చుట్టేస్తోంది!

ABN , First Publish Date - 2021-05-10T07:01:20+05:30 IST

జిల్లాలో అధికారులు కరోనా బారిన పడుతున్నారు. అన్ని శాఖలకు చెందిన 300 మందికి పైగా బాధితులు ఉన్నారు. అందులో సగం రాజమహేంద్రవరం డివిజన్‌లోనే ఉన్నారు. ఇందులో అధికారులు, డాక్టర్లు, సిబ్బంది, ఆశా వర్కర్లు ఉండడం గమనార్హం.

చుట్టేస్తోంది!

  • కొవిడ్‌ బారిన పడుతున్న ప్రభుత్వ ఉద్యోగులు
  • పలువురు అధికారులకు పాజిటివ్‌
  • వైద్య శాఖలో 300 మందికిపైనే బాధితులు
  • కాకినాడ పోలీసు జిల్లా పరిధిలో 216, రాజమహేంద్రవరం అర్బన జిల్లా  పరిధిలో 84 మంది
  • వ్యవసాయ శాఖలో ఏడీలతో పాటు పలువురికి

(ఆంధ్రజ్యోజ్యోతి-రాజమహేంద్రవరం)

జిల్లాలో అధికారులు కరోనా బారిన పడుతున్నారు. అన్ని శాఖలకు చెందిన 300 మందికి పైగా బాధితులు ఉన్నారు. అందులో సగం రాజమహేంద్రవరం డివిజన్‌లోనే ఉన్నారు. ఇందులో అధికారులు, డాక్టర్లు, సిబ్బంది, ఆశా వర్కర్లు ఉండడం గమనార్హం. రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో లెప్రసీ రోగులకు సేవలందించే డిప్యూటీ పారా మెడికల్‌ అధికారి జీఎస్‌ఎల్‌లో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. ప్రభుత్వ అధికారులైనా, ప్రైవేట్‌ ఆసుపత్రులకు చెందిన సిబ్బంది అయినా సాహసంతోనే కొవిడ్‌ సేవలు చేస్తున్నారు. వీరికి డ్యూటీలు కూడా ఎక్కువ ఉండడం, బాధితుల మధ్య ఒత్తిడికి గురికావడం వంటి సమస్యలు ఉన్నాయి. ఎక్కువమంది వైరస్‌ బారిన పడడం వల్ల మిగతా వారిపై మరింత ఒత్తిడి పెరిగింది. కొందరు అధికారులు, డాక్టర్లు నిత్యం ఫోన్లలో  కూడా అందుబాటులో ఉంటున్నారు. వారికి విశ్రాంతి ఉండడం లేదు. ప్రస్తుతం బాధితుల సంఖ్య పెరిగిపోవడం, ఎక్కువ మందికి సివియర్‌గా ఉండడం, పలువురు ప్రాణాలు పోతుండడంతో వైద్యులు కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ‘మా కళ్లెదుటే అనేక మంది ప్రాణాలు పోతున్నాయి. మేము చేసేది చేస్తున్నాం. లోపల ఉన్న వారికి ఏదోలా ప్రయత్నం చేస్తున్నాం. కానీ బెడ్స్‌లేక బయట ఉండేపోయే వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది’ అని ఒక అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. 

మరో బాధిత శాఖ పోలీసు శాఖ. వైద్యుల తర్వాత కొవిడ్‌కు గురవుతున్న వారిలో పోలీసులు అధికంగా ఉన్నారు. కాకినాడ ఎస్పీ పరిధిలో 216 మంది బాధితులు కాగా ఒకరు ప్రాణం కోల్పోయారు. ప్రస్తుతం 156 మంది హోం ఐసోలేషన్‌లో ఉండగా నలుగురు ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ఐదుగురు కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో చికిత్స పొందుతున్నారు. మిగతా వారిలో కోలుకున్నవారు తిరిగి డ్యూటీలకు హాజరవుతున్నారు.  రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లాలో 84 మందికి వైరస్‌ సోకింది. అందులో 18 మంది కోలుకుని తిరిగి డ్యూటీకి వస్తున్నారు. 66 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ముగ్గురు కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

ఇక శానిటేషన్‌ సిబ్బంది పాత్ర మరువలేనిది. బాధితులకు వాడిన మందులు, పరికరాల వేస్ట్‌ను కూడా వీరే తీయాలి. వీరిలో చాలా మంది వైరస్‌ బాధపడుతున్నారు. ప్రింట్‌ అంట్‌ ఎలక్ర్టానిక్‌ మీడియా నుంచి కూడా చాలా మంది బాధితులయ్యారు.  వ్యవసాయ శాఖలో 10 మందికి పైగా బాధితులు ఉన్నారు. ఇందులో నలుగురు అసిస్టెంట్‌ డైరెక్టర్లతో పాటు ఏవోలు కూడా ఉన్నారు. దీంతో ఖరీఫ్‌ యాక్షన్‌ ప్లాన్‌కు ఇబ్బందికరంగా మారింది. ఇరిగేషన్‌లో ఒక డీఈ ప్రైవేట్‌ ఆసుపత్రిలో ఆక్సిజన్‌తో ఉన్నారు. రెవెన్యూ శాఖలో కూడా చాలా మంది కొవిడ్‌ బారిన పడ్డారు. మున్సిపల్‌, పంచాయతీరాజ్‌లతో పాటు అన్ని శాఖల్లో ఎవరో ఒకరు వైరస్‌కు గురవుతున్నారు. జిల్లా పరిషతకు సంబంధించిన ఒకరు ఆదివారం మృతి చెందారు. పోలవరం ప్రాజెక్టులో చాలా మంది అధికారులు,  ఉద్యోగులు, కార్మికులు వైరస్‌తో బాధపడుతున్నారు. పనులు  కూడా నెమ్మదించాయి.  ఓఎన్జీసీలో కింది స్థాయి సిబ్బంది ఎక్కువ మందికి పాజిటివ్‌ వచ్చింది. ఆయా కుటుంబ సభ్యులు ఎక్కువ మంది బాధితులయ్యారు. కార్యకలాపాలు ఆగలేదు కానీ మందగించాయి. 

Updated Date - 2021-05-10T07:01:20+05:30 IST