ఫీజు కట్టాల్సిందే!

ABN , First Publish Date - 2021-05-24T05:12:41+05:30 IST

కొవిడ్‌తో ఉపాధి కరువై ప్రజలు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటుంటే...మరోవైపు ప్రైవేటు పాఠశాలల యాజమన్యాలు ఫీజుల కోసం తల్లిదండ్రులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. అది కూడా గతించిన విద్యాసంవత్సరానికి (2020-21) కావడం గమనార్హం.

ఫీజు కట్టాల్సిందే!


ప్రైవేటు, కార్పొరేటు స్కూళ్ల ఒత్తిడి

ఫోన్లు..మెసేజ్‌లతో తల్లిదండ్రులకు అవస్థలు

తరగతులు నిర్వహించింది నాలుగు నెలలే..

మొత్తం ఫీజు కట్టాలని హుకుం

స్పష్టతనివ్వని ప్రభుత్వం

చితికిపోతున్న పేద, మధ్య తరగతి కుటుంబాలు

(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి) 

ఓవైపు కొవిడ్‌ విజృంభణతో సామాన్య, మధ్య తరగతి జనం ఇళ్లూ..ఒళ్లు గుల్ల చేసుకుంటున్నారు. మందుల కోసం...సరైన ఆహారం కోసం పడరాని పాట్లు పడుతున్నారు. అప్పుల పాలవుతున్నారు. మరోవైపు పాఠాలు చెప్పకుండానే... తరగతి గదుల్లో పిల్లలు కూర్చోకుండానే... కొన్ని ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల యాజమాన్యాలు ఫీజుల కోసం తల్లిదండ్రులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. దాదాపు ప్రతి ఇంట్లోనూ ఒకరో ఇద్దరో బాధితులు ఉంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఫీజులు చెల్లించడం తలకు మించిన భారమవుతోంది. అదే సమయంలో సెలవుల్లో ఆన్‌లైన్‌ క్లాస్‌ల పేరుతోనూ వసూళ్లకు తెరతీస్తున్నారు. గత ఏడాది సరిగా పాఠాలు చెప్పకపోయినా తల్లిదండ్రులు ఫీజులు చెల్లించక తప్పలేదు. ఇప్పుడు బకాయిల పేరుతోనూ... ఆన్‌లైన్‌ పేరుతోనూ ఒత్తిడి తెస్తుండడంతో తల్లిదండ్రులు ఇరుకున పడుతున్నారు. ఇంతా చేస్తే అధికశాతం యాజమాన్యాలు సిబ్బందికి జీతాలు ఇవ్వకపోవడం గమనార్హం. 


 కొవిడ్‌తో ఉపాధి కరువై ప్రజలు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటుంటే...మరోవైపు ప్రైవేటు పాఠశాలల యాజమన్యాలు ఫీజుల కోసం తల్లిదండ్రులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. అది కూడా గతించిన విద్యాసంవత్సరానికి (2020-21) కావడం గమనార్హం. కొవిడ్‌ ఉధృతి నేపథ్యంలో విద్యాసంస్థలు, పాఠశాలలు మూతపడ్డాయి. సెకెండ్‌ వేవ్‌లో కేసులు పెరుగుతుండడంతో నెల రోజుల కిందటి నుంచే సెలవులిచ్చారు. 6 నుంచి 9 తరగతుల విద్యార్థులకు పైతరగతులకు ప్రమోట్‌ చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. పది, ఇంటర్‌ పరీక్షలను సైతం వాయిదా వేశారు. జాతీయ స్థాయిలో పోటీ పరీక్షలను సైతం నిలిపివేశారు. ఇటువంటి విపత్కర సమయంలో కొన్ని ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు సరికొత్త దోపిడీకి తెరదీశాయి. ఆన్‌లైన్‌ బోధన పేరిట ఫీజుల వసూలుకు ప్రయత్నిస్తున్నాయి. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఫీజులు కట్టాలని ఫోన్‌లకు మెసేజ్‌లు పంపిస్తుండడంతో పాటు... నేరుగా తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి ఒత్తిడి తెస్తున్నారు. ఏం చేయాలో వారికి పాలుపోవడం లేదు. ప్రస్తుతం ఉపాధి లేకపోవడంతో సామాన్య, మధ్య తరగతికి చెందిన వారు తాము ఫీజు కట్టలేమని తెగేసి చెబుతున్నారు. కొందరైతే పిల్లల భవిష్యత్‌ దృష్ట్యా కొంత మొత్తాన్ని చెల్లిస్తున్నారు. 


ఇదీ పరిస్థితి

జిల్లాలో 500కుపైగా ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. గత ఏడాది కరోనా వ్యాప్తితో మార్చి 22 నుంచి లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి పాఠశాలలు మూతపడ్డాయి. పదో తరగతి పరీక్షలు సైతం రద్దయ్యాయి. కరోనా కేసుల ఉధృతి నేపథ్యంలో విద్యాసంవత్సరం ప్రారంభంలో తీవ్ర జాప్యం జరిగింది. నవంబరు 5న తొమ్మిది, పది తరగతులు ప్రారంభమయ్యాయి. డిసెంబరు 14న ఎనిమిదో తరగతి, జనవరి 18న ఆరు, ఏడు తరగతులను ప్రారంభించారు. ఫిబ్రవరి 1న ఒకటి నుంచి ఐదు తరగతులు ప్రారంభమయ్యాయి. సెకెండ్‌ వేవ్‌లో భాగంగా ఏప్రిల్‌ తొలివారం నుంచి కరోనా కేసులు పెరగడంతో ప్రభుత్వం విద్యాసంస్థలను మూసివేసింది. పది, ఇంటర్‌ పరీక్షలను సైతం వాయిదా వేసింది.

