దొంగలెవరు..? శ్రీగంధం చెక్కల మాయం వెనుక హస్తమెవరిది..?

ABN , First Publish Date - 2022-01-18T06:37:57+05:30 IST

పెనుకొండ అటవీశాఖ కార్యాలయంలో శ్రీగంధం చెక్కలు మా యమవడం సంచలనం రేకెత్తిస్తోంది. కార్యాలయంలో భద్రపరచిన రూ.కోట్లు విలువచేసే శ్రీగంధం చెక్కలను తరలించిన స్మగ్లర్లు ఎవరై ఉంటారన్న ప్రశ్న అందరి మదిలోనూ తలెత్తుతోంది.

దొంగలెవరు..? శ్రీగంధం చెక్కల మాయం వెనుక హస్తమెవరిది..?

కోర్టు ఆదేశించినా తరలింపులో జాప్యమెందుకు..?

రూ.కోట్లు కొల్లగొట్టేందుకేనా...?

అటవీశాఖ అధికారుల తీరుపై రేకెత్తుతున్న అనుమానాలు

అనంతపురం, జనవరి17 (ఆంధ్రజ్యోతి)

పెనుకొండ అటవీశాఖ కార్యాలయంలో శ్రీగంధం చెక్కలు మా యమవడం సంచలనం రేకెత్తిస్తోంది. కార్యాలయంలో భద్రపరచిన రూ.కోట్లు విలువచేసే శ్రీగంధం చెక్కలను తరలించిన స్మగ్లర్లు ఎవరై ఉంటారన్న ప్రశ్న అందరి మదిలోనూ తలెత్తుతోంది. అటవీశాఖ కార్యాలయంలో పకడ్బందీగా భద్రపరిచిన శ్రీగంధపు చెక్కలతోపాటు శ్రీగంధపు నూనె డబ్బాలను తిరుపతి హెడ్‌ క్వార్టర్స్‌కు తరలించారని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా... తరలింపులో జాప్యం వెనుక మతలబేమిటో అర్థం కావడం లేదు. రూ.కోట్లు కొల్లగొట్టడానికే జాప్యం చేస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీగంధం చెక్కలు మాయం వెనుక హస్తం ఎవరిదై ఉంటుందన్న చర్చ జోరుగా సాగుతోంది. ఈ వ్యవహారంలో అటవీశాఖ అధికారుల వ్యవహారశైలి అనుమానాలకు తావిస్తోంది. కోర్టు ఆదేశాలను పాటించకపోగా... రూ.కోట్లు విలువ చేసే శ్రీగంధపు చెక్కలను కార్యాలయంలో భద్రపరిచిన నేపథ్యంలో... అత్యంత పకడ్బందీగా భద్రతా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఆ శాఖ అధికారులపై ఉంటుంది. శ్రీగంధపు చెక్కలు మాయం వెనుక ఆ శాఖ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. వాటిని నిల్వ చేసిన గదికి సీల్‌ వేసినప్పటికీ... వెనుకవైపునున్న కిటికీ ఊచలు తొలగించి, మాయం చేశారు. దీనిని బట్టి చూస్తే... ఆ కార్యాలయం అణువణువూ తెలిసిన వ్యక్తులకే ఇది సాధ్యమవుతుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఆ కార్యాలయం చుట్టూ ఆరడుగుల ప్రహారీ ఉండటంతో పాటు... రాత్రివేళల్లో వాచమన కూడా విధుల్లో ఉంటాడు. అమరాపురం సమీపంలోనున్న సెంటు ఫ్యాక్టరీలో అక్రమంగా నిల్వ ఉంచిన 4700 కేజీల శ్రీగంధపు చెక్కలను 188 బస్తాల రూపంలో అటవీశాఖ అధికారులు ఐదు నెలల క్రితం స్వాధీనం చేసుకున్నారు. వాటితోపాటు 16 కిలోల శ్రీగంధపు నూనె డబ్బాలున్నాయి. వీటన్నింటినీ పెనుకొండ అటవీశాఖ కార్యాలయంలో భద్రపరిచిన విషయం ఆ శాఖ అధికారులకు మాత్రమే ఎరుక. వేరొకరికి అక్కడ శ్రీగంధపు చెక్కలు భద్రపరిచినట్లు తెలిసే అవకాశం లేదు. ఈనెల 4వ తేదీ వరకూ కార్యాలయంలో శ్రీగంధపు చెక్కలు భ ద్రంగా ఉన్నట్లు ఆ శాఖ ఉన్నతాధికారు లు ధృవీకరించారు. మరి 10 రోజుల వ్యవధిలోనే 92 బస్తాల శ్రీగంధపు చెక్క లు మాయం కావడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. వీటి విలువ రూ.కోటిదాకా ఉంటుందన్నది ఆ శాఖ అ ధికారుల అంచనా. మొత్తం నిల్వ ఉం చిన 188 బస్తాల శ్రీగంధం చెక్కలతోపాటు శ్రీగంధం నూనె డబ్బాల విలువ రూ.2 కోట్లకుపైమాటే. కాగా... మాయమైంది మాత్రం కొన్ని బస్తాలు కావడమే అనుమానాలను రెట్టింపు చేస్తోంది.


