వేడెక్కిన ‘కోట’ రాజకీయం..!

ABN , First Publish Date - 2021-11-07T07:01:25+05:30 IST

నగర పంచాయతీ ఎన్నికలు పెనుకొండ కోటలో రాజకీయ వేడిని పెంచుతున్నాయి.

వేడెక్కిన ‘కోట’ రాజకీయం..!

ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇరుపార్టీలు

పెనుకొండలో పాగావేసిన ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు

రూ.కోట్లు గుమ్మరించేందుకు  అధికార పార్టీ సన్నద్ధం

ప్రభుత్వ వ్యతిరేకతే ప్రతిపక్ష నేతల ప్రచార అజెండా...

అనంతపురం, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): నగర పంచాయతీ ఎన్నికలు పెనుకొండ కోటలో రాజకీయ వేడిని పెంచుతున్నాయి. అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్ష టీడీపీలు ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. నామినేషన్ల స్వీకరణ తొలిరోజు నుంచే ఇరుపార్టీల ముఖ్యనేతలు పెనుకొండలో పాగా వేశారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులనంతా అక్కడే మోహరించారు. ఆదినుంచీ టీడీపీకి కంచుకోటగా పెనుకొండ ఉంది. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పెనుకొండలో పాగా వేసిన విషయం తెలిసిందే. అధికార వైసీపీ రెండున్నరేళ్ల పాలన తరువాత పెనుకొండ నగర పంచాయతీకి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఓట రు నాడి ఏ విధంగా ఉంటుందో పసిగట్టలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా నీరుగారిపోతుండటానికి తోడు అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు, భూఅక్రమాలు పేట్రేగిపోతు న్నాయన్న ప్రతిపక్షాల ఆరోపణల నేపథ్యంలో పెనుకొండ నగర పంచాయతీ ఓటర్ల నుంచి వ్యతిరేక పవనాలు వీస్తాయేమోనన్న అభద్రతాభావం ఆ పార్టీ నేతలను కలవరపెడుతోందన్న అభిప్రాయం ఆ పార్టీ వర్గాల నుంచే వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే పెనుకొండ నగర పంచాయతీలోని 20 వార్డుల పర్యవేక్షణ బాధ్యతలను ఎంపీలు, జడ్పీ చైర్‌పర్సన, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన చైౖర్మన్లకు అప్పగించారు. అంటే ఈ ఎన్నికల ప్రభావం ఆ పార్టీలో ఏ మేరకు చూపుతోందో అర్థమవుతోంది. ఈ క్రమంలో రూ.కోట్లు గుమ్మరించేందుకు ఆ పార్టీ సిద్ధమవుతోందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచా రం మేరకు.. తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఆరోపించిన విధంగా... వలంటీర్ల వ్యవస్థను వినియోగించుకున్నారో... ఆ విధానాన్ని కొనసాగిస్తూనే.. మరోవైపు ఒక్కో వార్డుకు రూ.20 లక్షలు ఖర్చు చేసైనా పెనుకొండ కోటలో పాగా వేయాలనే యోచనలో ఆ పార్టీ ముఖ్య నేతలున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన రూ.4 కోట్లు ఖర్చు పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.


ఆ భయంతోనేనా...?

పెనుకొండ నగర పంచాయతీలో 20 వార్డులకుగానూ 20,584 మంది ఓటర్లున్నారు. ఇందులో పురుషులు 10,214 మంది, మహిళలు 10,368 మంది ఉన్నారు. ఇతరులవి రెండు ఓట్లున్నాయి. ఇందులో వివిధ రకాల ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందుతున్న వారి సంఖ్య 5వేలదాకా ఉండొచ్చని అధికార వర్గాల ద్వారా అందిన సమాచారం. వీరందరిపైనా వలంటీర్ల ప్రభావం ఉందనడంలో సందేహం లేదు. ఇప్పటికే లబ్ధిదారులకు వలంటీర్ల ద్వారా వైసీపీకి ఓట్లేయాలనే ప్రచారతంతును ప్రారంభించినట్లు తెలుస్తోంది. వైసీపీకి ఓటేయకపోతే ప్రభుత్వ పథకాలు రద్దవుతాయనే ప్రచారాన్ని చేపట్టినట్లు సమాచారం. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి ఇచ్చిన హామీల్లో కొన్ని అమలు కావడం లేదని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. పెళ్లికానుక ఇప్పటి వరకూ అమలు చేయకపోవడం, ఏడాదికి రూ.250 సామాజిక పింఛన్ల పెంపు చేపట్టకపోవడంతో ప్రజల్లో వ్యతిరేకతకు తావిస్తోంది. దీనికితోడు ప్రభుత్వ పథకాల్లో కోత, పింఛన్ల తొలగింపు అంశాలు ఆ పార్టీకి వ్యతిరేకతను తెచ్చిపెడుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికితోడు మంత్రి హోదాలో పెనుకొండ పట్టణాభివృద్ధిని తీవ్ర నిర్లక్ష్యం చేశారన్న అపవాదు ఉంది. ఈ కారణాల నేపథ్యంలోనే ఆ పార్టీ నేతల్లో ఒకింత భయం రేపుతోందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ పరిస్థితులే ఆ పార్టీ రూ.కోట్లు ఖర్చు చేసేందుకు సన్నద్ధం కావడానికి ప్రధాన కారణమనే అభిప్రాయం వివిధ వర్గాల ప్రజల నుంచి వినిపిస్తోండటం గమనార్హం. 


ప్రభుత్వ వ్యతిరేకతే  ప్రతిపక్ష నేతల ప్రచారాస్త్రం

వైసీపీ రెండున్నరేళ్ల పాలనలో పెనుకొండ పట్టణంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదనే అంశాన్ని ప్రధాన ప్రతిపక్ష టీడీపీ నేతలు ప్రచార అజెండాగా తీసుకుని, ఓటర్లలోకి వెళ్లాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికితోడు ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలన, అధికార పార్టీ నేతల దందాలతోపాటు హా మీల అమలులో డొల్లతనాన్ని ఓటర్లకు వివరించడమే ప్రచారాస్త్రంగా ముందు కు సాగేందుకు టీడీపీ ముఖ్య నేతలు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. అధికార పార్టీకి దీటుగానే ప్రచారా న్ని సాగించేందుకు ఆ పార్టీ ము ఖ్య నేతలంతా సమాయత్తమయ్యారు. ఇప్పటికే పలుమార్లు సమష్టి సమావేశాలు ఏర్పాటు చేసుకుని, ఏ విధంగా ఓటర్లలోకి వెళ్లాలనే ప్రణాళికను రచించుకున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2021-11-07T07:01:25+05:30 IST