వంట..తంట

ABN , First Publish Date - 2021-12-08T05:17:32+05:30 IST

పేద విద్యార్థులకు నేరుగా ప్రయోజనం చేకూర్చే

వంట..తంట
యాచారంలో మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్న నిర్వాహకులు

  • నిర్వాహకులకు భారమైన మధ్యాహ్న భోజనం
  • విద్యార్థుల కడుపు నింపడానికి అప్పులు 
  • పెరుగుతున్న ధరలతో ఇబ్బందులు, సెప్టెంబర్‌ నుంచి అందని బిల్లులు 
  • వంట ఏజెన్సీలకు పేరుకుపోతున్న బకాయిలు
  • తొలి విడతగా అక్షయ పాత్రకు 82 స్కూళ్లు


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌ /యాచారం ) : పేద విద్యార్థులకు నేరుగా ప్రయోజనం చేకూర్చే మధ్యాహ్న భోజనం నిర్వాహకులకు భారంగా మారింది. అప్పులు తెచ్చి విద్యార్థులకు కడుపు నింపుతున్నారు. ప్రతినెలా మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బిల్లులు సక్రమంగా చెల్లించక పోవడంతో నిర్వాహకుల బాధలు వర్ణణాతీతంగా మారాయి. మూడు నెలలుగా బిల్లులు అందక ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు అప్పులు తెచ్చి విద్యార్థుల ఆకలి తీర్చుతున్నారు. జిల్లాలో లక్షల రూపాయలు బకాయిలు పేరుకుపోయాయి. విద్యార్థులు అధికంగా ఉన్న పాఠశాలలో వంట నిర్వహణకు నెలకు సుమారు లక్ష రూపాయల ఖర్చు అవుతుంది. సాధారణ ప్రాథమిక పాఠశాలలో రూ.50 వేల వరకు బిల్లు అవుతోంది. కనీస వేతనాలు ఆశించకుండానే పని చేస్తున్నారు. ప్రభుత్వం కేవలం బియ్యం మాత్రమే అందిస్తుంది. మిగతా సరుకులన్నీ నిర్వాహకులే కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఒక్కో మండలంలో నెలకు రూ. 10లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు మధ్యాహ్న భోజన బకాయిలు పేరుకుపోయాయి. వీటితోపాటు వంట చేసే కార్మికులకు నెలకు చెల్లిస్తున్న గౌరవ వేతనం కూడా మూడు నెలలుగా అందటం లేదు. 

కూరగాయలు, గుడ్ల ధరలు ఇటీవలి కాలంలో భారీగా పెరగాయి. కానీ రాష్ట్ర సర్కారు మాత్రం విద్యార్థులకు అం దించే మోనూ ధరల్లో పైసా కూడా పెంచడం లేదు. ఒకటో తరగతి నుంచి 5వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఒకరోజుకు రూ.4.97, ఆరవ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్న ప్రతి విద్యార్థికి రూ.7.45 ఏజెన్సీలకు ప్రభుత్వం చెల్లిస్తుంది. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలతో పోలిస్తే ఈ నిధులు ఏ మూలకూ సరిపోవడం లేదు. వారానికి మూడుసార్లు గుడ్లు అందించాలని మెనూలో ఉంది. కానీ ప్రస్తుతం గుడ్డు ధర రూ.4.50 ఉంది. సర్కారు చెల్లించే డబ్బులు గుడ్డుకు కూడా సరిపోవడం లేదు. పెరిగిన నిత్యావసర సరుకుల, కూరగాయల ధరలకు తోడు నెలల తరబడి ప్రభు త్వం నుంచి బిల్లులు రాక ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న భోజనం నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ రేట్లు పెంచకపోవడంతో ఏజెన్సీలకు భోజన నిర్వహణ భారంగా మారింది. ప్రభుత్వం ఇచ్చే మెనూ రేటు పెరిగిన ధరలకు గిట్టుబాటు కాక, సకాలంలో బిల్లులు అందక తాము అప్పుల పాలవుతున్నామని ఏజెన్సీ నిర్వాహక మహిళలు వాపోతున్నారు. 