మాయం వెనుక హస్తమెవరిది..?

అటవీశాఖ కార్యాలయంలో ఏకంగా 92 బస్తాల శ్రీగంధపు చెక్కలు మాయమయ్యాయి. పక్కా పథకం ప్రకారమే శ్రీగంధపు చెక్కలను మాయం చేశారనే అనుమానాలకే ఇక్కడ బలం చేకూరుతోంది. ఆ ఘటన సమాచారం నేపథ్యంలోనూ అదే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. దొంగల పనా...? ఇంటి దొంగల ప్రమేయం ఉందా అనే అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. దొంగలు చోరీ చేసుంటే ఏకంగా 92 బస్తాలను అపహరించడం ఒకరిద్దరితో అయ్యేపనికాదు. ఆరడుగుల ప్రహారీని దాటించాల్సి ఉంటుంది. మోసుకెళ్లే పరిస్థితి లేదు. రెండు టన్నులకుపైగా చెక్కలు తరలించాలంటే కష్టంతో కూడిన పనే. అందులోనూ అక్కడ నైట్‌ వాచమన విధుల్లో ఉన్నాడు. ఏ మాత్రం అలికిడైనా పట్టుబడే అవకాశాలు లేకపోలేదు. దీనికితోడు ఆ కార్యాలయం పక్కనే సబ్‌ కలెక్టర్‌ ఆఫీసు ఉంది. ఆ కార్యాలయానికి సెక్యూరిటీ ఉంటుంది. అటవీశాఖ కార్యాలయం ఏదో మూలకు లేదు. పట్టణం నడిబొడ్డునే ఉంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో... రూ.కోట్లు విలువ చేసే శ్రీగంధపు చెక్కలు మాయం కావడం రేకెత్తుతున్న అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. దీనివెనుక ఎవరిదైనా హస్తం ఉంటుందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.


అజ్ఞాత వ్యక్తి సమాచారంతోనే...

పెనుకొండ అటవీశాఖ కార్యాలయంలో భద్రపరిచిన శ్రీగంధం చెక్కలు మాయమయ్యాయని ఓ అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారంతోనే ఈ వ్యవహారం వెలుగు చూడటం చూస్తుంటే... అధికారుల నిర్లక్ష్యం ఏపాటిదో అర్థమవుతోంది. రూ.కోట్లు విలువచేసే శ్రీగంధపు చెక్కలు కార్యాలయంలో భద్రత మరిచారని స్పష్టంగా కనిపిస్తోంది. ఇంతకీ... ఆ అజ్ఞాతవ్యక్తి ఎవరన్నది కేవలం ఆ అజ్ఞాత వ్యక్తి ఫోనకాల్‌ రిసీవ్‌ చేసుకున్న ఉన్నతాధికారికే తెలిసే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆ అజ్ఞాతవ్యక్తి సమాచారమే ఈ ఘటనలో కీలకం కానుందనడంలో సందేహం లేదు. శ్రీగంధం చెక్కలు మాయం చేసిన వారెవరు..? దొంగలు చోరీకి పాల్పడ్డారా..? దీని వెనుక బలమైన వ్యక్తులున్నారా...? అనేది తేటతెల్లం కానుంది. ఇప్పటికే ఆ శాఖ ఉన్నతాధికారి.. స్థానిక అధికారులు, సిబ్బంది, వాచమెనను విడివిడిగా విచారించారు. దీనిపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. శ్రీగంధం చెక్కలు మాయం వెనుక దొంగలున్నారా..? లేదా మరెవరైనా ఉన్నారా అనేది తేల్చాల్సి ఉంది.


Updated Date - 2022-01-18T06:37:57+05:30 IST