50 ఎకరాల చెరువుల్లో చేపలు మృత్యువాత

ABN , First Publish Date - 2021-03-01T06:08:20+05:30 IST

గోపవరం జీజీఎస్‌ పరిధిలోని జగ్గరాజుపేట ఓఎన్జీసీ సైట్‌ను ఆనుకుని ఉన్న 50 ఎకరాల చెరువుల్లో చేపలు మృత్యువాత పడ్డాయి.

50 ఎకరాల చెరువుల్లో చేపలు మృత్యువాత
చెరువులో చనిపోయి తేలుతున్న చేపలు

 ఓఎన్జీసీ రసాయనాలే కారణమని రైతుల ఆందోళన

 ఎకరాకు రూ.రెండు లక్షల డిమాండ్‌

 నిజనిర్ధారణ అనంతరం పరిహారం చెల్లించేందుకు ఓఎన్జీసీ అంగీకారం

ఉప్పలగుప్తం, ఫిబ్రవరి 28: గోపవరం జీజీఎస్‌ పరిధిలోని జగ్గరాజుపేట ఓఎన్జీసీ సైట్‌ను ఆనుకుని ఉన్న 50 ఎకరాల చెరువుల్లో చేపలు మృత్యువాత పడ్డాయి. సైట్‌ నుంచి విడుదల చేసిన వ్యర్ధ రసాయన జలాలే కారణమంటూ రైతులు ఆదివారం ఆందోళనకు దిగారు. సైట్‌లో ముడిచమురు పాక్షిక శుద్ధి ప్రక్రియలో వెలువడే వ్యర్ధ జలాలను లోపల రిజర్వాయర్‌లో నిల్వ చేసి వేరే ప్రాంతాలకు తరలిస్తారు. ఇటీవల రిజర్వాయర్‌ నుంచి తరచూ నీరు సైట్‌ పక్కనే ఉన్న పంటకాల్వలోకి లీకేజీ అవుతోందని రైతులు చెబుతున్నారు.  ఓఎన్జీసీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారంటున్నారు. ఈ నెల 26, 27 తేదీల్లో రాత్రి సమయంలో నీటిని పంటకాల్వలోకి విడిచిపెట్టారని, ఫలితంగా 50 ఎకరాల చెరువుల్లోని చేపలు, రొయ్యలు చనిపోయాయని ఆరోపిస్తూ సైట్‌ ఎదుట ఆందోళన చేపట్టారు. ఓఎన్జీసీ ఐఎం జగన్నాథరావు, ఎస్‌ఐ జి.వెంకటేశ్వరరావు రైతులతో చర్చించి ఆందోళన విరమింపజేశారు. రైతులతో కలిసి ఐఎం పంట కాల్వను, చేపల చెరువులను పరిశీలించారు. చేపలు తేలిపోతున్న వైనాన్ని గమనించారు. రొయ్యలు చెరువు మట్టుకు చేరుకుంటాయని రైతులు వివరించారు. ఇసుకపట్ల రఘుబాబు, అల్లూరి రమేష్‌రాజు ఆధ్వర్యంలో రైతులు ఎకరాకు రెండు లక్షల రూపాయలు డిమాండ్‌ చేశారు. తక్షణమే వ్యర్ధజలాల లీకేజీని నివారించి, పంట కాల్వలోని నీటిని పూర్తిగా తొలగించాలని విజ్ఞప్తి చేశారు. పంటకాల్వపై ఏర్పాటు చేసిన పైప్‌లైన్‌ తొలగించాలని డిమాండ్‌ చేశారు. రెండు రోజుల్లో నిపుణుల బృందం కాలుష్య జలాలపై అధ్యయనం చేస్తుందని, వారి నివేదిక ఆధారంగా నష్టపరిహారం చెల్లిస్తామని, మిగిలిన సమస్యలను సత్వరం పరిష్కరిస్తామని ఐఎం హామీ ఇవ్వడంతో రైతులు అంగీకరించారు. ఎస్‌.వెంకట జగన్నాఽథరాజు, ఆకుల చంటి, నార్ని సత్యనారాయణ, కుసుమ వెంకన్న, యరగర్త వెంకటేశ్వరరావు, దంగేటి బాబులు, వీఆర్వో మహదశ శ్రీరామ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-01T06:08:20+05:30 IST