వంట నిర్వహకుల డిమాండ్లు

నెలకు రూ.21 వేలు ఇవ్వాలి. ఏటా రెండు జతల కాటన్‌ దుస్తులను ఇవ్వాలి. మధ్యాహ్న భోజనాన్ని అక్షయ పాత్రకు అప్పచెప్పొద్దు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్‌ చార్జీలు పెంచాలి. ఆరోగ్యభద్రత కల్పించాలి.


కొండెక్కిన కూరగాయల ధరలు

కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. కేజీ టమాట ధర మార్కెట్‌లో రూ.80 పలుకుతోంది. దీంతో విద్యార్థులకు టమాట కూర దూరమైంది. పప్పు దినుసుల రేట్లు కూడా పెరగడంతో నీళ్ల చారే దిక్కవుతోంది. ఏ కూరగాయలు కొందామన్నా రూ.50 పైమాటే. మార్కెట్‌లో కిలో వంకాయ ధర రూ.60, కిలో బెండకాయ రూ.80, కిలో గోకర రూ.80, కిలో బీర రూ.80, కిలో చిక్కుడును 50 రూపాయలకు విక్రయిస్తున్నారు. ధరలు పెరగడం.. వాటికి అనుగుణంగా సర్కార్‌ డబ్బులు చెల్లించకపోవడంతో విద్యార్థులకు పౌష్టికాహారం అందటం లేదు.


కట్టెల పొయ్యితో ఇబ్బందులు

మధ్యాహ్న భోజనం వండేందుకు గ్యాస్‌ సిలిండర్లు అందించాల్సి ఉండగా.. జిల్లాలోని 1,132 స్కూళ్లలో కట్టెల పొయ్యిపై వంట చేస్తున్నారు. వర్షాకాలం వంట చెరుకు తడిసి ఉడకని అన్నం తిని విద్యార్థులు ఇబ్బందులు పడిన దాఖలాలు అనేకమున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో వంట చేసేందుకు కార్మికులకు సిలిండర్‌ పంపిణీ చేస్తామని చెప్పడమే కానీ.. ఇవ్వడం లేదని నిర్వాహకులు పేర్కొంటున్నారు. రాయితీపై వంట గ్యాస్‌ను సరఫరా చేయాలని కోరుతున్నారు. 


మొదటి విడతగా అక్షయ పాత్రకు 82 స్కూళ్లు 

పెరుగుతున్న నిత్యావసర ధరలతో వంట నిర్వాహకులకు గిట్టుబాటు కావడం లేదు. దీంతో ప్రభుత్వం మధ్యాహ్న భోజనాన్ని అక్షయ పాత్రకు అప్పగించాలని నిర్ణయించింది. జిల్లాలో మొదటి విడతగా 82 స్కూళ్లను ఎంపిక చేసింది. మొయినాబాద్‌ మండలంలో 27, శంకర్‌పల్లి మండలంలో 43, చేవెళ్ల మండలంలో 12 పాఠశాలలను ఎంపిక చేసింది. అక్షయపాత్ర ద్వారా ఈనెల 8వ తేదీ నుంచి ఒకటో తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులందరికీ మధ్యాహ్న భోజనం అందించనున్నారు.  


అక్షయ పాత్రను అడ్డుకుంటాం

మధ్యాహ్న భోజన కార్మికుల పొట్టగొట్టే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమిం చుకోవాలి. జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం అక్షయ పాత్రకు అప్పగించడంతో పద్దెని మిదేళ్లుగా పని చేస్తున్న కార్మికులు ఉపాధి కోల్పోవాల్సి వస్తుంది. కార్మికులు రోడ్డున పడితే ఊరుకునే ప్రసక్తి లేదు. జిల్లాలో కార్మికులకు బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు, సొంత ఆస్తులు కుదువపెట్టి పిల్లలకు మధ్యాహ్న భోజనం వండి పెడుతున్నారు. కార్మికుల పొట్టకొడితే రాష్ట్రవ్యాప్తంగా సీఐటీయూ తరఫున ఉద్యమం చేపడతాం.

