కరోనా కట్టడిలో ప్రభుత్వాలు విఫలం

ABN , First Publish Date - 2021-05-11T05:39:22+05:30 IST

కరోనాను నియత్రించడంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని దళిత సంఘాల నాయకులు స్పష్టం చేశారు

కరోనా కట్టడిలో ప్రభుత్వాలు విఫలం

దళిత సంఘాల నాయకులు


హత్నూర, మే 10: కరోనాను నియత్రించడంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని దళిత సంఘాల నాయకులు స్పష్టం చేశారు. కరోనాతో మృతిచెందిన పౌరహక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు బేగరి దుర్గయ్య మృతికి సంతాపం తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ కరోనా టెస్టుల సంఖ్యను తగ్గించి రాష్ట్రంలో కేసులు తగ్గుముఖం పట్టాయని ప్రభుత్వాలు చెప్పుకోవడం విచారకరమన్నారు. నియంత్రణ చర్యలు చేపట్టకపోవడంతో పాటు ప్రైవేటు ఆసుపత్రులకు కొమ్ముకాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ యువసేన జిల్లా కన్వీనర్‌ కోటగళ్ల శివరామకృష్ణ, మాలమహానాడు జిల్లా కార్యదర్శి గొల్పలి ఆంజనేయులు, ఎమ్మార్పీఎస్‌ మండల కోకన్వీనర్‌ దేవులపల్లి నవీన్‌కుమార్‌, ఒగ్గు భిక్షపతి ముదిరాజ్‌, చిన్న భిక్షపతి ముదిరాజ్‌, మందారం శివయ్య, కొండని నర్సింహులు, ఎండీ.మహబూబ్‌ తదితరులు పాల్గొన్నారు.


ఆర్డీవోకు సీపీఎం నేతల వినతి

నర్సాపూర్‌, మే 10: ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వీడి ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరుతూ సీపీఎం నర్సాపూర్‌ డివిజన్‌ కార్యదర్శి కె.నాగరాజు ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయ ఏవో తబితారాణికి వినతిపత్రం అందజేశారు. కొవిడ్‌ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలకు భద్రత, నమ్మకం కల్పించాలని వారికి భరోసానివ్వాలని కోరారు. వ్యాక్సిన్‌ కొరత కూడా తీవ్రంగా వేధిస్తున్నదని చెప్పారు. అలాగే కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులూ కలగకూడదన్నారు. కార్యక్రమంలో నాయకులు గణేష్‌, దాసు, మహేష్‌ పాల్గొన్నారు.


కరోనాతో మృతిచెందిన కార్మికులకు నివాళులు

నారాయణఖేడ్‌: రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో మృతిచెందిన ఆర్టీసీ కార్మికుల ఆత్మకు శాంతి చేకూరాలని సోమవారం ఖేడ్‌ ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న అధికారులు, కార్మికులు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు.  కరోనాతో మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు రూ.50లక్షల చొప్పున ప్రభుత్వం సాయం అందజేయాలని కోరారు. హైదరాబాద్‌లోని తార్నాకలోని ఈఎ్‌సఐ ఆసుపత్రిలో కార్మికులకు కరోనా వైద్యం అందించే ఏర్పాట్లు చేయాలని డిమాండ్‌ చేశారు. 


 కేసులు తక్కువ చూపుతున్నారు

జిన్నారం: కరోనా పరీక్షలను చేయకుండానే కేసుల సంఖ్యను ప్రభుత్వం తక్కువగా చూపుతుందని ఎంపీపీ రవీందర్‌గౌడ్‌ అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాసుపత్రుల్లో కరోనా టెస్టు కిట్లు అందుబాటులో ఉండడం లేదన్నారు. పూర్తిస్థాయిలో పరీక్షలు జరిపి కొవిడ్‌ను ఆరోగ్యశ్రీలో చేర్చి చికిత్స అందించాలని డిమాండ్‌ చేశారు. 


 పలు గ్రామాల్లో హైపోక్లోరైడ్‌ ద్రావణం పిచికారి 

చిన్నశంకరంపేట: కరోనా నియంత్రణకు మండల కేంద్రం తో పాటు, వెంకట్రావుపల్లి, జంగరాయితాండా, సంగాయిపల్లి, ఖాజాపూర్‌ తాండా ఎస్‌కొండాపూర్‌ గ్రామాల్లో సర్పంచుల ఆధ్వర్యంలో సోమవారం సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పారిశుధ్య కార్మికులు పిచికారి చేశారు. 

తూప్రాన్‌: తూప్రాన్‌ మండలం కోనాయపల్లి(పీబీ)లో సోమవారం హైపోక్లోరైడ్‌ ద్రావణం పిచికారి చేశారు. సర్పంచ్‌ కంకణాల పాండు ఆధ్వర్యంలో కోనాయపల్లి (పీబీ)లోని వీధులన్నింటిలో ద్రావణం పిచికారి చేశారు. ఉపసర్పంచ్‌ రమ్య, పంచాయతీ కార్యదర్శి అన్నపూర్ణ పాల్గొన్నారు. 


కరోనా కట్టడిలో భాగస్వాములవ్వాలి

ఝరాసంగం, మే 10: కరోనా కట్టడిలో ప్రతిఒక్కరూ భాగస్వాములవ్వాలని జహీరాబాద్‌ ఎమ్మెల్యే మాణిక్‌రావు పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రమైన ఝరాసంగం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రెండో టీకాను కుటుంబసమేతంగా తీసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని కోరారు. ఆయన వెంట నాయకులు టీఆర్‌ఎస్‌ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు విజేందర్‌రెడ్డి, వైద్యాధికారి మజీద్‌, పలువురు ఉన్నారు. 


మృత్యుంజయ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే 

బర్దీపూర్‌ దత్తగిరి ఆశ్రమంలో కొనసాగుతున్న మృత్యుంజయ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాణిక్‌రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆశ్రమ అర్చకులు వేదామంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల మధ్య పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆశ్రమంలో నవగ్రహాలకు, పంచావృక్షాలకు ప్రత్యేక పూజలు చేశారు. ఆశ్రమ పీఠాధిపతి వైరాగ్య శిఖమణి అవదూత గిరిమహారాజ్‌ శాలువ, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం తీర్థప్రపాదాలను అందజేశారు.

Updated Date - 2021-05-11T05:39:22+05:30 IST