ఇంటి పర్మిషన్‌.. ఇదో టెన్షన్‌

ABN , First Publish Date - 2022-01-24T04:52:03+05:30 IST

పట్టణాల్లో ఇంటి నిర్మాణానికి అనుమతి రావడం ఆషామాషీ కాదంటున్నారు ఆయా మున్సిపాలిటీ అధికారులు. గతంలో దరఖాస్తు చేయగానే వెంటనే అనుమతి వచ్చేది. కానీ ప్రస్తుతం టీఎ్‌స-బీపాస్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు.

ఇంటి పర్మిషన్‌.. ఇదో టెన్షన్‌

  పట్టణాల్లో టీఎ్‌స-బీపాస్‌ విధానం

 అనుమతికి కఠిన నిబంధనలు

 25 శాతం దరఖాస్తుల తిరస్కరణ

 ప్రత్యేక కమిటీకి చేరిన ఫిర్యాదులపై నాన్చివేత



ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, జనవరి 23: పట్టణాల్లో ఇంటి నిర్మాణానికి అనుమతి రావడం ఆషామాషీ కాదంటున్నారు ఆయా మున్సిపాలిటీ అధికారులు. గతంలో దరఖాస్తు చేయగానే వెంటనే అనుమతి వచ్చేది. కానీ ప్రస్తుతం టీఎ్‌స-బీపాస్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ పోర్టల్‌లో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు సమర్పించడం.. నిబంధనల ప్రకారం అనుమతి కోరితేనే 15 రోజుల్లో గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తున్నారు. లేదంటే తిరస్కరించడమో.. ఒక వేళ ఆ ఇంటి నిర్మాణం ప్రారంభిస్తే ఆ కట్టడాన్ని కూల్చివేయడమో జరుగుతున్న పరిస్థితి జిల్లాలో నెలకొంది. సిద్దిపేట జిల్లాలో గజ్వేల్‌, హుస్నాబాద్‌, చేర్యాల, దుబ్బాక, సిద్దిపేట మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ పట్టణాల్లో ఎలాంటి నిర్మాణం చేపట్టాలన్నా టీఎ్‌స-బీపాస్‌ ద్వారా దరఖాస్తు చేసి అనుమతి పొందాల్సిందే. 


సెట్‌బ్యాక్‌ లేకుంటే నో పర్మిషన్‌


ఇంటి నిర్మాణం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసే సందర్భంలో ఆ స్థలానికి సంబంధించిన అన్ని వివరాలు సమర్పించాలి. స్థలం హద్దులతో పాటు తప్పనిసరిగా స్థలం మ్యాప్‌ జత చేయాలి. ఈ మ్యాప్‌లో 30 ఫీట్ల రహదారి ఉంటేనే ఇంటికి అనుమతి ఇస్తున్నారు. కొందరు తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించడం.. ఆ తర్వాత అవి బయటపడడం కూడా చోటుచేసుకున్నాయి. అందుకే మున్సిపల్‌ ప్లానింగ్‌ అధికారులు ఫీల్డ్‌ విజిట్‌ చేస్తున్నారు. దరఖాస్తు ఆధారంగా సదరు చిరునామా వద్దకు వెళ్లి అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాతనే ఇంటి అనుమతికి గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తున్నారు. లేదంటే వెంటనే తిరస్కరిస్తున్నారు. గతంలో 18 ఫీట్లు, 21 ఫీట్లు, 24 ఫీట్ల రోడ్ల పక్కనే ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చారు. ఇప్పుడా పరిస్థితి లేదు. అయితే దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో ఐదారు గ్రామాలు విలీనమయ్యాయి. గ్రామాల్లో 30 ఫీట్ల రోడ్లు లేకపోవడంతో ఉన్న రహదారుల పక్కనే ఇళ్ల నిర్మాణానికి అనుమతి కోరుతున్నారు. దీంతో ఆ దరఖాస్తులన్నీ తిరస్కరణకు గురవుతున్నాయి. ఇక్కడ 172 దరఖాస్తులు సమర్పిస్తే 62 దరఖాస్తులను తిరస్కరించారు. సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇమాంబాద్‌, గాడిచెర్లపల్లి, లింగారెడ్డిపల్లి, రంగధాంపల్లి, నర్సాపూర్‌ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి.


టాస్క్‌ఫోర్స్‌ కమిటీకే ఫిర్యాదులు


టీఎ్‌స-బీపా్‌సను సక్రమంగా అమలు చేయడానికి జిల్లా స్థాయిలో టాస్క్‌ఫోర్స్‌ కమిటీని నియమించారు. ఇందులో పోలీసు, రెవెన్యూ, మున్సిపల్‌ తదితర శాఖల అధికారులు ఉన్నారు. నిబంధనలు లేని ఇంటి అనుమతి దరఖాస్తులను తిరస్కరించడం మున్సిపాలిటీ అధికారుల బాధ్యత కాగా.. ఎలాంటి అనుమతులు లేకున్నా కట్టిన ఇళ్లను పరిశీలించే బాధ్యతను ఈ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ చూస్తున్నది. నిబంధనలను పూర్తిగా అతిక్రమించిన పలు ఇళ్లను కూల్చివేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే వీరికి అప్పగించిన పలు ఫిర్యాదులు సైతం పెండింగ్‌లోనే ఉన్నాయి. దీనిపై నాన్చుతున్నట్లుగా అర్థమవుతోంది. రాజకీయపరమైన ఒత్తిళ్లు కూడా ఇందుకు కారణం కావొచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. హుస్నాబాద్‌లో 10 అక్రమ ఇళ్ల నిర్మాణాల వివరాలను ఈ కమిటీకి అప్పగించగా.. ఒక్క ఇంటిపై కూడా చర్యలు తీసుకోలేదు. చేర్యాలలో 25 ఇళ్లను, గజ్వేల్‌లో 39 ఇళ్లను, సిద్దిపేటలో సుమారు 100కు పైగానే అక్రమ నిర్మాణాలను టాస్క్‌ఫోర్స్‌ కమిటీకి బదలాయించారు. ఇందులో కొన్నింటిని కూల్చివేయగా.. మరికొన్నింటి విషయంలో స్థబ్దత నెలకొంది. 


నిబంధనలతో రాజకీయ ఒత్తిళ్లు


ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కఠిన నిబంధనలు ఉండడంతో రాజకీయ పరమైన ఒత్తిళ్లు కూడా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇంటి పర్మిషన్‌ కోసం యజమానుల నుంచి వసూళ్లు చేస్తున్న దాఖలాలు అక్కడక్కడ వినిపిస్తున్నాయి. ఇందులో పలుచోట్ల కౌన్సిలర్లు, ఇతర నాయకులు మధ్యవర్తులుగా ఉంటూ మున్సిపల్‌ అధికారులతో రాయబేరాలు కుదుర్చుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అలా నిర్మించిన ఇళ్లపై ఫిర్యాదులు రావడం.. వీటిని టాస్క్‌ఫోర్స్‌ కమిటీకి అప్పగించడం జరుగుతున్నాయి. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లోనూ సెట్‌ బ్యాక్‌ లేకుండా, 30 ఫీట్ల రోడ్లు పరిమితి లేకుండా, ఇష్టారాజ్యంగా అంతస్తులు నిర్మించి దర్శనమిస్తున్నవన్నీ ఇలా అడ్డదారుల్లో వెళ్లినవేనని చెప్పడం నిస్సందేహం. 


 

Updated Date - 2022-01-24T04:52:03+05:30 IST