నిరుపయోగంగా చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం

ABN , First Publish Date - 2020-12-01T05:52:58+05:30 IST

చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో ఓ వైపు ఉచితంగా చేప పిల్లలను వదులుతూ మత్స్యకారులకు ఉపాధి కల్పిస్తున్న ప్రభుత్వం మరోవైపు చేప పిల్లల విత్తనోత్సత్తి కేంద్రాల నిర్మాణాలను చేపట్టింది.

నిరుపయోగంగా చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం
చేప పిల్లల పెంపకం కోసం నిర్మించిన తొట్లు

రూ.5.29 కోట్ల వ్యయంతో నిర్మాణం పూర్తి

వినియోగంలోకి తీసుకురావడంలో జాప్యం


సంగారెడ్డి టౌన్‌, నవంబరు 30 : చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో ఓ వైపు ఉచితంగా చేప పిల్లలను వదులుతూ మత్స్యకారులకు ఉపాధి కల్పిస్తున్న ప్రభుత్వం మరోవైపు చేప పిల్లల విత్తనోత్సత్తి కేంద్రాల నిర్మాణాలను చేపట్టింది. అయితే అధికారులు, పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఆశించిన స్థాయిలో సత్ఫలితాలు ఇవ్వడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన ఈ కేంద్రాలను వినియోగంలోకి తీసుకు రావడంలో జాప్యం చేస్తున్నారు. దీంతో సంగారెడ్డి సమీపంలోని కల్పగూర్‌ శివారులో మంజీర నది ఒడ్డున  నిర్మించిన చేపపిల్లల విత్తనోత్పత్తి కేంద్రం మూడేళ్లుగా నిరుపయోగంగానే ఉన్నది.


పనులు పూర్తయినా ప్రారంభానికి నోచుకోని వైనం

కల్పగూర్‌ శివారులోని మంజీరా రిజర్వాయర్‌ వద్ద చేప పిల్లల విత్తనోత్పత్తి కేంద్రానికి ప్రభుత్వం 2017లో రూ.5.29 కోట్లను మంజూరు చేసింది. మత్స్య పరిశ్రమ అభివృద్ధి పథకం కింద రూ.5.29 కోట్లు మంజూరు కాగా 22 ఫిబ్రవరి 2017న అప్పటి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ చేపపిల్లల విత్తనోత్పత్తి కేంద్రం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 2018లో సదరు కాంట్రాక్టర్‌ పనులను పూర్తి చేశారు. ఇందుకు సంబంధించి పనులన్నీ పూర్తయి దాదాపు మూడేళ్లు అవుతున్నప్పటికీ చేపపిల్లల విత్తనోత్పత్తి కేంద్రాన్ని వినియోగంలోకి తీసుకురావడం లేదు. ప్రారంభోత్సవానికి రాజకీయ గ్రహణం పట్టినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే గత ఎమ్మెల్యే శంకుస్థాపన చేసిన కేంద్రాన్ని ప్రారంభించేందుకు ప్రస్తుత ఎమ్మెల్యే ఆసక్తి చూపడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 


పాత వాటికి మరమ్మతులు కరువు

చేపపిల్లల విత్తనోత్పత్తి కేంద్రంలో నూతనంగా ఓ భవనంతో పాటు 81 చేపపిల్లల తొట్లు నిర్మించారు. అలాగే బోరుబావి, పైపులైన్‌, మంచినీటి ట్యాంకును నిర్మించి, రహదారిని పునరుద్ధరించారు. అయితే ఇక్కడే గతంలో నిర్మించిన 37 తొట్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. వాటికి చిన్న చిన్న మరమ్మతులు చేస్తే వినియోగంలోకి వచ్చే అవకాశం ఉన్నది. కొత్తగా నిర్మించిన 81 తొట్లతో పాటు మత్స్యకార్మికులకు శిక్షణనిచ్చేందుకు నిర్మించిన భవనం సైతం నిరుపయోగంగా మారింది. ఇప్పటికైనా మత్స్యకారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చేపపిల్లల విత్తనోత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించి పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని గంగపుత్రులు కోరుతున్నారు.



Updated Date - 2020-12-01T05:52:58+05:30 IST