రూ.వంద కూడా వదలడు

ABN , First Publish Date - 2022-06-30T06:38:48+05:30 IST

వసూళ్ల కోసం నలుగురితో ఓ టీంను ఏర్పాటు చేసుకున్నాడు. పోలీసు అధికారి ఇబ్బంది పెడితే.. ‘ఆయన ఎప్పుడు బదిలీ అవుతాడా..’ అని జనం ఎదురు చూస్తారు. కానీ ఇక్కడ రివర్స్‌..! పోలీసులే ఎదురు చూస్తున్నారు..!

రూ.వంద కూడా వదలడు

అక్రమార్కుడు!

వసూళ్ల కోసం  ఫోర్‌మెన్ కమిటీ

స్టేషన్ మామూలూ మింగుతాడు

దొరికితే.. ఐ ఫోన్ కొనివ్వాల్సిందే..!

నదిలో పోలీస్‌ రీచ్.. ఇసుక దందా

అధికార పార్టీకే ఆయనంటే హడల్‌


విక్రమార్కుడు సినిమా చూసుంటారు కదా..! ఆ సినిమాలో హీరో పోలీస్‌ పవర్‌ ఏమిటో అక్రమార్కులకు చూపుతాడు. తాడిపత్రి సబ్‌ డివిజనలోనూ ఓ పోలీసు అధికారి ఉన్నారు. కాకపోతే.. విక్రమార్కుడికి రివర్స్‌..! స్టేషన్ ఖర్చులకు వచ్చే మామూళ్లు మొదలు.. సెటిల్‌మెంట్ల వరకూ దందాలే దందాలు..! వసూళ్ల కోసం నలుగురితో ఓ టీంను ఏర్పాటు  చేసుకున్నాడు. పోలీసు అధికారి ఇబ్బంది పెడితే.. ‘ఆయన ఎప్పుడు బదిలీ అవుతాడా..’ అని జనం ఎదురు చూస్తారు. కానీ ఇక్కడ రివర్స్‌..! పోలీసులే ఎదురు చూస్తున్నారు..!


తాడిపత్రి

బదిలీపై తాడిపత్రి సబ్‌ డివిజన్‌కు వచ్చిన ఒక పోలీసు అధికారి రెండేళ్ల కాలంలో లెక్క లేనంత అవినీతి సొమ్మును మూటగట్టుకున్నాడు. రూ.లక్షల్లో వసూలు చేసే ఆయన.. చిన్న చిన్న వివాదాలు వస్తే.. వంద రూపాయలైనా ఇవ్వాలని పిండుతున్నాడు. తాడిపత్రి సబ్‌ డివిజనలో ఈ స్థాయి అవినీతి ఆరోపణలు ఎవరిమీదా రాలేదంటే అతిశయోక్తి కాదు. ఆయన అవినీతి, నోటి దురుసుపై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. ఉన్నతాధికారులకు భారీగా ఫిర్యాదులు వెళ్లాయి. అయినా చిన్నపాటి విచారణ కూడా జరగలేదు. పైస్థాయిలో కొందరికి కవర్లు వెళుతున్నాయని, అందుకే పట్టించుకోరని ప్రచారం ఉంది. ప్రస్తుతం ఆయన సాధారణ బదిలీపై వెళుతున్నారని, అవినీతి ఆరోపణలపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం లేదని అంటున్నారు. 



స్టేషన్ ఖర్చులూ స్వాహా

స్టేషన్ ఖర్చుల పేరిట ప్రతి నెలా అనధికారికంగా కొంత వసూలు చేస్తారు. పంచాయితీలు, చట్టవ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే వారినుంచి ప్రతినెలా కొంత మొత్తం వస్తుంటుంది. ఈ మొత్తాన్ని స్టేషన్ ఖర్చులకు, ఇతర అవసరాలకు ఉపయోగిస్తుంటారు. కానీ ఆ అధికారి వచ్చిన తర్వాత స్టేషనకు ఖర్చుల రూపంలో వచ్చే రూ.25 వేలను జేబులో వేసుకుంటున్నాడని సిబ్బంది అంటున్నారు. ఆ అధికారిని అడిగే ధైర్యంలేక స్టేషన్ ఖర్చులు వివిధ రూపాల్లో వసూలు చేస్తున్నారు. 