- జి.కవిత, సీఐటీయూ జిల్లా మహిళా కన్వీనర్‌ 


పెరిగిన ధరలకనుగుణంగా చార్జీలు పెంచాలి

పెరుగుతున్న ధరలకనుగుణంగా తమకు ఇచ్చే బిల్లులు కూడా పెంచాలి. కూరగాయలు, పప్పులు, వంటనూనెల ధరలు ఆకాశాన్నం టుతున్నాయి. మూడు నెలల నుంచి బిల్లులు ఇస్తలేరు. రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని తొలగించి వంట నిర్వహణను అక్షయపాత్రకు ఇవ్వాలని చూస్తుంది. అలా చేస్తే మా బతుకులు రోడ్డున పడుతాయి.

- జహంగీర్‌బీ, వంట కార్మికురాలు, నజ్దిక్‌సింగారం


వంట గ్యాస్‌ అందించి ఆదుకోండి

ప్రభుత్వం మాకు రాయితీపై వంట గ్యాస్‌ అందించి ఆదు కోవాలి. వంట కోసం కట్టెలు కొనలేక నానాగోస తీస్తున్నాం. మేం ఏళ్ల తరబడిగా పొయ్యి మీద వంట చేస్తున్నట్లు అధికారులకు తెలిసినా గ్యాస్‌ ఇవ్వక పోవడం ఎంతవరకు న్యాయం. 

- సుగుణమ్మ, కార్మికురాలు, యాచారం 


వారం రోజుల్లో పూర్తిస్థాయి బిల్లులు ఇస్తాం

వారం రోజుల్లో పెండింగ్‌ బిల్లులు ఇస్తాం. కూరగా యలు, వంట నూనె, పప్పు దినుసుల ధరలు పెరుగు తున్న మాట వాస్తవమే.  వంట నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎప్పటికప్పుడు బిల్లులు ఇస్తున్నాం. కార్మికులకు చార్జీలు పెంచే అధికారం ప్రభుత్వానికే ఉంది.

- రామానుజన్‌రెడ్డి, ఎంఈవో, యాచారం 


రూ.85 కోట్లు మంజూరు

మధ్యాహ్న భోజనానికి సంబంధించి మూడు నెలల బిల్లులు రూ.85కోట్లు మంజూ రయ్యాయి. రెండు రోజుల్లో నిర్వాహకులకు ఖాతాల్లో జమవుతాయి. వారికి నెలకు ఇస్తున్న వేయి రూపాయల పారితోషికం కూడా అందనుంది. మధ్యాహ్న భోజనం నాణ్యతగా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాము.

- సుశీంద్రరావు, డీఈవో


జిల్లాలో మధ్యాహ్న భోజన వివరాలు

ప్రభుత్వ పాఠశాలలు : 1,377

మొత్తం విద్యార్థులు : 1,55,207

మధ్యాహ్న భోజనం తినేవారి సంఖ్య : 1,44,157

ప్రాథమిక విద్యార్థికి చెల్లిస్తున్నది : రూ.4.97

నిర్వాహకులకు అవుతున్న ఖర్చు : రూ.6

ఉన్నత పాఠశాల విద్యార్థికి చెల్లిస్తుంది : రూ. 7.45

నిర్వాహకులకు అవుతున్న ఖర్చు : రూ.9

ఒక్క కోడిగుడ్డుకు చెల్లిస్తున్నది : రూ. 4

మార్కెట్‌లో అమ్ముతున్న గుడ్డు ధర : రూ. 6

వంట మనుషుల సంఖ్య : 2,693

వంట నిర్వాహకులకు పెండింగ్‌ 

బకాయిలు నెలకు : రూ. 2.69 లక్షలు

ఒక మండలానికి నెలకు పెండింగ్‌లో ఉన్న బిల్లు సుమారు : రూ. 10 లక్షలు 

కిచెన్‌షెడ్స్‌ ఉన్నవి : 1,108

గ్యాస్‌ సౌకర్యం ఉన్న స్కూళ్లు : 206

కట్టెల పొయ్యిపై వండే స్కూళ్లు : 1,132



Updated Date - 2021-12-08T05:17:32+05:30 IST