ప్రత్యేకాధికారుల పాలన నామమాత్రమే.. వైసీపీదే పెత్తనం

ABN , First Publish Date - 2020-08-08T18:14:11+05:30 IST

మున్సిపాల్టీలలో పాలకవర్గాలు లేకపోవడంతో అభివృద్ధి ఎక్కడి గొంగళి అక్కడే అనే స్థితి నెలకొంది. గత ఏడాది జూలై 2వ తేదీతో పాలకవర్గాల గడువు ముగిశాయి. మేయర్లు, చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు మాజీలయ్యారు. అప్పటి నుంచి ప్రత్యేకాధికారుల పాలన మొదలైంది.

ప్రత్యేకాధికారుల పాలన నామమాత్రమే.. వైసీపీదే పెత్తనం

అభివృద్ధి నత్తనడక.. పారిశుధ్యంపైనా నిర్లక్ష్యమే

కరోనాతో సమస్యలు పక్కదారి ..ఎన్నికలు ఆగిపోవడంతో కేడర్‌లో గందరగోళం


(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి): మున్సిపాల్టీలలో పాలకవర్గాలు లేకపోవడంతో అభివృద్ధి ఎక్కడి గొంగళి అక్కడే అనే స్థితి నెలకొంది. గత ఏడాది జూలై 2వ తేదీతో పాలకవర్గాల గడువు ముగిశాయి. మేయర్లు, చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు మాజీలయ్యారు. అప్పటి నుంచి  ప్రత్యేకాధికారుల పాలన మొదలైంది. కార్పొరేషన్‌కు కలెక్టర్లు, జేసీలు, మున్సిపాల్టీలకు ఆర్డీఓ స్థాయి అధికార్లను ప్రత్యేకాధికార్లుగా నియమించారు. జూలైలో   మొదలైన ప్రత్యేకాధికారుల పాలన డిసెంబర్‌తో ముగియడంతో మళ్లీ ఆర్నెల్లు పొడిగించారు. ఇటీవల అదీ ముగియడంతో మళ్లీ ఆర్నెల్లు పొడిగించారు. వీరు బాధ్యతల్లో జనవరి 2వ తేదీ దాకా గానీ, ఎన్నికలు జరిగే వరకూ గానీ ఉంటారు. ఈలోపు ఎన్నికలు జరిగితే పాలక వర్గాలు వస్తాయి.  మార్చిలో జరగవలసిన ఎన్నికలను కరోనా వల్ల వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అప్పుడు జారీ చేసిన నోటిఫికేషన్‌ గడువు త్వరలో ముగియనుంది. దీంతో మళ్లీ  ఎన్నికల సంఘం కొత్త నోఫికేషన్‌ జారీ చేయవలసి ఉంది. అప్పట్లో మొదలైన నామినేషన్ల ప్రక్రియ పూర్తిగా రద్దు అవుతోంది. మళ్లీ నోటిఫికేషన్‌ జారీ అయితే కొత్తగా ఎన్నికల ప్రక్రియ మొదలవుతుంది. కరోనా ఇంకా విజృంభిస్తున్న ఈ సమయంలో ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు. 


పైగా వర్షాకాలం. కరోనా ఉధృతి తగ్గితే నవంబరు తర్వాత ఎన్నికలు ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాల అంచనా. లేదంటే  2021లోనే జరుగుతాయి. కానీ అప్పటికి కొత్త జనాభా లెక్కల వివరాలు ప్రకటించాల్సి ఉంది.  అవి ఎప్పటికి ప్రకటిస్తారో చూడాలి. ఇక కొత్త జనాభా లెక్కల ప్రకారం అయితే మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రత్యేకాధికారుల పాలన నామమాత్రంగా జరుగుతోంది. రెగ్యులర్‌గా ప్రత్యేకాధిరులు రావడంలేదు. ఆయా ప్రాంతాల కమిషనర్లే ప్రధాన బాధ్యత నిర్వహిస్తున్నారు. కరోనా విజృంభణతో అధికారులంతా కరోనా కట్టడి ఏర్పాట్లు, కంటైన్మెంట్‌ జోన్లు, బాధితులకు వైద్యం ఎలా అందించాలనే ఏర్పాట్లలోనే అధికంగా నిమగ్నమవుతున్నారు. ఈ నేపథ్యం లో అభివృద్ధి అసలు లేదు. 


రోడ్లు అధ్వానంగా మారాయి. డ్రైన్లలో సిల్ట్‌ తీస్తున్నారుకానీ మళ్లీ పూడికలు మామూలే. ఎక్కడి చెత్త అక్కడే ఉంటోంది.  జిల్లాలోని మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీలలో ఇదే పరిస్థితి నెలకొంది. జిల్లాలో రాజమహేంద్రవరం మున్సిపల్‌ కార్పొరేషన్‌, అమలాపురం, మండపేట, రామచంద్రపురం, సామర్లకోట, పెద్దాపు రం, పిఠాపురం, తుని మున్సిపాల్టీలు, ముమ్మిడివరం, గొల్లప్రోలు, ఏలేశ్వ రం నగర పంచాయతీలు ఉన్నాయి. కాకినాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు పాలకవర్గం ఉంది. లేనిచోట్ల మున్సిపాల్టీలపై వైసీపీ నేతల పెత్తనమే అధికంగా కనిపిస్తోంది. ఐఏఎస్‌ అధికారులు పెద్దగా చనువు ఇవ్వకపోవచ్చు. ఎంపీలు, ఎమ్మెల్యే మాట వినకతప్పడంలేదు. మిగతాచోట్ల వైసీపీ నేతలు అధికార్లను బెదిరించే పరిస్థితి ఉంది. కొద్దిరోజుల వరకూ ఇళ్ల పట్టాల సందడి మాత్రమే ఉంది. ప్రస్తుతం అది కూడా కనిపించడంలేదు.

Updated Date - 2020-08-08T18:14:11+05:30 IST