ఐ ఫోన్ అంటే పిచ్చి

ఆయనకు ఐ ఫోన్ అంటే మహా పిచ్చి అట. అక్రమాలకు పాల్పడేవారి నుంచి దాదాపు 50 ఐఫోన్‌లను గిఫ్ట్‌గా తీసుకున్నారని సమాచారం. ఒక్కో ఐఫోన విలువ రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ఉంటుంది. తాడిపత్రి, అనంతపురంలోని షోరూంల నుంచి వీటిని కొని ఆయనకు బహూకరించినట్లు తెలిసింది. తన పరిధిలో ఇసుక, కొండరాళ్లు, బండలు, లైమ్‌స్టోనను అక్రమంగా తరలిస్తున్న వారి నుంచి డబ్బుకు బదులు ఐఫోన్‌లను గిఫ్ట్‌గా తీసుకుంటున్నాడు. ఆ స్టేషన పరిధిలో పెద్ద ఎత్తున ఖనిజ సంపద ఉంది. ఇసుక నిల్వలు భారీగా ఉన్నాయి. ఈ అక్రమదందా రాత్రి సమయాల్లో జరుగుతుంది. కిందిస్థాయి అధికారులు, సిబ్బందిని నిఘా పెట్టించి, వాహనాలను పట్టుకోవడం, కేసులు లేకుండా బేరమాడటం పరిపాటిగా మారింది. కొందరి నుంచి ఐ ఫోన్లు, మరికొందరి నుంచి డబ్బులతోపాటు ఐ ఫోన్లు తీసుకుంటున్నాడని సమాచారం.



ఆయన చేతిలో ఇసుక రీచ్

తన పరిధిలో ఉన్న నదిలో అనధికారిక ఇసుక రీచ్ ఏర్పాటు చేసి, లక్షలు ఆర్జిస్తున్నాడు. వైసీపీ తాడిపత్రి నాయకుడి తోట సమీపంలో నది నుంచి ఇసుక అక్రమ రవాణా చేయిస్తున్నాడు. స్వయంగా పోలీసు అధికారి చేతిలో రీచ్ ఉండటంతో ట్రాక్టర్‌ యజమానులు యథేచ్ఛగా తోలుకుంటున్నారు. నదిలో నాణ్యమైన ఇసుక ఉండడంతో భారీగా డిమాండ్‌ ఉంది. ఈ నది నుంచి నంద్యాల జిల్లా, పరిసర పట్టణాలకు భారీగా ఇసుక అక్రంగా తరలుతోంది. ఎవరూ పసిగట్టకుండా రాత్రి 8 గంటల నుంచి తెల్లవారు జామున 5 గంటల వరకు తరలిస్తున్నారు.


వసూళ్లకు నలుగురితో టీం

తన పరిధిలో వసూళ్లకోసం నలుగురు పోలీసులతో ఒక టీం ఏర్పాటు చేశాడు. ఆ నలుగురు ఆ అధికారి కనుసన్నల్లో ఉంటారు. అక్రమంగా డబ్బులు వసూలు చేసుకురావడమే వారి డ్యూటీ. ఆ అధికారి మాట తప్ప వారు ఎవరి మాటలనూ లెక్కచేయరు. ఆ అధికారికి వీరు ఎంతచెబితే అంత. ఆయన చిన్నపని నుంచి పెద్దపని వరకు రేట్లను నిర్ణయించి వసూలు చేస్తుంటాడు. ఆ అధికారి పేరుచెప్పి ఆ నలుగురు కొంత అదనంగా వసూలు చేస్తున్నారు. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా, భయపెట్టి డబ్బులు అడుగుతారు. లేదంటే కేసులు, జైలు తప్పదని హెచ్చరిస్తారు. అవసరమైతే ఆ అధికారితో ఫోన్‌లో మాట్లాడించి, మరింత భయపెడుతుంటారు. దీంతో బాధితులు అడిగినంత చెల్లించి వెళ్లిపోతున్నారు. ఆ నలుగురి అక్రమాలు తెలిసినా, కిందిస్థాయి అధికారులు ఏమీ చేయలేకున్నారు. వారి గురించి ఆ అధికారి దృష్టికి తీసుకువెళితే ‘నీ పని నువ్వు చూసుకో’ అని హెచ్చరిస్తున్నాడని సమాచారం. 



