చెరువు కాలువనే పూడ్చేశాడు..

ABN , First Publish Date - 2022-07-08T04:29:56+05:30 IST

ధర్మవరం చెరువు నుంచి ఏళ్లుగా ఆయకట్టుకు నీరు అందిస్తున్న కాలువ అది.

చెరువు కాలువనే పూడ్చేశాడు..
పొలం సమీపాన కాలువ పూడ్చివేసి, చదును చేసిన దృశ్యం

- అధికార పార్టీ నాయకుడి ఆగడం

- ఏళ్లుగా ఉన్న కాలువ దారి మళ్లింపు

ధర్మవరం రూరల్‌, జూలై7: ధర్మవరం చెరువు నుంచి ఏళ్లుగా ఆయకట్టుకు నీరు అందిస్తున్న కాలువ అది. దాని ద్వారా రెండు గ్రామాల పరిధిలోని ఆయకట్టుకు నీరు అందుతోంది. అలాంటి కాలువనే అధికార పార్టీ నాయకుడు ఏకంగా పూడ్చేశాడు. తన పొలంలో ప్లాట్లు వేసుకునేందుకు కాలువ అడ్డుగా ఉండడంతో ఈ కార్యానికి ఒడిగట్టాడు. ఏకంగా తన పొలం వెలుపల కాలువను మళ్లించాడు. అధికార పార్టీ నాయకుడి దౌర్జన్యంపై ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా.. ఎవరు పడితే వారు.. ఇష్టారాజ్యంగా కాలువను మళ్లించుకుంటూ పోతే.. భవిష్యతలో ఇబ్బందులు తప్పవని ఆందోళన చెందుతున్నారు. మండలంలోని మల్లేనిపల్లికి చెందిన అధికార పార్టీ నాయకుడు నాగేంద్ర తన భూమిని ప్లాట్లు వేసి, విక్రయించేందుకు నిశ్చయించుకున్నాడు. తన పొలం చుట్టూ ఉన్న ధర్మవరం చెరువు కాలువ వెళ్తుండటంతో ప్లాట్లను కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో అధికార మదంతో కాలువను ఎక్స్‌కవేటర్‌తో పూడ్చి వేయించాడు. పొలానికి వెనుకభాగాన రైల్వేలైన సమీపాన కాలువ తీయుంచాడు. అధికార పార్టీ నాయకుడి బాటలో మరికొందరు రైతులు కాలువను పూడ్చి పూడ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై నీటిపారుదల శాఖ ధర్మవరం జేఈ హరీ్‌షను వివరణ కోరగా... కాలువ పూడ్చివేసిన విషయం తమ దృష్టికి రాలేదనీ, గ్రామస్థులు ఫిర్యాదు చేస్తే విచారించి, చర్యలు చేపడతామన్నారు.


Updated Date - 2022-07-08T04:29:56+05:30 IST