అన్నదాతపై ఎరువుల పిడుగు

ABN , First Publish Date - 2022-01-23T04:43:21+05:30 IST

రైతులపై ఎరువుల రూపంలో మరో అదనపు భారం పడింది. ఇప్పటికే ధరలు ఆకాశాన్ని అంటగా.. మరోసారి వాటి ధరలను పెంచుతూ కంపెనీలు నిర్ణయం తీసుకోవడం అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తున్నది.

అన్నదాతపై ఎరువుల పిడుగు

సిద్దిపేట అగ్రికల్చర్‌, జనవరి 22:  రైతులపై ఎరువుల రూపంలో మరో అదనపు భారం పడింది. ఇప్పటికే  ధరలు ఆకాశాన్ని అంటగా.. మరోసారి వాటి ధరలను పెంచుతూ కంపెనీలు నిర్ణయం తీసుకోవడం అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తున్నది.  గిట్టు బాటు ధర లేక అల్లాడుతున్న రైతులపై ఎరువుల ధరలు దరువు వేస్తున్నాయి. ప్రతీ సీజన్‌లో జిల్లా రైతులు పంటల సాగు కోసం 52 వేల మెట్రిక్‌ టన్నులకు పైగా కాంప్లెక్స్‌ ఎరువులను వినియోగిస్తున్నారు. ఈ కాంప్లెక్స్‌ ఎరువుల ధరల పెంపుతో జిల్లా రైతులకు ఏటా రూ.100 కోట్లకు పైగా అదనపు భారం పడే అవకాశం ఉంది. ఎరువుల ధరలు పెంచడంతో సాగు చేయలేని పరిస్థితి ఎదురవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎరువుల ధరలను తగ్గించాలని అన్నదాతలు డిమాండ్‌ చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో వానాకాలం, యాసంగి సీజన్లలో సుమారు 2.70 లక్షల మందికి పైగా రైతులు లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తుంటారు. వానాకాలం సీజన్‌లో దాదాపు ఐదు లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతుండగా యాసంగి సీజన్‌లో సుమారు మూడు లక్షల ఎకరాల వరకు పంటలు సాగు చేస్తుంటారు. రెండు సీజన్లు కలుపుకొని 8లక్షల ఎకరాల పైగానే పంటలు సాగవుతున్నాయి. ఈ పంటలకు తగ్గట్టుగా ప్రతీ సీజన్‌లో సుమారు 1.40 లక్షల మెట్రిక్‌ టన్నుల వివిధ రకాల ఎరువులు రైతులు వినియోగిస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇందులో 49వేల మెట్రిక్‌ టన్నులు యూరియానే వినియోగిస్తున్నారు. మిగతా 52 వేల మెట్రిక్‌ టన్నుల వరకు కాంప్లెక్స్‌ ఎరువులను వినియోగిస్తున్నారు. డీఏపీ 27 వేల మెట్రిక్‌ టన్నులు, 10 వేల మెట్రిక్‌ టన్నుల పొటాష్‌ ను వినియోగిస్తున్నారు. కాంప్లెక్స్‌ ఎరువుల్లో నత్రజని, భాస్వరం, పొటాష్‌, సల్ఫర్‌ ఉంటాయి. వరి, పత్తి, మొక్కజొన్న, కందులు, మినుములు, కూరగాయల, ఇతర పంటలకు ఈ ఎరువులను వినియోగిస్తున్నారు. ప్రస్తుతానికి యూరియా, డీఏపీ ధరల్లో ఎలాంటి మార్పులు లేకపోయినా ఇతర కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు మాత్రం 50 కిలోల బస్తాకు రూ.125నుంచి దాదాపు రూ.500 వరకు పెరిగాయి. దీంతో ఎకరాకు ఒక్కో రైతుకు గాను సుమారు రూ.4 వేలకు పైగానే భారం పడనుంది.


సగానికి పైగా పెట్టుబడి ఎరువులకే


జిల్లాలో వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఎక్కువ. పంటల సాగులో ఎక్కువగా ఎరువులు, పురుగుల మందులను రైతులు వినియోగిస్తున్నారు. పంటలకు ఎక్కువగా డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువులను వాడుతున్నారు.  ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు. పైగా ఆశతో పెట్టిన పంటల సాగుకోసం పెట్టిన పెట్టుబడిరాక అప్పు లే మిగులుతున్నాయి. పం ట సాగులో పెట్టుబడు లు, ఎరువులకే ఎక్కు వ ఖర్చు చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రకాల పథకాలతో పెట్టుబడి సహాయం అందిస్తున్నా ఏటా పెరుగుతున్న ఎరువుల ధరలకే సరిపోతున్నాయి.


Updated Date - 2022-01-23T04:43:21+05:30 IST