విశ్వాసానికి ఘన నివాళి

ABN , First Publish Date - 2020-10-25T10:53:17+05:30 IST

ఎంతో విశ్వాసంతో ఆరేళ్లుగా తమతో కలసిమెలసి జీవించిన శునకం ఒక్కసారిగా దూరమవడంతో ఆ దంపతులు తల్లడిల్లిపోయారు

విశ్వాసానికి ఘన నివాళి

క్రైస్తవ సాంప్రదాయం మేరకు శునకానికి అంత్యక్రియలు


చిత్తూరు, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): ఎంతో విశ్వాసంతో ఆరేళ్లుగా తమతో కలసిమెలసి జీవించిన శునకం ఒక్కసారిగా దూరమవడంతో ఆ దంపతులు తల్లడిల్లిపోయారు. తమ కుటుంబంతో విడదీయలేని అనుబంధం పెంచుకున్న శునకానికి క్రైస్తవ సాంప్రదాయం మేరకు అంత్యక్రియలు నిర్వహించి ఘన నివాళులర్పించారు. వివరాలివీ.. గుడిపాల మండలం పేయనపల్లె పంచాయతీ పాపిశెట్టిపల్లెకి చెందిన రూపస్‌, రైడ్‌చల్‌ దంపతులు ఉద్యోగరీత్యా తమిళనాడు రాష్ట్రం కాట్పాడిలో స్థిరపడ్డారు.


కాగా, ఆరేళ్ల కిందట వీరు బాక్సర్‌ జాతికి చెందిన ఓ శునకాన్ని కొనుగోలు చేసి టోనీ అని పేరు పెట్టుకున్నారు. ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న రైడ్‌చల్‌ టోనీతో ఎనలేని అనుబంధం పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల అనారోగ్యం బారినపడిన టోనీ వైద్య చికిత్సలు పొందుతూ ఈనెల 23న మృతిచెందింది. కుటుంబంలో ఓ సభ్యురాలిగా మారి, తమ పట్ల ఎంతో విశ్వాసం చూపుతున్న శునకం మరణాన్ని రూపస్‌ దంపతులు జీర్ణించుకోలేక పోయారు. దీంతో అదేరోజు కాట్పాడి నుంచి టోనీ మృతదేహాన్ని అంబులెన్సులో పాపిశెట్టిపల్లెకు తీసుకొచ్చారు. ప్రత్యేక శవపేటికలో మృతదేహాన్ని ఉంచి గ్రామవీధుల్లో ఊరేగింపుగా స్థానిక క్రైస్తవుల శ్మశానానికి తీసుకు వెళ్లారు. గ్రామస్తుల సమక్షంలో అంత్యక్రియలు పూర్తి చేసి విశ్వాసానికి మారుపేరుగా నిలిచిన టోనీకి ఘన నివాళులర్పించారు. కాగా, పదిరోజుల తర్వాత గ్రామంలో సువార్త కూటమి నిర్వహించి, 500మందికి అన్నదానం చేయాలని రూపస్‌, రైడ్‌చల్‌ దంపతులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

Updated Date - 2020-10-25T10:53:17+05:30 IST