పల్లెల్లో.. పట్టించుకునేదెవరు?

ABN , First Publish Date - 2021-05-15T04:13:18+05:30 IST

పల్లెల్లో కరోనా బాధితులను పట్టించుకునే వారే కరువవుతున్నారు. ఇంటింటా కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. స్వల్ప లక్షణాలు ఉన్న చాలామంది హోం ఐసోలేషన్‌లో ఉండేందుకు మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో మొత్తం యాక్టివ్‌ కేసులు 14,257 ఉండగా.. వీరిలో 11,528 మంది హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు.

పల్లెల్లో.. పట్టించుకునేదెవరు?
సమీక్షలో మాట్లాడుతున్న సబ్‌కలెక్టర్‌ ధనుంజయ్‌




- ఇంటింటా పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు

- హోం ఐసోలేషన్‌ బాధితులకు సక్రమంగా అందని కిట్లు

- వైద్యసేవలు, సలహాలు కరువు

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

పల్లెల్లో కరోనా బాధితులను పట్టించుకునే వారే కరువవుతున్నారు. ఇంటింటా కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. స్వల్ప లక్షణాలు ఉన్న చాలామంది హోం ఐసోలేషన్‌లో ఉండేందుకు మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో మొత్తం యాక్టివ్‌ కేసులు 14,257 ఉండగా.. వీరిలో 11,528 మంది హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు. కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో 873 మంది, కొవిడ్‌ ఆస్పత్రుల్లో 1,856 మంది చికిత్స పొందుతున్నారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న ప్రతి ఒక్కరికీ మందుల కిట్లు అందజేస్తున్నట్లు అధికారులు ప్రకటిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం అందడం లేదు.  మారుమూల పల్లెలకు కిట్లు అందడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటా కరోనా పాజిటివ్‌ బాధితులు ఉన్నా, అధికారిక లెక్కల ప్రకారం వెలుగులోకి రావడం లేదు. వైద్య సిబ్బంది సాధారణ రోజుల్లోనే గ్రామాల్లో పర్యటించడం అరుదు. ఏఎన్‌ఎంలు, ఎంపీహెచ్‌ఓలు, హెల్త్‌ అసిస్టెంట్‌లు సబ్‌ సెంటర్‌ పరిధిలోని గ్రామాల్లో ఉండి సేవలు అందించాలి. కానీ సిబ్బంది మండల కేంద్రాలు, జిల్లా కేంద్రం నుంచి చుట్టపు చూపుగా రాకపోకలు సాగిస్తున్నారు. కరోనా విపత్తు సమయంలోనూ వారు స్థానికంగా ఉండడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులూ పట్టించుకోకపోవడంతో సిబ్బందిలో నిర్లక్ష్యం పెరుగుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. వలంటీర్ల ద్వారానే మొక్కుబడిగా వ్యవహారాలు చక్కబెడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రూ.వేలకు వేలు జీతాలు తీసుకుంటున్న వైద్య సిబ్బంది గ్రామాల్లో ఉండి సేవలు అందించకపోతే తామెందుకు పనిచేయాలంటూ కొంతమంది ఆశావర్కర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో హోం ఐసోలేషన్‌ బాధితులకు సక్రమంగా సేవలు అందడం లేదు.  ఈ క్రమంలో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటువంటి వాటిని అధికారులు కొవిడ్‌ మరణాలుగా గుర్తించడం లేదు. అనారోగ్యంతోనే మృతిచెందినట్టు వెల్లడిస్తున్నారు. 


 బాధితులెందరో.. 

- బూర్జ మండలంలోని తడ్డలి గ్రామంలో 20 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వీరిలో 12మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. 8 మందిని శ్రీకాకుళంలోని పాత్రునివలస క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు.  ఇదే మండలంలో అల్లిన, డొంకపర్తి గ్రామాల్లో  పాజిటివ్‌ కేసులు ఎక్కువగా ఉన్నాయి. 

- పొందూరు మండలం తండ్యాం గ్రామంలో 1,274 మంది జనాభా ఉన్నారు. ఇక్కడ కేసులు ఎక్కువగా ఉన్నా అధికారిక లెక్కల ప్రకారం కేవలం 17 మంది బాధితులు మాత్రమే హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు చెబుతున్నారు.  

- మెళియాపుట్టి మండలం డబారు గిరిజన గ్రామంలో 40 ఇళ్లు ఉన్నాయి. సుమారు 250 మంది ఉన్నారు. ఇక్కడ 8 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇటీవలే కిట్లు అందజేశారు. వైద్య సేవలు సక్రమంగా అందడం లేదు. 

- సోంపేట మండలం సిరిమామిడి పంచాయతీ ఎర్రముక్కాం, తోటూరు గ్రామాల్లో 31 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇప్పటికే ముగ్గురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కిడ్నీ బాధితులకు కరోనా సోకి మరో 20 మంది వరకు మృతి చెందారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న బాధితులకు మందులు అందుతున్నా, వైద్యపరమైన సలహాలు ఇచ్చేవారే కరువయ్యారు. ఇప్పటికైనా హోం ఐసోలేషన్‌ బాధితులకు సక్రమంగా కిట్లు అందజేసి.. వైద్య సలహాలు.. సూచనలు ఇవ్వాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 


కిట్లు అందజేయండి 

కరోనా బారినపడి హోంఐసోలేషన్‌లో ఉంటున్న ప్రతి ఒక్కరికీ కొవిడ్‌ కిట్లు అందజేయాలని సబ్‌కలెక్టర్‌ సూరజ్‌ ధనుంజయ్‌ అధికారులకు సూచించారు. శుక్రవారం ఇచ్ఛాపురం తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణలో వైద్యులు, ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటా ఫీవర్‌ సర్వే పక్కాగా చేపట్టాలని, ఎవరైనా సహకరించకపోతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాని సూచించారు. కొవిడ్‌ బారినపడి ఇంట్లో ఎంతమంది భాదితులు ఉంటే అంతమందికీ కిట్లు అందజేయాలన్నారు. పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పట్టేలా ప్రజలను చైతన్య పరచాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ మురళీమోహన్‌రావు, నోడల్‌ అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-15T04:13:18+05:30 IST