గోవిందప్ప (ఫైల్‌ఫొటో)
గంగవరం, జనవరి 17 : నా అన్నవాళ్లు ఉన్నా బాగోగులు చూసేవారు లేరన్న మనస్తాపంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన గంగవరం మండలంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు... చిన్నూరు గ్రామానికి చెందిన గోవిందప్ప(65)కు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. పిల్లలందరికీ పెళ్లిళ్లు చేయడంతో వృత్తిరీత్యా బెంగళూరులో ఉంటున్నారు. గోవిందప్ప భార్యతో కలిసి గ్రామంలో ఉంటూ వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా గోవిందప్ప బీపీ, షుగర్‌తోపాటు గుండెజబ్బుతో బాధపడుతున్నాడు. ఇంటిపనులు, వ్యవసాయ పనులు చూసుకుంటూనే ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నాడు. కన్నబిడ్డలు ఉన్నా వైద్యం చేయించడానికి ఎవరూ దగ్గర్లో అందుబాటులో లేరన్న మనస్థాపంతో సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. వెంటనే గమనించిన స్థానికులు పలమనేరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుధాకర్‌రెడ్డి తెలిపారు.