 

ఆన్‌లైన్‌ పేరుతో...

లాక్‌డౌన్‌ భయంతో కొన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ముందుగానే ఫీజులు వసూలు చేశాయి. గత ఏడాది జూలై, ఆగస్టు నుంచే ఆన్‌లైన్‌ క్లాస్‌ల పేరుతో ఫీజుల దందా మొదలు పెట్టాయి. పొరపాటున ఎవరైనా సమయానికి ఫీజు చెల్లించలేకపోతే పాస్‌వర్డ్‌ ఇవ్వకుండా, ఆన్‌లైన్‌ తరగతులకు అనుమతించకుండా ఇబ్బంది పెట్టాయి. దీంతో తల్లిదండ్రులు కరోనా కష్టకాలంలో అప్పులు చేసి మరీ ఫీజులు చెల్లించిన ఉదంతాలు ఉన్నాయి. ఆ తరువాత కూడా అదే దందా సాగించాయి.


ముందుగానే వసూళ్లు

గత ఏడాది నవంబరు, డిసెంబరులోనే అధిక శాతం ఫీజులు వసూలు చేసేశాయి. జనవరిలో ప్రభుత్వం అమ్మఒడి నగదు వేసినప్పుడే తల్లిదండ్రుల నుంచి ముక్కుపిండి వసూలు చేశాయి. విద్యాబోధన ప్రారంభించి పట్టుమని నాలుగు నెలలు పూర్తికాకున్నా ఏడాది మొత్తానికి ఫీజు వసూలు చేసిన ఉదంతాలున్నాయి. వాస్తవానికి ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. కేవలం ఫీజులో 70 శాతం వసూలు చేయాలని సూచించింది. సాధారణంగా ట్యూషన్‌ ఫీజు ప్రతి మూడు నెలలకు ఒకసారి వసూలు చేయాలి. గత నెల సెలవులు ప్రకటించే నాటికి ప్రాథమిక తరగతులు ప్రారంభించి సుమారు 80 రోజులే అయ్యింది. ఆరు, ఏడు తరగతుల వారికి 96 రోజులు పూర్తయ్యింది. ఎనిమిది, తొమ్మిది, పది తరగతులకు మాత్రం నాలుగు నెలలు దాటింది. మూడు నెలల ఫీజుల వసూలును ప్రామాణికంగా తీసుకోకుండా...విద్యాసంవత్సరాన్ని పూర్తిగా పరిగణనలోకి తీసుకోకుండా కొన్ని యాజమాన్యాలు ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇప్పుడు ఆన్‌లైన్‌ తరగతులంటూ మభ్యపెడుడుతున్నాయి. తరగతులు నిర్వహించకపోయినా ఫీజుల కోసం ఒత్తిడి చేస్తున్నాయి.


నిర్వహణే లేని సమయంలో..

ప్రస్తుతం అన్ని పాఠశాలలు మూతపడ్డాయి. తరగతి గదులకు తాళం వేశారు. ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది కూడా లేరు. తమకు వేతనాలు అందడం లేదని ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వమే భృతి అందించాలని కోరుతున్నారు. అటు ఉపాధ్యాయులకు జీతాలు అందించక...ఇటు పాఠశాలల్లో కనీస నిర్వహణ ఖర్చులు లేవు. ఈ సమయంలో  ఫీజులు వసూలు చేస్తుండడం విస్మయం పరుస్తోంది. కొన్ని యాజమాన్యాలైతే ఫీజులు కడితేనే మీకు ఆన్‌లైన్‌ తరగతులకు పాస్‌వర్డ్‌ ఇస్తామని   బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నారు. కొందరు తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్‌ దృష్ట్యా ఫీజులు చెల్లించి పాస్‌వర్డ్‌ పొందుతున్నారు. ఈ విషయంలో మిగతా విద్యార్థుల తల్లిదండ్రుల్లో సందిగ్ధత నెలకొంది. చిరుద్యోగులు, ఉపాధి లేక సతమతమవుతున్న కార్మిక కుటుంబాలు మాత్రం వెనుకడుగు వేస్తున్నారు. అధికారులు కూడా ఫీజుల విషయంలో స్పష్టత ఇవ్వడం లేదు. అసలు చెల్లించాలో...లేదో స్పష్టత ఇవ్వడం లేదు. ఈ విషయంలో ప్రైవేటు యాజమాన్యాల ఒత్తిళ్లు అధికారులపై ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు...   విద్యార్థుల తల్లిదండ్రుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని కోరుతున్నారు. ఇప్పటికే చెల్లించిన మొత్తాన్ని సరిపెట్టుకునేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.


ఒత్తిడిచేస్తే చర్యలు

ప్రస్తుతం పాఠశాలలు మూతపడ్డాయి. ఈ సమయంలో ఫీజుల వసూలు చేయడం నిబంధనలకు విరుద్ధం. ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణ విషయంలో కచ్చితంగా నిబంధనలు పాటించాలి. ఎక్కడైనా ఫీజుల కోసం తల్లిదండ్రులకు ఒత్తిడి చేస్తే అధికారులకు నేరుగా ఫిర్యాదు చేయాలి. 

-పగడాలమ్మ, ఇన్‌చార్జి డీఈవో



Updated Date - 2021-05-24T05:12:41+05:30 IST