రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి పెట్టాలి:కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-06-29T07:15:54+05:30 IST

జిల్లావ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి ఆదేశించారు.

రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి పెట్టాలి:కలెక్టర్‌
వాల్‌పోస్టర్లు ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ తదితరులు

తిరుపతి(కొర్లగుంట), జూన్‌ 28: జిల్లావ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో తన అధ్యక్షతన జరిగిన జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమీక్షలో ఆయన ప్రసంగించారు. జిల్లాలో బ్లాక్‌ స్పాట్స్‌ జాతీయ రహదారుల్లో 102, రాష్ట్ర రహదారుల్లో 29 ఉన్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. ప్రతి బ్లాక్‌స్పాట్‌ వద్ద ప్రమాదాల నివారణకు తక్షణమే చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. గత సమావేశంలో నిర్దేశించిన తాత్కాలికంగా లైట్ల ఏర్పాటు, జంక్షన్ల వద్ద అండర్‌పాస్‌ నిర్మాణం, కలెక్టరేట్‌ వద్ద సర్వీసు రోడ్డు ఏర్పాటు వంటి అంశాలపై దృష్టిపెట్టాలన్నారు. రేణిగుంట-నాయుడుపేట రోడ్డు ఎన్‌హెచ్‌-71మార్గంలో గుంతలకు మరమ్మతులు చేపట్టామని హైవే అధికారులు తెలియజేయగా.. భాకరాపేట ఘాట్‌లో గుర్తించిన బ్లాక్‌ స్పాట్స్‌ వద్ద పనులు పటిష్ఠంగా ఉండాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గుడ్‌ సమారిటన్‌ స్కీమ్‌ కింద రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారి ప్రాణాలను గోల్డెన్‌ హవర్‌లో ఆస్పత్రికి తరలించి.. కాపాడిన వారికి ప్రోత్సాహకంగా రూ.5వేలను ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా రవాణాధికారి సీతారామిరెడ్డి మాట్లాడుతూ.. ఇంజనీరింగ్‌, పోలీసు, రవాణా, హెల్త్‌ అధికారులతో పూర్తిస్థాయిలో రహదారి భద్రతపై దృష్టిపెట్టేలా లీడ్‌ ఏజెన్సీ ఏర్పాటు చేయనున్నట్లు నివేదించారు. ప్రమాదాలు జరిగిన వివరాలను సంబంధిత శాఖలు తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఐసీ వారి ఐరాడ్‌ యాప్‌లో నమోదు చేయడంలో జిల్లా పురోగతిలో ఉందని వివరించారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి, వలంటీర్లకు ఎన్జీవోలకు వీటిపై మూడు దశలలో వర్చువల్‌ విధానం ద్వారా అవగాహన కల్పించామన్నారు. ఎస్పీ పరమేశ్వరరెడ్డి మాట్లాడుతూ గాదంకి, ఎస్వీపురం టోల్‌ప్లాజాల వద్ద  డ్రైవర్లు వాహనాలు నిలుపుకోవడానికి, ముఖం శుభ్రం చేసుకోవడానికి వీలుగా అక్కడి మేనేజర్లు ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. అనంతరం రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా ముద్రించిన వాల్‌పోస్టర్లు  ఆవిష్కరించారు. నగర పాలక సంస్థ కమిషనర్‌ అనుపమ అంజలి, డీఆర్వో శ్రీనివాసరావు, బర్డు ఆస్పత్రి డైరెక్టర్‌ రెడ్డెప్పరెడ్డి, డీపీవో రూపేంద్రనాథ్‌రెడ్డి, డీఎంహెచ్‌వో శ్రీహరి, ఆర్‌అండ్‌బీ అఽధికారి సుధాకర్‌రెడ్డి, ఎన్‌హెచ్‌ 71పీడీ హరికృష్ణ, మెగా ఇంజనీరింగ్‌ నుంచి మల్లికార్జున, ప్రజారవాణాధికారి చెంగల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-29T07:15:54+05:30 IST