లక్ష్యం చేరుకునేందుకు.. కు.ని.కి పాట్లు

ABN , First Publish Date - 2020-11-29T04:49:16+05:30 IST

జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎనిమిది నెలలుగా కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు నిలిచిపోయాయి. గతంలో పూర్తిస్థాయిలో నిర్వహించే ఆపరేషన్లను ప్రస్తుతం కరోనా కారణంగా ఆపేశారు. దీంతో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది చేసేది లేక ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో వేలాది రూపాయలు చెల్లించి ఆపరేషన్లు చేయించుకుంటున్నారు.

లక్ష్యం చేరుకునేందుకు..   కు.ని.కి పాట్లు
శ్రీకాకుళంలోని సర్వజన ఆస్పత్రి


 నిలిచిన కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు

 కరోనా వ్యాప్తి కారణంగా బ్రేక్‌

ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న ప్రజలు

(రాజాం)

జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎనిమిది నెలలుగా కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు నిలిచిపోయాయి. గతంలో పూర్తిస్థాయిలో నిర్వహించే ఆపరేషన్లను ప్రస్తుతం  కరోనా కారణంగా ఆపేశారు. దీంతో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది చేసేది లేక ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో వేలాది రూపాయలు చెల్లించి ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. మరోవైపు అధికారులు లక్ష్యానికి దూరమవుతున్నారు. జిల్లాలో 83 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 15 కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు,  రెండు ఏరియా ఆసుపత్రులు, ఒక జిల్లా ఆసుపత్రి ఉన్నాయి. వీటి పరిధిలో ఏటా 16 వేల కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు జరగాల్సి ఉంది. ఈ ఏడాది కరోనా కారణంగా ఇంతవరకు 1,924 ఆపరేషన్లు మాత్రమే అయ్యాయని జిల్లా అధికారులు చెబుతున్నారు. అక్టోబరు నాటికి 9,333 శస్త్ర చికిత్సలు పూర్తి చేయాల్సి ఉండగా... కేవలం 1,924 ఆపరేషన్లు మాత్రమే నిర్వహించారు. దీంతో 20.61 శాతం మాత్రమే లక్ష్యం నెరవేరింది. నవగాం, నిమ్మాడ, బొంతు, మాణిక్యపురం, వెంకటాపురం పీహెచ్‌సీల్లో కు.ని. శస్త్ర చికిత్సలు పూర్తిగా నిర్వహించడం లేదు. ఈ ఆస్పత్రులకు సొంత భవనాలు లేకపోవడంతో ఆపరేషన్లు ఆపేశారు. గత ఏడాది కూడా 16 వేలు లక్ష్యం కాగా, 7,839 మాత్రమే పూర్తి చేశారు. గతంలో బిడ్డ జన్మించిన వెంటనే కుటుంబ నియంత్రణ ఆపరేషన చేసేవారు. ఈ ఏడాది ఆ పరిస్థితి కనిపించకపోవడంతో పేదలు ఆపరేషన్లు చేయించుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంలో జిల్లా అధికారులు చర్యలు తీసుకొని కొన్ని పీహెచ్‌సీలకైనా కు.ని. ఆపరేషన్ల నిర్వహణకు అనుమతులు మంజూరు చేయాలని ప్రజలు కోరుతున్నారు


 కరోనాతో లక్ష్యం చేరుకోలేకపోయాం

ఈ ఏడాది కరోనా కారణంగానే కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సల లక్ష్యం చేరుకోలేకపోయాం. కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆపరేషన్లు జరు గుతున్నాయి. కరోనా వైరస్‌ తగ్గుముఖం పడితే అన్ని పీహెచ్‌సీల్లో  పూర్తిస్థాయిలో కు.ని. శస్త్ర చికిత్సలకు ఆదేశాలు జారీ చేస్తాం.  

- డాక్టర్‌ చంద్రనాయక్‌,  జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి 



Updated Date - 2020-11-29T04:49:16+05:30 IST