డబ్బిచ్చేవారిదే న్యాయం

భూముల రేట్లు అమాంతం పెరిగాయి. అదే స్థాయిలో భూసమస్యలు తలెత్తుతున్నాయి. ఆయన పరిధిలో తలెత్తే ఈ సమస్యలను ఆదాయ వనరుగా మార్చుకున్నాడు. అన్నదమ్ములు, బంధువులు, దాయాదుల భూ సమస్యలను పోలీస్‌ స్టేషన్‌‍లో సెటిల్‌ చేస్తున్నాడు. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారిదే న్యాయం అన్నట్లు పంచాయితీ తీర్పు ప్రకటిస్తున్నాడు. తన మాటకు ఎదురుచెబితే లాఠీకి పనిచెబుతూ భయపెడుతున్నాడు. అన్నదమ్ముల భూసమస్యకు సంబంధించి 70 ఏళ్ల వృద్ధుడిని స్టేషన్‌కు పిలిపించి బెదిరించాడు. ఆయనను కొట్టేందుకు ప్రయత్నించగా, అక్కడే ఉన్న అతని భార్య ఎదురుతిరిగారు. తన భర్త ఏం తప్పు చేశాడని కొడతావని నిలదీశారు. ఇలాంటి సంఘటనలు ఆయన పరిధిలో కోకొల్లలు. 


అధికార పార్టీ నేతలకూ హడల్‌

సాధారణంగా అధికార పార్టీ నాయకులు చెప్పింది పోలీసు అధికారులు వింటారు. వివిధ సమస్యలతో తమవద్దకు వచ్చే వారికోసం అధికార పార్టీ నాయకులు పోలీసు అధికారులకు ఫోన్ చేస్తుంటారు. కానీ అక్కడ మాత్రం కుదరదు. ఆ అధికారికి ఫోన్ చేయాలంటే అధికార పార్టీ నాయకులు హడలిపోతున్నారు. చేయి తడపందే పనిచేయనని ఆయన డైరెక్ట్‌గా చెబుతున్నాడని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అధికారపార్టీకి చెందిన తమ నుంచే డబ్బులు గుంజేందుకు ప్రయత్నిస్తుంటే, మిగిలిన వారి పరిస్థితి ఎలా ఉంటుందో అని వాపోతున్నారు. ఆయన అవినీతి వ్యవహారాల గురించి ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదని అంటున్నారు. తమ దగ్గరికి వచ్చిన వారితో ఆయనకు డబ్బులు ఇప్పించి పనులు చేయిస్తే, ఇక తమను ఎవరు గౌరవిస్తారని అధికార పార్టీ నాయకులు నిట్టూరుస్తున్నారు. 


ఎదురు చూపు..

ఆ అధికారి ఎప్పుడెప్పుడు బదిలీ అవుతాడా అని కిందిస్థాయి అధికారులు, సిబ్బంది ఎదురు చూస్తున్నారు. డ్యూటీకి పది నిమిషాలు ఆలస్యమైతే నోటికొచ్చినట్లు మాట్లాడుతాడని వాపోతున్నారు. డబ్బులు వసూలు చేసి, ఎప్పటికప్పుడు ఆయన చేతుల్లో  పెడుతుంటే పట్టించుకోడని, లేకపోతే వేధిస్తాడని అంటున్నారు. అత్యవసరం అయినా సెలవు ఇవ్వడని వాపోతున్నారు.

Updated Date - 2022-06-30T06:38:48+05:30 IST