
- అధికార పార్టీ నేత అండదండలతో గుట్టుచప్పుడు కాకుండా చెల్లింపులు
- తాజాగా వెలుగుచూసిన వ్యవహారం
అమలాపురం టౌన, జూన 28: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అమలాపురం శాఖలో మరోసారి నిధుల గోల్‌మాల్ వ్యవహారం బయటపడింది. ఈ ఏడాది మార్చిలో జరిగిన ఇదే తరహా వ్యవహారంలో అప్పటి బ్యాంకు మేనేజర్ నారాయణమూర్తిని ఇటీవల సస్పెండ్ చేశారు. అసిస్టెంట్ మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్లకు మెమోలు జారీ చేశారు. బ్యాంకు కార్యాలయంలో సెక్యూరిటీ గార్డుగా పని చేసిన వ్యక్తే నిధుల గోల్‌మాల్‌కు పాల్పడడం విశేషం. గడిచిన మార్చి నెలలో సదరు వ్యక్తి రూ.14 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ సొమ్ములను గోల్‌మాల్ చేసిన వ్యవహారం బయటపడడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. బ్యాంకు మేనేజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను వినియోగించుకుని సదరు సెక్యూరిటీ గార్డు ఈ నిధులను మళ్లించాడు. ఈ వ్యవహారం పత్రికల్లో వెలుగు చూడడంతో అధికార వైసీపీ నేత అండదండలతో గోల్‌మాల్ చేసిన నిధులను ఖాతాదారులకు చెల్లించారు. బ్యాంకు మేనేజర్‌గా కేవీఎస్‌ఎన మూర్తి ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. వెంటనే ఫిక్స్‌డ్ డిపాజిట్లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించే పని చేపట్టారు. దాంతో మరికొందరు ఖాతాదారుల ఎఫ్‌డీ ఖాతాల్లో నిధులు గోల్‌మాల్ అయినట్టు గుర్తించారు. సదరు ఖాతాదారులను బ్యాంకుకు పిలిపించడంతో ఈ వ్యవహారం మంగళవారం వెలుగులోకి వచ్చింది. అమలాపురం పట్టణానికి చెందిన గారపాటి కుటుంబీకులు 2006 సంవత్సరం నుంచి పలు దఫాలుగా ఎఫ్‌డీలు వేసుకున్నారు. 2006 నవంబరు 27న గారపాటి వెంకటలక్ష్మి పేరిట రూ.12,497, 2007 నవంబరు 6న గారపాటి హిమనాగచంద్రిక పేరిట రూ18,472, అదే ఏడాది ఏప్రిల్ 17న గారపాటి ఉమాశృతి పేరిట రూ.12,314, 2009 నవంబరు 20న గారపాటి రమ్యమణి పేరిట రూ.19,305, 2008 నవంబరు 23న ఆమె పేరిటే రూ.16,245 ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేశారు. ఎఫ్‌డీల కాలపరిమితి ముగియడంతో ఈ నిధులను సైతం అదే వ్యక్తి అదే సమయంలో గోల్‌మాల్ చేసినట్టు బయటపడింది. దాంతో గోప్యంగా మళ్లీ అదే వైసీపీ నేత అండదండలతో సదరు ఖాతాదారులతో బేరసారాలకు దిగి చెల్లింపులు చేశారు. మార్చి నెలలో జరిగిన నిధుల గోల్‌మాల్‌లో కీలక పాత్రధారి అయిన సెక్యూరిటీ గార్డు వైసీపీ నేత ప్రాతినిధ్యం వహించే దేవగుప్తం గ్రామ సొసైటీలోనే పనిచేస్తున్నాడు. ఈ విషయమై ప్రస్తుత బ్యాంకు మేనేజర్ మూర్తిని వివరణ కోరగా... కాలపరిమితి ముగిసిన ఎఫ్‌డీలకు సంబంధించి సదరు ఉద్యోగి నుంచి రూ.2.50 లక్షల మేర ఇప్పటికే చెల్లింపులు చేశామన్నారు. ఎఫ్‌డీలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించామని, ఇకపై ఇటువంటి పొరపాట్లు జరిగే అవకాశాలు ఉండవని చెప్పారు.