జల్సాలకు అలవాటు పడి పొట్టేళ్ల చోరీలు

ABN , First Publish Date - 2022-10-01T05:20:19+05:30 IST

జల్సాలకు అలవాటుపడి పొటేళ్లు, గొర్రెల చోరీకి పాల్పడిన ముఠా గుట్టును గంగవరం పోలీసులు రట్టు చేశారు. నిందితులను శుక్రవారం గంగవరం పోలీస్‌స్టేషన్‌లో అరెస్టు చూపి వివరాలను వెల్లడించారు

జల్సాలకు అలవాటు పడి పొట్టేళ్ల చోరీలు
నిందితుల అరెస్టు చూపుతున్న పోలీసులు

కారులో పకడ్బందీగా తరలింపు


28 జీవాలు సహా కారు స్వాధీనం


ఒకరి పరారీ, 9 మంది అరెస్టు, వారిలో ఇద్దరు విద్యార్థులు


గంగవరం, సెప్టంబరు 30: జల్సాలకు  అలవాటుపడి  పొటేళ్లు, గొర్రెల చోరీకి పాల్పడిన ముఠా గుట్టును గంగవరం పోలీసులు రట్టు చేశారు. నిందితులను శుక్రవారం గంగవరం పోలీస్‌స్టేషన్‌లో అరెస్టు చూపి వివరాలను వెల్లడించారు. గంగవరం మండలంలోని కురపల్లె, డ్రైవర్స్‌ కాలనీ, వి.రామాపురం, మొమ్మనపల్లె, చెన్నరెడ్డిపల్లెతోపాటు పలమనేరు పరిసర ప్రాంతాల్లో నెలరోజులుగా గొర్రెలు, పొట్టేళ్ల చోరీలపై పెంపకందారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గంగవరం సీఐ అశోక్‌కుమార్‌, ఎస్‌ఐ సుధాకర్‌ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిఘా ముమ్మరం చేశారు. ఈ క్రమంలో గురువారం పలమనేరు- బెంగళూరు రహదారిలోని గంగవరం మండలం నాలుగురోడ్ల సర్కిల్‌ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈ  సందర్భంగా  అటుగా వచ్చిన కారును తనిఖీ చేయగా వాహనం వెనుక వైపు పొట్టేళ్లు కట్టివేసిన విషయాన్ని  గుర్తించారు. తనిఖీ చేస్తుండగా కారులో వచ్చిన నిందితులు తప్పించుకోవడానికి ప్రయత్నించగా పోలీసులు వెంబడించి తొమ్మిది మందిని పట్టుకోగా ఒకరు పారిపోయారు. పోలీసులు నిందితులను విచారించగా జల్సాలకు అలవాటుపడి చేతిలో డబ్బుల్లేక చోరీల మార్గం ఎంచుకున్నట్లు తెలిసింది.   10 మంది యువకులు, ఇందులో ఇద్దరు విద్యార్థులు బృందంగా ఏర్పడ్డారు. ద్విచక్రవాహనాలు, ఆటోల్లో గొర్రెలను దొంగలించుకుపోతే పట్టుబడిపోతామని ఉపాయం ఆలోచించారు.    రూ.1.50 పోగుచేసి ఓ కారును లీజుకు తీసుకున్నారు. పగలంతా గొర్రెల కొట్టాలు, గ్రామానికి దూరంగా పొలాల వద్ద ఉన్న మందలను గుర్తిస్తారు. ఇక పొద్దువాలగానే  కొట్టాముల్లో దూరి గొర్రెలు, పొట్టేళ్లను పట్టుకొని వాటి నోరు, కాళ్లకు దారాలతో బిగించి శబ్దం రాకుండా చోరీ చేసేవారు. వాటిని బైరెడ్డిపల్లె, వి.కోట, కర్ణాటక రాష్ట్రంలోని ముళబాగిల్‌ తదితర ప్రాంతాల్లో విక్రయించి ఆ సొమ్ముతో జల్సాలకు పాల్పడేవారు.  ఇక చోరీలకు ఉపయోగించిన  కారును సీజ్‌ చేసి,  28 గొర్రెలు, పొట్టేళ్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. పట్టుబడిన వారందరూ బైరెడ్డిపల్లె మండలం జంగాల అగ్రహారానికి చెందిన వారు కావడం విశేషం. అరెస్టయిన వారిలో బైరెడ్డిపల్లె మండలం జంగాల అగ్రహారానికి చెందిన చెర్లోపల్లె నాగకుమార్‌(24), నందకుమార్‌(28), శేష్రాద్రి(19), బాలకృష్ణ(20), దినకర్‌(28), మహదేవన్‌(27), కుమార్‌(30), ఎం.మౌనిష్‌(20), ఎస్‌.జే.శేషాది(20) ఉన్నారు. అరెస్టయిన వారందరిని కోర్టుకు హాజరుపరచినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ కేసు ఛేదించడానికి కృషి చేసిన ఐడీ పార్టీ ఏఎస్‌ఐ శ్రీనివాసులు, అల్లావుద్దీన్‌, బాలాజీని అభినందించి రివార్డులు ప్రకటించారు.

Updated Date - 2022-10-01T05:20:19+05:30 IST