ధరల నియంత్రణలో ప్రభుత్వాలు విఫలం

ABN , First Publish Date - 2021-06-19T05:30:00+05:30 IST

ధరల నియంత్రణలో ప్రభుత్వాలు విఫలం

ధరల నియంత్రణలో ప్రభుత్వాలు విఫలం
మేడ్చల్‌ కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహిస్తున్న వామపక్ష పార్టీల నాయకులు

మేడ్చల్‌ అర్బన్‌: పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసర ధరలను అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎన్‌. బాలమల్లేష్‌ అన్నారు. శనివారం మేడ్చల్‌-మల్కాజిగిరి కలెక్టరేట్‌ వద్ద సీపీఐ, సీపీఎం, సీపీఐఎంఎల్‌ల ఆధ్వర్యంలో పెరుగుతున్న ధరలను సామాన్యులకు అందుబాటులో ఉండేవిధంగా ప్రభుత్వాలు అదుపుచేయాలని డిమాండ్‌ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలమల్లేష్‌ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోదీ, సీఎం కేసీఆర్‌లు నియంతల్లా వ్యవహరిస్తున్నారని, ప్రజల బాగోగులు పట్టించుకోకుండా పాలన చేస్తున్నారని మండిపడ్డారు. గత 46రోజుల్లో 26సార్లు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగడంపట్ల విచారం వ్యక్తం చేశారు. అనంతరం సీపీఐ జిల్లా కార్యదర్శి సాయిలుగౌడ్‌, సీపీఎం కార్యదర్శి పి.సత్యంలు మాట్లాడుతూ.. పెట్రోల్‌, డీజిల్‌పై విధిస్తున్న ట్యాక్సులను క్రమబద్ధీకరించి సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ధరల స్థిరీకరణకు కృషి చేయాలన్నారు. ప్రజల నుంచి ట్యాక్సుల రూపంలో ప్రభుత్వాలు దోచుకోవడం మానుకుని, ఉచిత కరోనా వ్యాక్సిన్‌ను ప్రతి ఒక్కరికీ వేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్‌ నరసింహారెడ్డికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వామపక్ష నాయకులు దామోదర్‌రెడ్డి, కృష్ణమూర్తి, లక్ష్మి, శంకర్‌రావు, శంకర్‌, యాదయ్య, అశోక్‌, శ్రీనివాస్‌, వెంకటేష్‌, అబ్దుల్‌, ఈశ్వర్‌, తదితరులు పాల్గొన్నారు.

పెట్టుబడి దారులకు ఊడిగం

వికారాబాద్‌: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధనికులకు, పెట్టుబడి దారులకు, భూ స్వాములుకు ఊడిగం చేస్తున్నాయని సీపీఎం జిల్లా కార్యదర్శి మహిపాల్‌ విమర్శించారు. శనివారం స్థానిక ఎన్‌టీఆర్‌ చౌరస్తాలో సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో డిజిల్‌, పెట్రోల్‌ ధరలు తగ్గించాలని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. పెంచిన డిజిల్‌ పెట్రోల్‌ ధరలను నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలని కోరారు. సీపీఐ జిల్లా నాయకులు నర్సిములు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ప్రజలు అల్లాడిపోతుంటే పెరిగిన ధరలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెంటనే ధరలు తగ్గించి కరోనా కారణంగా మృతిచెందిన కుటుంబాలకు రూ.20లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ, సీపీఎం నాయకులు అయ్యాబాబు, అనంతయ్య, బాబే నాయక్‌, వెంకట్‌ రెడ్డి, బిక్షపతి, ఆనందం, రామచంద్రయ్య, నర్సిములు శ్రీనివాస్‌, అనంతయ్య తదితరులు పాల్గొన్నారు.

డీజిల్‌, పెట్రోల్‌ ధరలను వెంటనే తగ్గించాలి 

పరిగి: పెంచిన డీజిల్‌, పెట్రోల్‌ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో శనివారం పరిగి తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్‌ విద్యాసాగర్‌రెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈసందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు ఎం.వెంకటయ్య, సీపీఐ కార్యదర్శి ఫీర్‌మహ్మద్‌లు మాట్లాడుతూ దేశ ప్రధాని మోదీ పెట్రోల్‌, డీజీల్‌, వంటగ్యాస్‌, నిత్యావసర సరుకుల ధరలు ఎడాపెడా పెంచి పేదలపై భారం మోపుతున్నాడని విమర్శించారు. ప్రజల నుంచి పన్నులు వసూలయ్యే ఆదాయాన్ని కార్పొరేట్‌ శక్తులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. కార్పోరేట్లకు లక్షల కోట్లు రాయితీలు ఇచ్చి, పేదల బతుకులకు భరోసా ఇవ్వని మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు అన్ని పక్షాలు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. పెంచిన ధరలను తగ్గించాలని లేదంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం, సీపీఐ నాయకులు హాబీబ్‌, శ్రీనివాస్‌, బసిరెడ్డి, రవి, ప్రభు, షఫీ, ఆశోక్‌, రాజు, రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-19T05:30:00+05:30 IST