేవారు సంబంధిత ధ్రువపత్రాలను చూపించి శ్రీకాకుళం పట్టణంలో దమ్మలవీధి అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో టీకా తీసుకోవచ్చని డీఎంహెచ్‌వో చంద్రానాయక్‌ వెల్లడించారు.  

Updated Date - 2021-06-20T05:51:23+05:30 IST